ప్రధాని తీరు హుందాగా లేదు

  • మణిపూర్‌ ‌మండుతుంటే జోకులా
  • మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌

మణిపూర్‌ ‌తగలబడుతుంటే పార్లమెంటులో ప్రధాని నవ్వుతూ జోకులేసుకున్నారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇంతకటంటే దౌర్భాగ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రధానిగా ఉన్న వ్యక్తిచేసే పనేనా ఇది అన్నారు. మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారని, వీళ్లు దోశద్రోహులే కానీ, దేశభక్తులు కాదని కేంద్రంలోని అధికార బీజేపీని అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మీడియా సమావేశంలో మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. నెలలు తరబడి మణిపూర్‌ ‌మండుతుంటే ఆ అంశంపై చర్చలో పాల్గొన్న ప్రధాని నవ్వులు చిందిస్తూ, జోక్‌లు విసరడాన్ని తప్పుపట్టారు. ప్రధాని హోదాకు ఇది తగదన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారంనాడు మీడియాతో రాహుల్‌ ‌మాట్లాడారు. గతరాత్రి పార్లమెంటులో ప్రధానమంత్రి 2 గంటల 13 నిమిషాలు మాట్లాడారు.

చివర్లో మణిపూర్‌పై 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. మణిపూర్‌ ‌నెలల తరబడి మండుతోంది. ప్రజలు విలువైన ప్రాణాలు కోల్పోయారు. అత్యాచారాలు జరిగాయి. కానీ ప్రధాని మాత్రం నవ్వులు చిందిస్తూ, జోకులు విసురుతున్నారు. ఇది ఆయనకు తగదని మోదీని రాహుల్‌ ‌విమర్శించారు. మణిపూర్‌ ‌ఘర్షణలను ఆర్మీ కేవలం రెండు రోజుల్లో నిలిపివేయగలదన్నారు. కానీ మణిపూర్‌ ‌రగులుతూనే ఉండాలని ప్రధాని కోరుకున్నారని, మంటలను చల్చార్చే ప్రయత్నం చేయలేదని చెప్పారు. మణిపూర్‌ను సైన్యం అదుపులోకి తీసుకోవాలని తాను కోరినప్పుడు బీజేపీ తనను విమర్శించిందని అన్నారు. మణిపూర్‌పై అసలు చర్చలే జరగలేదని, కేవలంం హింస మాత్రమే చోటచేసుకుందని ఆరోపించారు.

హింసను మొదట అదుపు చేసి, ఆ తర్వాత దానికి చరమగీతం పాడాల్సి ఉంటుందన్నారు. ప్రధాని వద్ద ఇందుకు అవసరమైన అన్ని అస్త్రాలు ఉన్నప్పటికీ ఆయన వాటిని వాడలేదని, చేసిందేమీ లేకపోగా నవ్వులు చిందిస్తున్నారని తప్పుపట్టారు. మీడియాను వాళ్లు (కేంద్రం) అదుపులో పెట్టుకున్నారనే విషయం తనకు తెలుసునని, రాజ్యసభ, లోక్‌సభ టీవీని తమ అదుపులో పెట్టుకున్నారని, అయినప్పటికీ తాను తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు. భరతమాతపై ఎక్కడ దాడి జరిగినా అక్కడ తాను ఉంటానని, భరత మాత పరిరక్షణకు కట్టుబడి ఉంటానని రాహుల్‌ ‌మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page