నేడు కొమురం భీం జయంతి
ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా, పాలక వర్గాల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజన హక్కుల కోసం ‘జల్-జంగిల్-జమీన్’ నినాదంతో మడమ తిప్పని పోరాటాలు చేసి, ప్రాణాలర్పించిన పోరాట యోధుడు కొమురం భీం. గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్, సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్ 22న అవిభక్త ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో జన్మించి, ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించి, కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940, అక్టోబర్ 27 న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున వీరమరణం పొందాడు భీం. కొమురం భీం స్పూర్తితో…దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా, సంతాల్‌లు,తిరుగుబాటు చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్నిరకాల దోపిడీ, పీడనలను ఎదిరించారు. అనేకసార్లు ఓటమి చెందినా తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులలో, తమ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.
జీవన పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలు. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజ వనరులతో కళకళలాడు తుండేవి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు, హక్కులు కూడా లేవు. నాగరిక సమాజపు కొత్త పోకడలకు దూరంగా తమ కట్టు, బొట్టూ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటు, తరతరాలుగా భావి తరాలకు అందిస్తున్నారు. యేడాది పొడవునా వారు జరుపుకునే పండుగలు, వేడుకల్లో వారి సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఆదివాసీలు ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార?ండ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, అండమాన్ నికోబార్ దీవులలో ఎక్కువగా జీవిస్తున్నారు. మన దేశంలో సుమారు 600 ఆదివాసీ తెగలు గుర్తించ బడ్డాయి. భారత రాజ్యాంగం వీరికి చట్టపరమైన రక్షణలు కల్పించింది. 1874లోనే ప్రత్యేక షెడ్యూల్డ్ జిల్లాల చట్టం చేయబడింది. 1917లో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాలలో ఉమ్మడి భూమి హక్కులు ఇవ్వబడ్డాయి. ఆదివాసీ తెగలకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లో చట్టం చేయబడింది. చట్టం ప్రకారం అటవీ భూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికీ 10 ఎకరాల వరకూ పట్టా ఇవ్వవచ్చు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా ఆదివాసీ తెగలు తమ సంప్రదాయపు భూముల నుంచి, అటవీ ప్రాంతం నుంచి నెట్టివేయ బడుతున్నారు.
అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1/70 చట్టం అమలులో ఉన్నది. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలి. గిరిజనేతరులకు షెడ్యూల్డ్ భూమిపై ఎట్టి హక్కూ లేదు. ఉభయ తెలుగు రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రాంతంలో 48 శాతం సంప్రదాయక గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమించు కున్నారు. ఆదివాసీ తెగల వాయిద్య పరికరాలు, వారి నృత్యాలు ప్రభుత్వం ప్రోత్సాహం లేక అంతరించి పోతున్నాయి. ఆదివాసీ ప్రాంతాలలోకి పర్యాటకం ప్రవేశించాక ఆదివాసీ కళలు వ్యాపార సరుకులుగా మారి పోయాయి. స్వాతంత్య్రం వచ్చి యేళ్లు గడుస్తున్నా అభివృద్దికి నోచు కోని గిరిపల్లెలు నేటి ఉన్నాయి. విద్య, వైద్య, రవాణా విషయంలో గిరిజన గూడాలు, తాండాల్లో నేటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడవడానికి రోడ్డు, తాగటానికి నీటి సౌకర్యం కూడా లేని పల్లెలున్నాయి. ఇప్పటికి పోడు భూముల సమస్య, అటవీ భూములకు పట్టాలు, ప్రభుత్వ అజమాయిషీ కాకుండా గ్రామసభల ద్వారా స్వయం పాలన ఉద్దేశిత పీసా చట్టం అమలు కోసం గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ సంఘాలు పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం వీరి స్వయం పరిపాలనే లక్ష్యంగా ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసి ప్రత్యేక నిధులు కేటాయించింది కూడా. పోడు భూముల విషయంలోనూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. అలా గిరిజన అభివృద్ధికి ఇతోధిక సంక్షేమ కార్యక్రమాల అమలు అనివార్యం. అత్యవసరం.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494