9 నెలలుగా అభివృద్ధ్ది నిరోధక ఎజెండా
స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ నిలిపివేత
ట్విట్టర్ వేదికగా హరీష్ రావు విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్
కేసీఆర్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గాలకు కేటాయించిన ఎస్డీఎఫ్ నిధులను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. అయితే ఈ నిధుల నుండే మార్చి నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు ఇచ్చి తన కురచ బుద్ధిని, పక్షపాత ధోరణిని చూపింది. కాంగ్రెస్ పార్టీ గెలవని నియోజకవర్గాలపై కక్షతో ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం దుర్మార్గం అని అన్నారు. నిధులు కేటాయించకపోగా పురోగతిలో ఉన్న పనులకు సైతం నిధులు నిలిపివేయడం మరో దుర్మార్గం. ఇప్పటివరకు రద్దు చేసిన ఎస్డీఎఫ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయిలో ఒక సక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. జిల్లా కలెక్టర్లు, అధికారులు సైతం రద్దు చేసిన పనులకు సంబంధించి ఎలాంటి సక్షా జరపలేదు. కనీసం పురోగతిలో ఉన్న పనుల నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడంలో విఫలమయ్యారు. ప్రభుత్వం అనేది నిరంతర పక్రియ. ఈ పక్రియలో ప్రజల అవసరాలు మారవు. మారేది కేవలం ప్రభుత్వాలు మాత్రమే. గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన అనాలోచిత చర్యలతో తన ఆనవాలునే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ పూరిత రాజకీయాలు చేయడం పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలి. గత ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ అవి ప్రజల అవసరాల కోసమే కాబట్టి ఆ పనులను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అంటూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.