రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారనీ, అందు నాంది గజ్వేల్ కావాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. గజ్వేల్ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ..సిఎం కేసీఆర్ నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తామని అన్నారు. గజ్వేల్‌లో 30 వేల కుటుంబాల భూములను లాక్కున్న కర్కోటకుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాఫియా విలయతాండవం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. దీనికి నాంది గజ్వేల్‌లో జరగాలని గజ్వేల్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజలు తమ వోటు కేసీఆర్ కుటుంబానికి వేస్తారా…వారి కుటుంబాలకు వేపుకుంటారా..అని ప్రశ్నిస్తూ.. బిజెపికి వోటు వేస్తే ప్రజలు తమ పిల్లల భవిష్యత్తుకు వేసినట్లు అని అన్నారు. కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు మాత్రమే వొస్తున్నాయన్నారు. గజ్వేల్ ప్రజలు అంగట్లో పశువులు అనుకుంటున్నారని..డబ్బులిస్తే వోట్లు వేస్తారని అనుకుంటున్నారని.. కానీ, గజ్వేల్ ప్రజలు పులి పిల్లలని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. భద్రాచలంలో శ్రీరాముల వారి కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లేది సంప్రదాయమని.. కానీ, ఈ సిఎం కేసీఆర్ వెళ్లరన్నారు. గజ్వేల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని ఇంత వరకు ఇవ్వలేదు కానీ ఉన్న ఇండ్లు గుంజుకున్నారని ఆరోపించారు. నియంతృత్వ పాలన మీద, రజాకార్ల పాలన మీద వదిలిన బాణం ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేను కలవని ప్రజలు ఎవరైనా ఉన్నారంటే గజ్వేల్ ప్రజలే అని చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని అనగానే పక్క నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం పెట్టుకున్నారన్నారు. ఈ పది సంవత్సరాలు కుటుంబ అభివృద్ధి చూసుకున్నానని..ఇప్పుడు గెలిపిస్తే ప్రజల్ని చూసుకుంటా అంటున్నారని అన్నారు. ఈటల గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని అనగానే కామారెడ్డికి కేసీఆర్ పారిపోయారన్నారు. రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రాగానే బిసి బిడ్డ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. దేశంలో మొట్టమొదటి ప్రధాన మంత్రి బిసి బిడ్డ నరేంద్ర మోదీ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.