ప్రజలను వేగంగా ప్రభావితం చేసే వార్త చిత్రాలు

బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి
వార్తల చక్రంలో ఫోటో జర్నలిజానిది ముఖ్య పాత్ర
సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి

హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌వార్త చిత్రాలకు బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని, అవి పదాల కంటే వేగంగా ప్రజలను ప్రభావితం చేస్తాయని తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, హోసింగ్‌, ‌సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. నేటి వార్తల చక్రంలో ఫోటో జర్నలిజం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, వార్తా పత్రికల పేజీలలో ఫోటోలు లేకపోవటం వలన ప్రచురణ నిస్తేజంగా, ఆకర్షణీయంగా ఉండదన్నారు. 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా బషీర్‌ ‌బాగ్‌ ‌దేశోద్ధారక భవన్‌లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం రాష్ట్ర స్థాయి వార్త ఛాయా చిత్రాల ప్రదర్శనను నిర్వహించింది. ఈ ప్రదర్శనను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ప్రారంభించగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ ‌కె.శ్రీనివాస్‌ ‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు కె.విరహత్‌ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రామనారాయణ, ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌ ‌జాతీయ కార్యదర్శి వై.నరేందర్‌ ‌రెడ్డిలతోకలసి ఛాయాచిత్రాలను వీక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… పత్రికల్లో వార్తా కథనాలు మరచిపోయిన చాలా కాలం తర్వాత, గత సంఘటనల గురించి భవిష్యత్తు తరాలకు అవగాహన కల్పించే సామర్థ్యాన్ని చిత్రాలు కలిగి ఉంటాయని తెలిపారు. వార్తలను, సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, ప్రజలకు అందించడంలో జర్నలిస్టులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు సత్యాన్ని తెలియజేసే ప్రయత్నంలో వార్తలను మరియు చిత్రాలను అత్యున్నత పాత్రికేయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంచాలన్నారు. కె.శ్రీనివాస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా న్యూస్‌ ‌ఫోటో కాంటెస్ట్ ‌ఫలితాలను ప్రదర్శిస్తూ, ఎగ్జిబిషన్‌ ‌గత సంవత్సరంలో అత్యుత్తమ, అత్యంత ముఖ్యమైన ఫోటో జర్నలిజం, డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీని ప్రదర్శించడం అభినందనీయమన్నారు. మన రాష్ట్రానికి చెందిన ఫోటో జర్నలిస్టులు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో విజువల్‌ ‌జర్నలిజం యొక్క ప్రాముఖ్యతను తమ చిత్రాల ద్వారా చూపించడంలో ప్రతిభ కనబర్చరని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎన్‌.‌హరి, ఉపాధ్యక్షులు పి.రాంమూర్తి, కోశాధికారి అనిల్‌ ‌కుమార్‌ ‌కర్ణకోటి, కార్యవర్గ సభ్యులు నక్క శ్రీనివాస్‌, ‌పి.మోహన చారి, ఎంఏ.సర్వర్‌, ‌నగర గోపాల్‌, ‌ఛాయాచిత్ర ప్రదర్శన కన్వీనర్‌ ఏ.‌మహేష్‌ ‌కుమార్‌, ‌సభ్యులు డి.సుమన్‌ ‌రెడ్డి, ఎస్‌.‌శ్రీధర్‌, ‌హరిప్రేమ్‌, ‌సంజయ్‌ ‌చారి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page