పిల్లకాకిపై ఉండేలు దెబ్బ!

‘‘‌గత రెండు, మూడు సంవత్సరాలుగా కోవిడ్‌ ‌మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్‌ ‌లైన్‌ ‌తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జి.ఓ.33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించడంతో పాటుగా ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి ద్వారా మోడల్‌ ‌పేపర్లను కూడా విడుదల చేసింది.  కాని ఫిజికల్‌ ‌సైన్స్, ‌బయోలాజికల్‌ ‌సైన్స్ ‌రెండు సబ్జెక్ట్‌ల పరీక్షలను ఒకేరోజు ఒక్కొక్క పేపర్‌ను ఒక గంట ముప్పై నిముషాలపాటు నిర్వహించాలని ఉత్వర్వులలో పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది.’’

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మరియు రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి (ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి)  వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటూ అభాసుపాలవుతూ అటు విద్యార్థులను, ఇటు ఉపాధ్యాయులను ఇబ్బందులను గురిచేస్తున్నది. అటువంటి వివాదస్పద ఉత్తర్వుల జాబితాలో చేరిన మరొకటి జి.ఓ.యం.ఎస్‌ ‌నెం.33. తేది:28.12.2022 రోజున తాజాగా 10వ తరగతి పరీక్షలపై నిర్వహణపై ఇవ్వబడింది. వాస్తవానికి ఈ ఉత్తర్వు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సి ఉండగా సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1 ‌పరీక్షలు 11పేపర్లుగా రాసిన అనంతరం చాలా ఆలస్యంగా డిసెంబర్‌లో మేలుకోవడమే విద్యాశాఖ అలసత్వానికి నిదర్శనం. కోవిడ్‌కు ముందు 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. హిందీకి మినహ మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లను రెండు పేపర్లుగా విభజించి పరీక్షలు నిర్వహించేవారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా కోవిడ్‌ ‌మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్‌ ‌లైన్‌ ‌తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జి.ఓ.33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించడంతో పాటుగా ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి ద్వారా మోడల్‌ ‌పేపర్లను కూడా విడుదల చేసింది.  కాని ఫిజికల్‌ ‌సైన్స్, ‌బయోలాజికల్‌ ‌సైన్స్ ‌రెండు సబ్జెక్ట్‌ల పరీక్షలను ఒకేరోజు ఒక్కొక్క పేపర్‌ను ఒక గంట ముప్పై నిముషాలపాటు నిర్వహించాలని ఉత్వర్వులలో పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది.

వాస్తవానికి నిర్వాహణలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక పేపరు రాసిన వెంటనే ఆ పేపరును తీసుకొని మరో పేపరును విద్యార్థికి స్పల్ప సమయం తేడాతో ఇస్తారు. రెండు పేపర్లను చదువుకోవడానికి మరో ఇరవై నిముషాల సమయం అదనంగా ఇచ్చినా మూడు గంటల ఇరవై నిముషాల పాటు ఈ రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహించబడడం వలన విద్యార్థికి చాలా అన్యాయం జరుగడంతోపాటుగా, ఇటు పరీక్ష నిర్వాహకులకు చాలా ఇబ్బందికరమైన విషయం కూడా. అందుకని ఈ రెండు పరీక్షలను వేరు వేరు రోజులలో నిర్వహించాలని తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖను కోరుతున్నా పట్టించుకోవడంలేదు. గతంలో ఒక్కొక్క సబ్జెక్ట్ ‌రెండు పేపర్లు ఉండగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లోని అన్ని పాఠాలను మొత్తం చదివి ఒకే రోజు పరీక్షను రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరమున్నది. రెండు పేపర్ల విధానంలో పరీక్షలు ఉన్న సందర్భాలలో సంక్షిప్తరూప ప్రశ్నలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్‌ ‌చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను పెంచడం వలన రాసే సమయం అధికంగా పెరగడమేకాక, ఛాయిస్‌ ‌విధానాన్ని తగ్గించడం వలన విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి సమయం సరిపోక 10 జి.పి.ఏను సాధించడం కష్టంగా మారింది. ఆయా సబ్జెక్ట్‌లకు సంబందించిన ప్రశ్నాపత్రాల్లోని బ్లూ ప్రింట్‌లో ఒకటి, రెండు సెక్షన్లలో కూడా చాయిస్‌ ‌పెంచాలని, 2 మార్కులు, 3 మార్కుల ప్రశ్నలకు కనీసం 40%ఛాయిస్‌ ఇవ్వాలని, ప్రశ్నపత్రాల్లోని మూడవ సెక్షన్‌ ‌లో వ్యాస రూప ప్రశ్నల సంఖ్యను తగ్గించి సంక్షిప్త ప్రశ్నల భారత్వాన్ని పెంచాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. జిల్లా కేంద్రాల్లోని డి.సి.ఇ.బిలకు ప్రీఫైనల్‌ ‌ప్రశ్నపత్రాల తయారీకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను సమకూర్చాల్సి కూడా ఉంటుంది. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులో స్పష్టతను ఎక్కడ కూడా పొందుపరుచలేదు.

