- బడ్జెట్ కేటాయింపుల్లో అంతా మాయ
- అంచనాల్లో 70 వేల కోట్లకు అందని లెక్కలు
- అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో దుయ్యబట్టిన సిఎల్పీ నేత భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన రాష్ట్రంలో పాలన ఆగమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం..రూ.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకయ్యాయో చెప్పాలని నిలదీశారు. బడ్జెట్‌పై చర్చలో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వ విధానాలను తూర్పారా బట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెఘా కృష్ణారెడ్డి, మై హోమ్ రామేశ్వర్ రావు, బండి పార్థసారధి తదితరుల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. గల్లీకో బెల్ట్ షాపు పెట్టి రాష్ట్రాన్ని మత్తులో ముంచారని భట్టి ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్లో కూడా ఫీజుల నియంత్రణ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కనీసం ప్లే గ్రౌండ్ కూడా లేని స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేయడంపై భట్టి ఫైర్ అయ్యారు. నారాయణ, శ్రీచైతన్య సంస్థలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేసిన సమయంలో ప్రజా సమస్యలు చాలా వరకు తెలుసుకున్నానని భట్టి అన్నారు. ఉండేందుకు ఇల్లు కూడా లేని వారి కష్టాన్ని కళ్లారా చూశానన్నారు.
ప్రియాంక అనే యువతి ఆవేదనను గుర్తు చేసుకున్న ఆయన..పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదలకు భూ పంపిణీ చేయాల్సింది పోయి..పంపిణీ చేసిన భూమిని ప్రభుత్వమే లాక్కుంటుందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో భూమిని లాక్కొని..హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ప్లాట్లను చేసి అమ్ముతుందని భట్టి ఆరోపించారు. రాష్ట్ర బ్జడెట్‌పై ప్రజలు పెట్టుకున్న ఆశలను నిరాశపరిచారని, అంకెలు పెద్దగా ఉన్నాయి..కేటాయింపులు చిన్నగా ఉన్నాయి..అంటూ సీఏల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. అంకెలలో పెద్ద గారడీ ఉందని..ట్యాక్స్ రెవెన్యూ రూ. 40 వేల కోట్ల పెరుగుదల చూపించారని..పన్నులు పెంచకుండా ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కేంద్రం గ్రాంట్స్ రూ. 10వేల కోట్లకు మించడం లేదని..అయినా రూ. 40 వేల కోట్లు చూపించారన్నారు. బడ్జెట్లో రూ. 70 వేల కోట్లు అంచనాలకు అందడం లేదన్నారు. తలసరి ఆదాయం పెరిగిందని ఏ లెక్క ప్రకారం చెప్తున్నారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్రంలో కొంత మంది తలసరి ఆదాయం మాత్రమే పెరిగిందని. పేదలు ఇళ్ళ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారన్నారు. ఆదాని వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థను మోసం చేసిందని ఆరోపించారు. ఆరోగ్య శ్రీ కార్డు రాష్ట్రంలో ఎక్కడా పనిచేయడం లేదన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో విచ్చలవిడిగా బిల్లులు వేస్తున్నారని, ప్రభుత్వం కట్టడి చేయాలని కోరారు.