పెన్ను గన్నులతో పోరాడిన యోధుడు

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఎందరో పోరాట యోధులు, త్యాగ ధనులు ఎన్నో పోరాట పంథాలను ఎన్నుకున్నారు. అలాంటి వారిలో రావెళ్ళ వెంకట రామారావు ఎన్నదగిన యోధుడు. తన పెన్ను, గన్ను ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని,  పోరాట స్ఫూర్తిని కల్పించి ఎందరికో  మార్గ నిర్దేశనం చేశాడు. ఆయన తొలితరం కవి. సాయుధ దళ కమాండర్‌. రావెళ్ళ వెంకట రామారావు (జనవరి 31, 1927 – డిసెంబర్‌ 10, 2013) తెలంగాణ గర్వించ తగిన  సాయుధ పోరాట యోధుడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు.

అయన  ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో 1927, జనవరి 31 న రైతు కుంటుంబంలో లక్ష్మయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భూమి కోసం, భుక్తి కోసం, నిజాం రాచరిక పాలనకు చరమగీతం పాడేందుకు, నైజాం దమన కాండ అంతం కోసం తుపాకి పట్టి దళ కమాండర్‌గా ముందుకు దూసుకు వెళ్ళాడు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడై, రావెళ్ల 1944 లో ఆంధ్ర మహాసభలో చేరాడు. 1947 ప్రాంతంలో ‘‘నవభారత’’, ‘‘స్వతంత్ర భారత’’ పత్రికలలో నైజాంపాలనను విమర్శిస్తూ అభ్యుదయ జానపద శైలిలో రచనలకు శ్రీకారం చుట్టాడు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో ‘‘తొలిదశ కమాండర్‌’’గా పెన్నూ గన్నూ చేతబట్టి బరిలోకి దూకి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడాడు. రహస్య జీవితం గడుపుతూ పోరాట ఉద్యమం నిర్వహించాడు. 1948 అక్టోబర్‌ నుంచి 1952 డిసెంబర్‌ వరకు గుల్బర్గా, ఔరంగాబాద్‌, బీడ్‌, ఢల్లీి, ఖమ్మం తదితర జైళ్లలో గడిపి…జైళ్లలో దుస్థితిని మార్చాలని 16 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా చదవడం, రాయడం సౌకర్యాన్ని సాధించాడు. ఢల్లీి కేంద్ర కారాగారంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్‌ గుప్తా, మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి దశరథదేవ్‌, కే ఎన్‌ సింగ్‌, బర్దన్‌, కెప్టెన్‌ మహ్మద్‌ తదితరులు రావెళ్లకు సహచరులుగా ఉన్నారు. 1952 డిసెంబర్‌ 8వ తేదీన ఆయన జైలు నుంచి విడుదల అయ్యాడు.

నేలకొండపల్లి మండలం బోదుల బండలో క్యాంపు నిర్వహణ సమయాన ఓ సైనికుడు జరిపిన కాల్పుల్లో ఒక తూటా రావెళ్ల శరీరంలోకి దూసు కెళ్లింది. అయినప్పటికీ శక్తినంతటినీ కూడగట్టుకుని ఆయన కాల్పులు సాగించి, సైనికులను పలాయనం చిత్త గించెలా చేశాడు. ‘‘జయశ్రీ’’ అనే కలం పేరుతో 1947లో తన రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించి, తర్వాత… పురాతన్‌, క్రిషిక్‌, తెలంగాణ్యుడు, ఆర్‌.వి.ఆర్‌. పేరుతో ఎన్నో రచనలు చేశాడు. తన ఇంటినే ఓ కవితా కుటీరంగా మలుచు కున్నడు. ఆతరువాత గోకినేపల్లి కవిత కుటీరంలో నిరాడంబర జీవితం గడుపుతూ రచనలు సాగించాడు. రావెళ్ల పద్యరచనతో పాటు అనేక వచన రచనలు కూడా చేశాడు. తెలుగు, ఉర్దూల్లో అద్భుతంగా రాయడంతో పాటు అనర్గళంగా మాట్లాడే వాడు. దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ తదితర ప్రముఖుల సహచరుడు.

రావెళ్ల కవితా ఖండికల్లో పల్లెభారతి, జీవనరాగం, అనలతల్పం, రాగజ్యోతులు, చైతన్య స్రవంతి తదితరాలు ఆయన పేరెన్నిక గన్న రచనలు. ‘‘మధుర కవి’’, ‘‘కర్షక కవి’’ అనే బిరుదులను పొందాడు. అలాగే ‘‘గురజాడ సాహితీ అవార్డు’’, ‘‘దాశరథీ సాహితీ పురస్కారం’’, ‘‘జాషువా సాహితీ అవార్డు’’లను అందుకున్నాడు. ‘‘కదనాన శత్రువుల కుత్తుకలనవలీలనుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కాణాచిరా.. తెలంగాణ ధీరులకు మొగసాలరా… భూగర్భమున నిధులు.. పొంగిపారెడి నదులు/ శృంగార వనతతులు.. బంగారముల పంట నా తల్లి తెలంగాణరా.. వెలలేని నందనోద్యానమ్మురా… కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకు బలం..రజాకార్లను తరిమేస్తే తెలంగాణకు వరం’’…అంటూ తెలంగాణ వీరులకు కాణాచిగా, తరగని నిధులు, నదులతో రత్నగర్భగా ఉన్న స్థితిని, రజాకార్లను తరిమే యాల్సిన అవసరాన్ని  పరమాధ్బుతంగా కవిత్వీకరించాడు. 2013, డిసెంబర్‌ 10 న గ్రామీణ ప్రాంతంలో జీవించిన గొప్ప ప్రజా కవి, గోకినపల్లి లోని తన స్వగృహంలో తుదిశ్వాస వదిలాడు.

-రామకిష్టయ్య సంగనభట్ల
  9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page