అదే విధంగా ఆర్‌.‌సి.నెం.185/ఇవిఎల్‌/‌టి.ఎస్‌.ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి/2021, తేది:30.12.2022 ద్వారా స్పెషల్‌ ‌రివిజన్‌ ‌క్లాసుల పేరిట మరో టి.ఎస్‌.ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి వారు మరో వివాదస్పద ఉత్తర్వును ఇచ్చారు. వారాంతపు సెలవులను, సెలవుదినాలను కూడా మినహాయించకుండా ఉదయం 8 గం।।ల నుండి సాయంత్రం 6 గం।।ల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్‌ ‌క్లాసులు నిర్వహించాలనే నాన్‌ ‌రెసిడెన్షియల్‌ ‌పాఠశాలల్లో  తలపెట్టడం విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాల్లోని రెండు, మూడు గ్రామాల నుండి విద్యార్థులు తమ పరిసరాల్లోని హైస్కూల్‌కు వస్తారు. ముఖ్యంగా అమ్మాయిలను సాయంత్రం 6 గంటల వరకు ఉంచడం వారికి సంబంధించిన రవాణాసౌకర్యంతో పాటుగా భద్రతాపరమైన అంశాలపై జవాబుదారి ఎవ్వరనే ప్రశ్న తలెత్తుతున్నది. సాయంత్రం 5.30 వరకు పాఠశాలలో ఉంచి ఇంటి వద్ద చదువుకునే విధంగా తల్లిదండ్రుల బాధ్యతను, భాగస్వామ్యాన్ని ఎందుకు పెంచడంలేదో అర్థంకావడంలేదు. పాఠశాలలో కేవలం మద్యాహ్నాభోజన సౌకర్యం మాత్రమే ఉన్నది. ఉదయం ఎనమిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, ‌సాయంత్రం స్నాక్స్ ఇవ్వడానికి విద్యాశాఖ నుండి పాఠశాలలకు ఎటువంటి నిధులు లేవు. ఆయా పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సహకారంతో గ్రామస్థుల వద్ద నుండి వీటిని సమకూర్చడానికి బిక్షాటన చేయాల్సిరావడం దురదృష్టకరం.

జాయిఫుల్‌ ‌లర్నింగ్‌కు, ఆర్‌.‌టి.ఇకి విరుద్దంగా వారాంతపు, ప్రభుత్వ సెలవు దినాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర విద్యాపరిశోధన మరియు శిక్షణా సంస్థ (ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి) మరియు పాఠశాల విద్యాశాఖ అధికారుల మద్య సమన్వయలోపం చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి గతంలో ఎప్పుడు నేరుగా ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చేదికాదు. ఏ ఆదేశాలైనా పాఠశాల విద్యాశాఖాద్వారానే వచ్చేవి. కాని ఈ మద్యకాలంలో నేరుగా పాఠశాల విద్యాశాఖతో సంబంధం, సమన్వయం లేకుండానే పాఠశాలకు సంబంధించిన పనిదినాలపైనా, సెలవులపైనా పాఠశాల విద్యాశాఖ జారీచేసిన అకాడమిక్‌ ‌క్యాలెండర్‌కు భిన్నంగా ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి దాని పరిధినిదాటి ఆధిపత్యధోరణితో కూడిన ఆదేశాలను జారీచేయడం వివాదస్పదమై విమర్శలకు దారితీయడమేకాక ఎవరి ఆదేశాలను పాటించాలో ఉపాధ్యాయులలో ఒక గందరగోళపరిస్థితి నెలకొనడానికి కారణమవుతున్నది. ఎ.సి గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే అధికారులు తమ పదవులను, డిప్యూటేషన్లను పదికాలాలపాటు కాపాడుకోవడం కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారనే విమర్శ ఉండనే ఉన్నది. ఒక ప్రయోగాన్ని పథకాన్ని రూపొందించేటప్పుడు పాఠశాల స్థాయిలో ఉండే ఉపాధ్యాయుల కొరత, వసతుల, వనరులేమి సమస్యలను ఏ మాత్రం కూడా గమనంలోకి తీసుకోకుండా రుద్దడం దురదృష్టకరం. ఏదైన ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని వివాదాలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ, టి.ఎస్‌.ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టిలు ఇప్పటికైనా విధానాల రూపకల్పన చేస్తే భవిష్యత్తులో ఎటువంటి విమర్శలు, వివాదాలు లేకుండా విద్యావ్యవస్థ సజావుగా కొనసాగుతుంది! ఒంటెద్దుపోకడలకు అలవాటుపడ్డ విద్యాశాఖ, ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టిలు తన విధానాలను మార్చుకుంటుందా లేదా అనేది సందేహస్పదమే!
– డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు, రాష్ట్ర  ప్రధానకార్యదర్శి, తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌, 9701007666.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page