పోక్సో చట్టానికి పదును పెట్టలేమా..!

వీధిలో ఆడుకుంటున్న 12 ఏండ్ల బాలికను తినుబండారాలు ఇస్తానని నమ్మించి తన ఇంటిలోకి తీసుకెళ్లి తలుపులు వేశాడో 39 ఏండ్ల నిందిత రాక్షసుడు. ఆమె ఛాతీని ఒత్తడంతో పాటు బట్టలు తొలగించే ప్రయత్నం కూడా చేశాడు. భయపడిన బాలిక అరవటంతో నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రాలో జరిగిన ఈ కేసును దిగువ కోర్టు పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టం ప్రకారం 3 ఏండ్ల జైలుశిక్ష వేసింది. ఈ కేసులో హైకోర్టు నాగపూర్‌ ఏకసభ్య బెంచ్‌ తీర్పును ఇస్తూ, దుస్తులపై నుంచి బాలిక ఒంటిని తాకితే నేరం కాదని, బాలిక చర్మానికి నిందితుని చర్మం తాకితేనే పోక్సో చట్టం వర్తిస్తుందనే కొత్త భాష్యం ఇస్తూ దేశాన్ని నిర్ఘాంతపరిచింది.

విస్తుబోయే ఈ తీర్పును ఇస్తూ, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదించి ఏడాది శిక్ష మాత్రమే ఖరారు చేసింది. తాకకూడని చోట తాకడం జరగలేదని, చర్మంతో చర్మం రాసుకో వడం, అత్యాచా రానికి పాల్పడడం, ప్రైవేటు భాగాలను తాకడం, శారీరకంగా వేధించడం లాంటివి మాత్రమే పోక్సో చట్టపరిధిలోకి వస్తాయని తీర్పు ఇవ్వడం సర్వత్రా ఆశ్చర్యానికి దారి తీసింది. ముంబాయ్‌ హైకోర్టు తీర్పు బాలికల పరిరక్షణ చట్టాన్ని తూట్లు పొడిచేదిగా ఉందని సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఈ కేసులో తాత్కాలిక ఉపశమనం కలిగించినట్లు అయ్యింది. ఈ ఘటనలో దుస్తుల పైనుంచి వక్షోజాల్ని తాకడంలో నిందితుడి అసలు ఉద్దేశ్యం లైంగిక దాడే అవుతుందన్న విషయం అందరూ అంగీకరించినా హైకోర్టుకు మాత్రం అలా అనిపించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

అసాధారణ తీర్పులు
15 జనవరి 2021న కేసులో హైకోర్టు న్యాయమూర్తి మరో తీర్పును ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. 50 ఏండ్ల లిబ్‌సన్‌ కుజూర్‌ అనే వ్యక్తి 5 ఏండ్ల బాలిక ముందు ప్యాంటు జిప్‌ విప్పడం, చిన్నారి చేయి పట్టుకోవడం, పక్కన పడుకోవాలని బలవంతం చేయడం చూసిన తల్లి పోలీసులకు పిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టంతో కేసు నమోదు చేయగా విచారించిన సెషన్స్‌ కోర్టు కుజూర్‌కు 5 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 25,000/- జరిమానా విధించింది. ఈ కేసులో ముంబాయ్‌ హైకోర్టు నాగపూర్‌ ఏకసభ్య బెంచ్‌ విచారించిన జస్టిస్‌ తీర్పును ఇస్తూ మైనర్‌ బాలిక ముందు నిందితుడు ప్యాంట్‌ జిప్పు విప్పడం, బాలిక చేయి పట్టుకోవడం లైంగిక దాడి కాదని, పోక్సో చట్టం కిందికి రాదని కేసును కొట్టి వేయడం జరిగింది. అప్పటికే 5 నెలల జైలు శిక్షను అనుభవించిన కుజూర్‌ను వెంటనే విడుదల చేయాలని తీర్పును ఇచ్చింది. ఈ రెండు తీర్పులు వికృతమైనవే కాకుండా లోపభూయిష్టంగా ఉన్నాయని మాజీ ప్రధాన న్యాయమూర్తులు కూడా విమర్శించే స్థాయికి కూడా చేరడం విచారకరం.

సంచలన తీర్పులు
25 ఏండ్ల వివాహిత నిందితుడు 16 ఏండ్ల బాలికను రేప్‌ చేసి గర్భవతిని చేసిన కేసులో ముంబాయ్‌ పోక్సో కోర్టు మరో సంచలన తీర్పును ఇవ్వడం జరిగింది. బాలిక కుటుంబానికి పరిచయస్తుడైన వివాహిత నిందితుడు పెళ్ళి చేసుకుంటానని నమ్మించి లైంగిక సంబంధం నెరపడంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక తల్లితండ్రులు రేప్‌ కేసు నమోదు చేయగా కేసును ముంబాయ్‌ పోక్సో కోర్టు విచారించింది. బాలిక 18 ఏండ్ల వయసుకు రాగానే వివాహం చేసుకుంటానని, తన మతం బహుభార్యాత్వానికి అంగీకరిస్తుందని అతని తరపు న్యాయవాది వాదించారు. అతడిని పెళ్ళి చేసుకోవడానికి తన కూతురు ఇష్ట పడుతోందని బాలిక తల్లి అఫిడవిట్‌ సమర్పించింది. ఈ కేసును విచారించిన అనంతరం నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది.

ఆటవిక పురుష సమాజం
మహిళలకే రక్షణ కరువైన ఈ ఆటవిక సమాజంలో పొంచివున్న మృగాళ్ళు నరరూప రాక్షసుల్లా పేట్రేగి పోతూ, అత్యాచార హత్యలకు కూడా వెనుకాడడం లేదు. ఆధునిక అనాగరిక సమాజంలో చిన్నారులను కూడా వదలకుండా అత్యాచారాలకు పాల్పడే నీచులు మన మధ్యలోనే ఉండడం దురదృష్టకరం. చర్మంతో చర్మం తగిలితేనే లైంగిక నేరం అవుతుందని, మైనర్‌ బాలిక ముందు పురుషుడు ప్యాంట్‌ జిప్పు విప్పడంతో పాటు చేయి పట్టుకొని పక్కన పడుకోవాలని ఒత్తిడి తేవడం కూడా లైంగిక దాడి కాదని కొత్త నిర్వచనాలు ఇవ్వడంతో పోక్సో చట్టానికి తూట్లు పొడిచినట్లు అయ్యింది. ఇలాంటి అశ్లీల అత్యాచార నిందితుల కేసులో చట్టాలకు కొత్త నిర్వచనాలు ఇస్తూ, నేరప్రవృత్తిని ప్రోత్సహించేలా తీర్పులు ఇవ్వడం అసంబద్ధంగా తోస్తున్నది. ఇలాంటి రాక్షస మృగాళ్ళ మదాన్ని కఠిన శిక్షలతో అణచవలసిందే అని సామాన్యుల అభిప్రాయ పడుతున్నారు. సభ్యసమాజంలో స్త్రీలో అమ్మను దర్శించి, చిన్నారుల చిరునవ్వుల్లో కూతురు/సోదరీమనులను చూసే నవసాంస్కృతిక సమాజం రావాలి. మహిళలను మహాశక్తి రూపాలుగా భావింటి గౌరవించాలి.
-డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
 కరీంనగర్‌, 9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page