- గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం
- ప్రవాసీ భారతీయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- విద్యుత్ ఛార్జీలపై మొదలైన బిజెపి ప్రజా బ్యాలెట్
ప్రజాతంత్ర , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలన నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరతామని స్పష్టం చేశారు. సోమవారం అమెరికాలోని ప్రవాస భారతీయులు ఏక్ దక్కా తెలంగాణ పక్కా నినాదంతో నిర్వహంచిన జూమ్ మీటింగ్‌లో బండి సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారనీ, ఇందుకోసమేనా పోరాటాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నదని ప్రశ్నించారు. తెలంగాణసెంటిమెంట్‌ను మరొమారు రగిలింపజేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అప్రదిస్టపాలు చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు.
ప్రజాస్వామిక తెలంగాణ కోసం బీజేపీ చేస్తున్న మహోద్యమంలో భాగస్వాములు కావాలనీ, గడీల్లో పాలనతో బందీ అయిన తెలంగాణ తల్లిని కాపాడి మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో దశాబ్దాలుగా సాగించిన పోరాటంలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ పార్లమెంటు వేదికగా గర్జిస్తే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన అందుకు భిన్నంగా కొనసాగుతున్నదనీ, ఈ విషయాన్ని ప్రవాస భారతీయులు గుర్తించి బీజేపీ చేస్తున్న పోరటానికి సహకరించాలని ఈ సందర్భంగా బండి సంజయ్ పిలుపునిచ్చారు.
విద్యుత్ ఛార్జీలపై మొదలైన బిజెపి ప్రజా బ్యాలెట్
విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీజేపీ సమర భేరీ మోగిస్తూ సోమవారం బషీర్‌బాగ్ నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో నగర బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై కమలనాథులు ప్రజాభిప్రాయాన్ని కోరుతూ గ్రామ పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో ప్రతి ఇంటి నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు.