నేడు ‘‘ప్రపంచ న్యుమోనియా దినం’’
ఐదేళ్ళలోపు పిల్లల్లో కనిపించే ప్రమాదకర న్యుమోనియా వ్యాధి బారిన 155 మిలియన్ల బాలలు పడడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతియోటా 1.6 మిలియన్ల మంది పిల్లలు మరణించడం జరుగుతోంది. ఐరాస అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 18 శాతం పిల్లల మరణాలకు ప్రథమ కారణమైన న్యుమోనియా నివారించగల అంటువ్యాధి. ఈ వ్యాధి ముందుగా గుర్తించలేనిది మాత్రమే కాకుండా నిశ్శబ్దంగా, విస్తృతంగా, ప్రమాదకరంగా వ్యాప్తి కూడా చెందుతున్నది. ప్రాణాంతక న్యుమోనియా వ్యాధి పట్ల సంపూర్ణ అనగాహన కలిగించాలనే సదుద్దేశంతో 2009 నుంచి ప్రతియేటా 12 నవంబర్ రోజున ‘‘ప్రపంచ న్యుమోనియా దినం’’ పాటించడం జరుగుచున్నది. సరైన చికిత్స, టీకాలు అందుబాటులో ఉన్న న్యుమోనియా వ్యాధి భయంకర బ్యాక్టీరియా ‘హిమోఫిలస్ ఇన్ఫుయెంజా టైప్-బి’,‘స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే’లు సోకడం వల్లనే కాకుండా ‘ఆర్థోమైక్సోవైరిడే‘ అనబడే వైరస్ కారణంగా కూడా సంక్రమిస్తుంది. ఐరాస మిలినియమ్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం 192 దేశాల్లో న్యుమోనియా కారణ మరణాలను తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో నైజీరియా(1.62,000), ఇండియా(1,27,000), పాకిస్థాన్(58,000), కాంగో(40,000), ఇథియోపియా(32,000)ల్లో న్యుమోనియా మరణాలు అధికంగా ఉన్నాయి.
న్యుమోనియా వ్యాప్తి మార్గాలు, రోగ లక్షణాలు:
వెనుకబడిన పేదదేశాల్లో పోషకాహారలోపం, అపరిశుభ్రత, ఆహార కొరత, ఇరుకైన ఇండ్లు, పొగ తాగే వారు ఉండడం, గాలి కాలుష్యం లాంటి కారణాలతో న్యుమోనియా వ్యాధి అధిక బాలల మరణాలకు దారి తీస్తున్నది. న్యుమోనియా నివారణ, చికిత్సలతో సకాలంలో స్పందిస్తే కనీసం ఒక మిలియన్ బాలల మరణాలను అడ్డుకోవచ్చని యునిసెఫ్ అభిప్రాయ పడుతున్నది. బ్యాక్టీరియా/వైరస్/ఫంగస్/
న్యుమోనియా నివారణ మార్గాలు:
సులభంగా వ్యాక్సీన్లతో నివారించగలిగిన న్యుమోనియా వ్యాధికి తగు చికిత్స మార్గాలు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రతి రోజు 5 ఏండ్ల లోపు పిల్లలు 2400 మంది చనిపోవడం విచారకరం. దేశ భావిభారత పౌరులైన పిల్లలకు సురక్షిత త్రాగు నీరు, పరిశుద్ధ గాలి, వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాక్సినేషన్, కనీస వైద్యసదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవడం, టీకాలు వేయించడం, తొలి దశలో న్యుమోనియాను గుర్తించడం, సరైన ఆంటీబయాటిక్ ఔషధాలతో చికిత్సను వారం రోజులు అందించడం వల్ల న్యుమోనియా వ్యాధి నయం అవుతుంది. శిశువులకు తల్లిపాలు అందించడం, పోషకాహారంతో వ్యాధినిరోధకత పెంచడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని గమనించాలి. 2030 వరకు న్యుమోనియా రహిత సమాజం నిర్మించాలనే లక్ష్యంతో పలు చర్యలు తీసుకుంటున్నారు. సంక్రమిత వ్యాధుల్లో న్యుమోనియా నిరోధక టీకాలను 52 శాతం పిల్లలు నేటికీ తీసుకోకపోవడం సమస్య గంభీరతను తెలియజేస్తున్నది.
ఇండియాలో న్యుమోనియా:
న్యుమోనియా కారణ మరణాల సంఖ్యలో ఇండియా 2వ స్థానంలో ఉన్నది. పిల్లల మరణాల్లో 15 శాతం న్యుమోనియా వల్ల జరుగుతున్నాయి. భారతదేశ అంటువ్యాధుల్లో 70 శాతం న్యుమేనియా సంబంధ కారణంగా జరుగుచున్నాయి. గాలి కాలుష్య న్యుమోనియా వల్ల 50 శాతం మరణాలు నమోదు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా సోకిన 32 శాతం పిల్లలకు వైద్య సహాయం అందడం లేదు. యూనిసెఫ్ అంచనాల ప్రకారం గత 5 ఏండ్లలో న్యుమోనియా వల్ల 8 లక్షల పిల్లలు మరణించగా, పుట్టిన మాసం లోపు 1,53,000 పిల్లలు మరణించడం జరుగుచున్నది. 2030 వరకు న్యుమోనియాను గుర్తించడం, నిరోధించడం, చికిత్స చేయడానికి 18 మిలియన్ల ఆరోగ్య సిబ్బంది అదనంగా అవసరం ఉంటుందని తేల్చారు.
సరైన జీవనశైలితో రక్షణ పొందడం, వ్యాక్సీన్ వేయించడం, తొలి దశలో గుర్తించి చవకైన చికిత్స మార్గాలు ఎంచుకోవడంతో న్యుమోనియా వ్యాధి బారిన పడకుండా భావిభారత పౌరులు రక్షించబడతారనే అవగాహన కలిగి మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా జనించే నిశ్శబ్ద న్యుమోనియా అంటువ్యాధి పట్ల అప్రమత్తంగా ఉందాం, ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందాం.
కరీంనగర్ – 9949700037