- పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీల పెంపుపై పోరాటాలు
- త్వరలో రైతు రక్షణ యాత్ర
- టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్
ప్రజాతంత్ర , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల కారణంగా ప్రజలలో చులకనవుతున్నారనీ టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు. ప్రజ సమస్యలపై ఇక నుంచి మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పాటు విద్యుత్ చార్జీల పెంపుపై త్వరలో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు.
పోడు సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనీ, రైతు రక్షణ పేరుతో యాత్ర చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ చార్జీలు పెంచడం ఇదే తొలిసారనీ, కేసీఆర్ అసమర్థ పాలన విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని విమర్వించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు కలసి మాట్లాడాల్సి ఉందనీ, ఏప్రిల్ 9న ఈ అంశంపై కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ విలీనం గురించి ఎక్కడా చర్చ జరగలేదన్నారు. అలాగే, జంట జలాశయాల పరిరక్షణకు రౌండ్ టేబుల్ సమావేశలు, కృష్ణా జలాల పరిరక్షణ యాత్ర చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ప్రొ.కోదండరామ్ వెల్లడించారు.
టీజేఎస్ నూతన కార్యవర్గం ప్రకటన
టీజేఎస్ నూతన కార్యవర్గాన్ని సోమవారం అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా సయ్యద్ బద్రుద్దీన్, ప్రొ.పీఎల్వీ, గంగాపురం వెంకటరెడ్డి, రాజమల్లయ్య, ప్రధాన కార్యదర్శులుగా అంబటి శ్రీనివాస్, నరహరి జగ్గారెడ్డి, గోపగాని శంకర్‌రావు, కే.ధర్మార్జున్, నిజ్జన రమేశ్, బైరి రమేశ్, ఎం.ఆశప్ప, అధికార ప్రతినిధులుగా డోలి సత్యనారాయణ, పల్లె వినయ్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా రాగులపల్లి లక్ష్మి నియమితులయ్యారు.