- ఒక్క పంపును ప్రారంభిస్తే..ప్రాజెక్టు పూర్తయినట్టా?
- బీఆరెస్‌కు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
- అనుచరులతో కాంగ్రెస్‌లో చేరిన కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : కేసీఆర్ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని అభివృద్ధి జరగలేదని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పూర్తి కాకుండానే ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టు మొత్తం 31 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం ఒక్క పంప్‌ను ప్రారంభించి ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీభవన్‌లో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…గతంలో తాను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్ రెడ్డి అండగా నిలబడ్డారని, తన రాజకీయ ఎదుగుదలలో ప్రతీసారి అండగా నిలబడ్డారని తెలిపారు.
2009లో టీడీపీతో టీఆరెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను ఎంపీగా గెలిపించారని, అప్పుడు కేసీఆర్ గెలుపులో కొత్తకోట దయాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇక తొమ్మిదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేంలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో సీతా దయాకర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు దేవరకద్రను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఆ తరువాత ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడున్న బీఆరెస్ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగలకంటే దారుణంగా తయారయ్యారని, కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప ఎమ్మెల్యేకు దేవరకద్ర అభివృద్ధి పట్టడంలేదని ఆరోపించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలను పడావుపెట్టారని, అందుకే వొచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని రేవంత్ రెడ్డి అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నేతలకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని, సీతక్కను కూడా రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుందని భరోసానిచ్చారు రేవంత్ రెడ్డి. వొచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వొస్తుందని, కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమన్నారు. ఈ నెల 16, 17, 18న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, ఇతర జాతీయ నాయకులు రాష్ట్రానికి వొస్తున్నారని, ఈ నెల 17న తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే విజయ భేరికి భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మానకొండూరు బీఆరెస్ నేతలు
మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన పలువురు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కాలువ మల్లేశం, శ్రీనివాస్‌తో సహా పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ నివాసంలో వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.