పిల్లి శాపనార్థాలు…

కెసిఆర్‌తో పాటు ఆయన అనుయాయులు, అనుచరులు కూడా శాపనార్థాలకు అలవాటు పడ్డారు. గత పదేళ్లుగా రాజ్యం అనుభవించిన వారు ఇప్పుడు తట్టుకోలేక పోతున్నారు. అధికారం పోయిందన్న బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే తెలంగాణ అంతా ఆగం అయిపోయిందన్న రీతిలో గగ్గోలు పెడుతు న్నారు.  వారు లేకుంటే రాష్ట్రం  అతలాకుతలం అవుతుందనీ, అభివృద్ది ఆగిపోతుందని భావిస్తున్నారు. తెలంగాణ లో పదేళ్లుగా సాగు,తాగునీటికి ధోకా  లేకుండా చేశామని కెసిఆర్‌ అంటున్నారు. మరి ఈ మూడు నెలల్లోనే ఆ నీరంతా ఎక్కడికి పోయిందో కెసిఆర్‌ చెప్పాలి. కాళేశ్వరం అవినీతిపైనా,ఆర్థిక దుస్థితిపైనా నోరు విప్పడం లేదు. రైతుబంధు పేరుతో జరిగిన అక్రమాలపై నోరు మెదపని కెసిఆర్‌ రేవంత్‌పై పిల్లి శాపనార్థాలు పెడితే.. ఉట్టి తెగిపడుతదా..అన్న చందంగా  దుమ్మెత్తి పోస్తున్నారు.లిల్లీ పుట్‌  ప్రభుత్వం అంటూ విమర్శలు చేస్తున్నారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ఎత్తుగడలో భాగంగా విమర్శలకు పదను పెట్టారని భావించాలి. ఎందుకంటే ప్రాజెక్టులు కట్టి ఉంటే నీళ్లు ఏమయ్యాయి.

మిషన్‌ భగీరథ సక్రమంగా ఉంటే ఎందుకు ఈ మూడు నెలల్లోనే పథకం నీరుగారి పోయింది. అంటే పథకం పేరుతో చేసిన ప్రచారం అంతా ఉత్తిదే అని అర్థం చేసుకోవాలి. ఇంతకాలం అబద్దాలు ప్రచారం చేసి ప్రజలను నమ్మించారని అనుకోవాలి. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలపై రెండు మూడు రోజులలో టీవీలలో కూర్చుని మొత్తం చెబుతానని  కెసిఆర్‌ విూడియాతో చెప్పారు. కానీ  ప్రకటనలు చేసి..రోజులు గడిచిపోతున్నా..ఆయన టీవీల ముందుకు రాలేకపోయారు.  లిక్కర్‌ కేసులో ఆఖరికి  కుమార్తె అరెస్టు గరించి కూడా ఒక్క మాట మాట్లాడటం లేదు. కవితను ఈడీ జైలుకు పంపి నెల రోజుల అయింది. ఈ లోపు సీబీఐ కూడా అరెస్టు చూపించింది. అయినా ఎన్నికల బహిరంగసభల్లో కేసీఆర్‌ రేవంత్‌ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకుంటున్నారు తప్ప నిజాలు వెల్లడిరచడం లేదు. రాజకీయ వ్యాఖ్యలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నంలో రేవంత్‌ బీజేపీలో చేరబోతున్నారని ఓ రాయి విసిరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోకి వొచ్చాక అనేక విషయాలపై ఆరోపణలు వొచ్చాయి. అన్నింటికి మించి ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దద్దరిల్లుతోంది. ఇలా కేసీఆర్‌ ఇంకా అనేక కీలక విషయాలపై స్పందించడం లేదు. కూతురు కవిత అరెస్టుపై ఇంతవరకు స్పందించలేదు. తన కూతురు అరెస్టు అక్రమమని కాని సక్రమమని కాని కేసీయార్‌ ఇంతవరకు మాట్లాడకపోవటమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూతురును దిల్లీ  లిక్కర్‌ స్కామ్‌ లో ఈడీ, సీబీఐలు అరెస్టులు చేసినా సైలెంట్‌ గా ఉన్నారు.

