పోరు పొద్దు పొడుపు

అంధవిశ్వాసాల్ని శ్వాషిస్తూ
బండరాళ్లకు భజన చేస్తుంటే
వాడు మందిరాల కట్టడాలకు
వేగిరంగా పునాదుల్ని తీస్తాడు

గళాల గడియలు బిగిస్తూ
మౌన వ్రతాన్ని ఆచరిస్తుంటే
వాడు జాతి మతీకరణ కోసం
కాసాయ కత్తుల్ని జులిపిస్తాడు

అచేతనా దుప్పటి ముసుగేసి
మొద్దు నిద్దురలో జోగుతుంటే
వాడు సర్వ సంపదల కొల్లగొట్టి
దోపిడీ ముఠాకు కట్టబెడతాడు

కూపస్థ మండూక రూపునెత్తి
ఉన్నచోటనే శుష్కిస్తుంటుంటే
వాడు దేశాన్ని నడిబజారులో
బేషరతుగా బేరం అడుతాడు

అమాయకత్వం హాత్తుకుని
అధికార పీఠాన్ని కట్టబెడితే
కట్టు బానిసత్వం అప్పగించి
నియంత పాలన సాగిస్తాడు

జనగణమా ఇకనైనా
భయాన్ని బహిష్కరించి
బతుకు పోరెత్తుకుందాం

అజ్ఞాన తిమిరం తరిమి
పోరు పొద్దయి పొడుద్దాం
మోకరిల్లుతనం త్యజించి
ధిక్కార నాదమై ధ్వనిద్దాం

యుద్ధ పిరంగిలా జ్వలించి
దోపిడీ కోటల్ని కూల్చేద్దాం

సమర సింహంలా గర్జించి
నియంతలను తరిమేద్దాం
స్వేచ్ఛా పతాక ఎగరేద్దాం

 – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page