ప్రకృతి గర్జించి,మానవ విజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నది.మానవాధిపత్యా
రాత్రికే రాత్రే ఊహాతీతంగా వయనాడ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి,వందలాది మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. కుంభవృష్టికి తోడు కొండలు విరగడం,బురద నీరు వరదలా ప్రవహించి,అందులో ప్రజలు కూరుకు పోవడం,వందల సంఖ్యలో ప్రజలు మరణించడం, చాలా మంది వలస కూలీల జాడ కనిపించకుండా పోవడం,క్షతగాత్రులను కాపాడడం కోసం ఆసుపత్రుల చుట్టూ పడిగాపులు కాయడం, మరణించిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటడంతో వయనాడ్ “మరుభూమి”గా మారి పోయింది. స్వల్ఫవ్యవధిలోనే ఇంతటి విధ్వంసం జరగడం ఆశ్చర్యకరంగా మారింది.గతంలో కూడా కేరళలో వరదలకు ఎంతో ప్రాణనష్టం జరిగింది.
అయితే ఇప్పుడు సంభవించిన ఘోరమైన ప్రకృతి విపత్తు అత్యంత భయానకంగా అగుపిస్తున్నది.నిద్రలోనే ఎంతో మంది ఈ విలయానికి ప్రాణాలు కోల్పోయారు.కళ్ళు తెరిచి చూసేలోగా ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని, నిస్సహాయంగా చూస్తుండగానే ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకు పోయాయి.పొంగుతున్న నదులు, కొట్టుకొస్తున్న శవాలు , శిధిలాల క్రింద శవాలు, బురద నీటి ఉధృతికి తెగిపడిన శరీర భాగాలతో “గాడ్స్ ఓన్ కంట్రీ” గా పిలవబడుతున్న కేరళ కకావికలమైనది.ప్రకృతి ప్రకోపానికి వయనాడ్ విధ్వంసమైపోయింది.ఎందుకిలా జరిగింది? ఈ ప్రళయానికి కారణాలేమిటి? అని ప్రశ్నించుకుని విశ్లేషిస్తే, మానవ తప్పిదాలే ఈ విలయానికి అధికశాతం కారణంగా చెప్పకతప్పదు. సముద్రాలు వేడెక్కడం, భూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం వలన వాతావరణంలో మార్పులు సంభవించి, ఆకస్మికమైన భారీవర్షాలు పడి, వరదలు సంభవించడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి.
అరేబియా సముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం వలన ప్రకృతిలో మార్పులు జరిగి ప్రళయానికి దారితీసినట్లు ప్రాథమిక అంచనాలను బట్టి తెలుస్తున్నది.అందమైన పశ్చిమ కనుమల మధ్య ప్రకృతి విలయతాండవం చేయడం, వయనాడ్ ప్రకృతి విధ్వంసానికి చిగురుటాకులా వణికి పోవడం అత్యంత బాధాకరం. ప్రకృతి విలయాలను ఆపే శక్తి మనకు లేకపోయినా, ఇలాంటి విలయాల వలన జరుగుతున్న ప్రాణనష్టాన్ని ముందు జాగ్రత్త చర్యలతో కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. భాతాపాన్ని అరికట్టడం, ప్లాస్టిక్ ను నిషేధించడం వంటి చర్యలతో పాటుగా వాతావరణంలో సంభవిస్తున్న అవాంఛనీయ మార్పులకు గల కారణాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంచనా వేయాలి. వాతావరణ శాఖ అత్యంత పటిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుని,ఎప్పటి కప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలి.
– సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్ )
మొ:9704903463.