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న టెలిఫోన్‌  ట్యాపింగ్‌ అంశంపై విచారిస్తున్న స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఇప్పటికే సుమారు పదిమంది పోలీసు అధికారులను అరెస్టుచేశారు. వీరంతా బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నపుడు ప్రత్యర్ధుల ఫోన్లను ఎలా ట్యాపింగ్‌ చేసింది పూసగుచ్చినట్లు చెప్పినట్లు విూడియా లో ప్రచారం జరుగుతోంది. అరెస్టయిన పోలీసు అధికారులు చెప్పిన సమాచారం ప్రకారం ప్రభుత్వంలోని పెద్దతలకాయ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్‌ జరిగిందని  వాంగ్మూలాలు ఇచ్చారని అంటున్నారు.  ఇదే విషయమై మంత్రులు, అధికార కాంగ్రెస్‌ నేతలు, కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి,మాజీ గవర్నర్‌ తమిళి సై  తదితరులంతా ట్యాపింగ్‌ కు బాధ్యులుగా కేసీయార్‌, కేటీయార్‌, హరీష్‌ రావులపైనే ఆరోపణలు చేస్తున్నారు. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కు బాధ్యత వహించాల్సింది కేసీయారే అని అందరికీ తెలుసు. పైగా తమ హయాంలో ట్యాపింగ్‌ జరిగిందని స్వయంగా కేటీయారే అంగీకరించారు. కొడుకు ట్యాపింగ్‌ జరిగిందని అంగీకరించిన తర్వాత ట్యాపింగ్‌ జరగలేదని కేసీయార్‌ అనేందుకు లేకుండా పోయింది. ట్యాపింగ్‌ తో తనకు సంబంధం లేదని తప్పించుకునేందుకూ లేదు. ఇవన్నీ పక్కన పెట్టి కొత్తగా పల్లవి అందుకున్నారు.

ఇప్పుడు కేటీఆర్‌ తో పాటు కేసీఆర్‌ కూడా.. రేవంత్‌ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రేవంత్‌ రెడ్డి విూద ప్రజల్లో అపనమ్మకం కలిగించడమా లేక తమకు ఎన్నికల్లో లబ్ది చేకూరుతుందని అనుకుంటున్నారా అన్నది అర్థం కావడం లేదు. రాష్టాన్న్రి కుదిపివేస్తున్న కీలక అంశాలపై స్పందించకుండా రేవంత్‌ రెడ్డి బీజేపీలోకి వెళ్తారంటే..  బీఆర్‌ఎస్‌కు ప్రజలు వోట్లు  వేస్తారా అన్న ప్రశ్న కూడా సహజంగానే వొస్తుంది. కేవలం రాజకీయ ప్రకటనలతో మభ్య పెట్టడం మానుకోవాలి. ఇప్పటికే ఎన్నికల నాటకంలో బిఆర్‌ఎస్‌ నేతలు భంగపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంతోపాటు ప్రజల అభిమానాన్ని చూరగొన్నట్లు ప్రకటించుకుంటున్నారు. ఇక అంతా బాగు చేశానని ప్రకటించిన సింగరేణి నిధులు కరిగిపోగా.. అప్పుల కోసం వేట మొదలుపెట్టింది. అప్పుల కోసం ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగు తోంది. ప్రతి ఏటా భారీ లాభాలను ఆర్జిస్తున్నట్టు ప్రకటనలు చేస్తూనే అప్పుల కోసం అన్వేషించడం మేడిపండు చందంగా కనిపిస్తోంది. ఇచ్చిన హావిూలను పక్కన పెట్టడం, ప్రజలను మభ్య పెట్టడం గత పదేళ్లలో కెసిఆర్‌ బాగా అలవాటు చేసుకున్నారు. ఉన్నది లేనట్లుగా ప్రచారం చేయడంలో వీరు దిట్టలని తేలిపోయింది.

నిజాం షుగర్స్‌ 9 ఏళ్లయినా తెరుచుకోలేదు. ఆజంజాహీ ముచ్చటేలేదు. ఆసియాలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ మూతపడి కార్మికులు రోడ్డుపాలయ్యారు. తాము అధికారంలోకి వొస్తే వంద రోజుల్లోనే మూతపడిన ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ప్రకటించారు. ఉమ్మడి వరంగల్‌లోని ఏపీ రేయాన్స్‌ ఫ్యాక్టరీ పరిస్థితి కూడా ఇంతే. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల ఊసెత్తని కేసీఆర్‌ పదేళ్లుగా ప్రజలను మోసం చేశారు. నిజంగానే కెసిఆర్‌కు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించే వారు.ఎన్నికల ముందు చేసే ప్రయత్నాలు ఎప్పటికైనా బెడిసి కొడతాయి.  రాజకీయాలు చేయడం వేరు..ప్రజలకు సేవచేయడం వేరు..ప్రజలను నమ్మించి వోట్లు కొనుగోలు చేయడం వేరు. ఈ ప్రక్రియలో ఎవరు ఎటువైపు అన్నది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అందువల్ల చిత్తశుద్దితో చేసే ప్రయత్నాలను మాత్రమే ప్రజలు స్వాగతిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కెసిఆర్‌, బిఆర్‌ఎస్‌ నేతలు రేవంత్‌ ప్రభుత్వం విషయంలో చేస్తున్న ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు.
 `ప్రజాతంత్ర డెస్క్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page