ప్రధాని నేతృత్వంలో ముందుకు దూసుకుపోతున్న దేశం

  • విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలు
  • 30 కోట్ల మందిని విమానయనానికి చేరువ చేసే లక్ష్యం
  • వింగ్స్‌ ఇండియా గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం ముందుకు దూసుకుని పోతున్నదని  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వింగ్స్‌ ఇండియా 2024 కార్యక్రమంతో ప్రపంచస్థాయిలో దేశ పౌరవిమానయాన ఘనత చాటి చెప్పొచ్చని ఆయన అన్నారు.గురువారం బేగంపేట్‌ ఏయిర్‌ పోర్ట్‌ లో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించే… వింగ్స్‌ ఇండియా 2024, గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని…అత్మనిర్బర్‌ భారత్‌ కార్యక్రమం పౌర విమానయాన రంగానికి ఎంతో తోడ్పాటునందిస్తుందన్నారు. గత ఏడాది 15.2 కోట్ల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారని తెలిపారు.  2030 కల్లా 30కోట్ల మందిని విమానయనాన్నికి దగ్గర చెయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక ఎయిర్‌ క్రాప్ట్‌ లను భారత్‌ కొనుగోలు చేస్తోందని..  మన దగ్గర 57 ప్లయింగ్‌ ట్రెడ్‌ ఆర్గనైజేషన్‌ లు ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో 10వేల మంది మహిళలకు డ్రోన్లపై శిక్షణ ఇస్తామని సింధియా చెప్పారు. డ్రోన్లకు 80శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. బోయింగ్‌, ఎయిర్‌ బస్‌ నుంచి ప్రపంచస్థాయి విమానాలను పలు సంస్థలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్‌ మరోసారి వేదికైంది.

 

ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శనా కార్యక్రమం వింగ్స్‌ ఇండియా 2024 బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైంది. మినిస్టీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ మరియు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ , ఇండియన్‌ ఇండస్టీ ఆధ్వర్యంలో వింగ్స్‌ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్‌, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏవియేషన్‌ పరిశ్రమలో అత్యుత్తమమైనవి తమ వినూత్న విమానయాన సాంకేతికత, విమాన యంత్రాలను ప్రదర్శిస్తాయి. దీని థీమ్‌ ‘అమృత్‌ కాల్‌’లో భారతదేశాన్ని ప్రపంచానికి అనుసంధానించడమని.. ఇది భారత పౌర విమానయానానికి వేదిక అంటూ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్య 260 మిలియన్‌లు పెరిగిందన్నారు. హైద్రాబాద్‌ మహానగరంలో నాలుగురోజుల పాటు ఇంటర్నేషనల్‌ వింగ్స్‌ ఇండియా ఎయిర్‌ షో జరగనుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్‌ 777`9 విమానంతో పాటు అనేక విమానాల ప్రదర్శన జరగనుంది.  ప్రదర్శనలో 106 దేశాల నుంచి సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరుకానుండగా.. దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల విమానాలు వింగ్స్‌ ఇండియా ప్రదర్శనలో పాల్గొననున్నాయి. భారత వాయుసేనకు చెందిన సారంగ్‌ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహిస్తుంది. 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15 నుంచి 5, 19న ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15`5 వరకు విన్యాసాలు ఉంటాయి. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతిస్తారు. దీని టికెట్‌ రూ.750గా నిర్ణయించారు. ’బుక్‌మైషో’ యాప్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు ఉచితం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page