‌ప్రజా సంగ్రామ యాత్రను ప్రజా వంచన యాత్రగా మార్చండి

  • కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా పాదయాత్రలా ?
  • కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు
  • బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ ‌బహిరంగ లేఖ

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పాలమూరు జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదనీ టీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరును ప్రజా వంచన యాత్రగా మార్చాలని సూచించారు. ఈమేరకు కేటీఆర్‌ ‌శుక్రవారం బండి సంజయ్‌కి బహిరంగ లేఖ రాశారు. కృష్ణా జల్లాలో తెలంగాణ వాటా తేల్చకుండా జల దోపిడికి జై కొడతారా ? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ యాత్రలు చేస్తారా అని నిలదీశారు. కుట్రలు చేసిన వాళ్లు ఇప్పుడు కపట యాత్రలు చేస్తున్నారనీ, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు, పాలమూరు రైతులపై బీజేపీకి ఎందుకింత కక్షనో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లయినా విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదనీ, ఇందుకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రశంసిస్తూ నీతి ఆయోగ్‌ ‌చెప్పినా నిధులిచ్చే నీతి లేదనీ, ఎద్దేవా చేశారు. రాష్రంలో రైతులకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తుంటే మోటార్లకు మీటర్ల పెట్టాలని బ్లాక్‌ ‌మెయిల్‌ ‌చేస్తున్న నీతి లేని ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అవమానించిందనీ, చివరకు రైతులు అన్యాయం కావొద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడానికి నిర్ణయించిందని చెప్పారు.తెలంగాణ ప్రజలంటేనే గిట్టని పార్టీ బీజేపీ అనీ, కడుపులో ద్వేషం పెట్టుకుని పాదయాత్రలు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నందుకు మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్‌ ‌బండి సంజయ్‌కి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page