ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన సెంట్రింగ్ యూనియన్ నాయకులు
ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్
అన్ని వర్గాల మద్దతు బిఆర్ఎస్ కే
ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి పనులు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవాల మద్దతు పరంపర కొనసాగుతూనే ఉంది.అమీన్ పూర్ మండల పరిధిలోని సెంట్రింగ్ యూనియన్ నాయకులు, సభ్యులు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఏకగ్రీవ మద్దతు పలికారు.ఈ మేరకు పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుమారు సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు నాగేంద్ర ఆధ్వర్యంలో సుమారు 300 మంది సెంట్రింగ్ యూనియన్ సభ్యులు బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే జీఎంఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరచాలంటే అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. మినీ ఇండియా గా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు.ప్రధానంగా అసంఘటిత రంగ కార్మిక రంగానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఎన్నికల అనంతరం సెంట్రింగ్ కార్మికులకు ఆత్మగౌరభవనం నిర్మించడంతోపాటు అన్ని సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఐదేళ్ల కాలంలో ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు నేడు ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కారుస్తూ అమలుకు సాధ్యం కానీ హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ ఎంపీపీ దేవానందం, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బాల్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్స్ సభ్యులు, సీనియర్ నాయకులు చంద్రశేఖర్, వడ్లకాలప్ప, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.