ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం పోకడలు 2024

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ – ఐయల్‌ఒ) వరల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ ఔట్‌లుక్‌ ట్రెండ్స్‌ (ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం పోకడలు) 2024 నివేదికను ఈ నెల 9న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రపంచ ఉపాధి మరియు సామాజిక పోకడలను సమగ్రంగా అందిస్తుంది. నిరుద్యోగం, ఉద్యోగ కల్పన, శ్రామిక శక్తి భాగస్వామ్యం, వారు చేసే పని గంటలతో సహా తాజా లేబర్‌ మార్కెట్‌ పోకడలను సమగ్ర అంచనాను వివరిస్తుంది. ఉద్యోగాల నాణ్యత, అనధికారిక ఉపాధి యొక్క ప్రాబల్యం మరియు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో నివసించే ఉద్యోగులు యొక్క సమస్యలను కూడా పరిశోధిస్తుంది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని శ్రామిక శక్తిలో ఐదు శాతం మందికి ఉద్యోగం లేదు. ఉద్యోగం మరియు ఉపాధి కోసం వెతుకుతున్న నిరుద్యోగుల సంఖ్య  రెండూ కోవిడ్‌ మహమ్మారి ముందు స్థాయి కంటే తగ్గాయి. మహమ్మారి ముందు కంటే ఇది మెరుగైన పరిస్థితి. కానీ ఇది కొనసాగేలా ఇంకా పరిస్థితులు నెలకొల్పబడలేదు. 2023 సంవత్సరంలో పని కోసం వెతుకుతున్న నిరుద్యోగుల సంఖ్య ధనిక దేశాల్లో 8.2 శాతం ఉండగా, పేద దేశాల్లో ఇది 20.5 శాతంగా ఉంది. రాబోయే 12 నెలల్లో అదనంగా రెండు మిలియన్ల మంది ప్రజలు ఉద్యోగం కోసం వెతుకుతారని అంచనా.  ప్రపంచంలోని అత్యధిక ధనిక  దేశాలు ద్రవ్యోల్బణం కారణంగా జీవన ప్రమాణాలు క్షీణించడాన్ని చవిచూశాయి. ఈ క్షీణత అనేది త్వరగా కోలుకునే అవకాశం కనిపించడం లేదు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ నిపుణులు అధిక మరియు తక్కువ ఆదాయ దేశాల మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పారు.  2022 సం.లో 5.3 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2023 సంవత్సరం లో కొద్దిగా మెరుగుపడి 5.1 శాతంగా నమోదైంది. ఈ రేటు సంపన్న దేశాలలో 4.5 శాతంగా ఉండగా, తక్కువ ఆదాయ దేశాలలో ఇది 5.7 శాతంగా ఉంది. 2024 సం.లో  ఈ నిరుద్యోగిత రేటు 5.2 శాతానికి పెరగవచ్చని తెలిపింది. భవిష్యత్తులో ప్రపంచ నిరుద్యోగం పెరగనుంది.  2023లో  అత్యంత పేదరికంలో జీవిస్తున్న వారు  దాదాపు పది లక్షల మంది పెరిగారు. మితమైన పేదరికంలో జీవించే కార్మికుల సంఖ్య  2023 లో 84 లక్షలు మంది పెరిగారు. దీని మూలాన ఆదాయ అసమానత కూడా పెరిగింది. పన్నుల అనంతర ఆదాయక్షీణత యాగ్రిగెట్‌ డిమాండ్‌ మరియు మరింత స్థిరమైన ఆర్థిక పునరుద్ధరణకు హానికరం అని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ, వినియోగ, పెట్టుబడి వ్యయాల మరియు నికర ఎగుమతుల మొత్తాన్ని యాగ్రిగెట్‌ డిమాండ్‌ అని మాంద్యం నుండి ఆర్థిక వ్యవస్థ పుంజుకొని తిరిగి విస్తరించడాన్ని ఆర్థిక పునరుద్ధరణ అని అంటారు. అనధికార ఆర్థిక వ్యవస్థను పరిష్కరించడానికి వివిధ విధాన కార్యక్రమాలు ఉన్నప్పటికీ అనధికారికంగా ఉపాధి పొందుతున్న వ్యక్తుల సంఖ్య స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి వారు 2024లో ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 58 శాతం మంది ఉంటారని అంచనా వేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గత సంవత్సరం మే నెలలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కోవిడ్‌-19 కి ముగింపుగా ప్రకటించినప్పటికీ మహమ్మారి యొక్క ప్రకంపనలు ఇప్పటికీ అవగతం చెందుతూనే ఉన్నాయని ఈ నివేదిక వెల్లడిరచింది. ఇప్పటికీ దీర్ఘకాలిక కోవిడ్‌ తో బాధపడుతున్న వారిలో 20 శాతం  లేదా అంతకంటే ఎక్కువ మంది పోస్ట్‌ కోవిడ్‌ లక్షణాలు, ఆరోగ్య సమస్యలుతో బాధ పడుతున్నారని, వీరి వలన ఉత్పాదకత తగ్గుముఖం పట్టిందని నివేదిక పేర్కొంది.

కోవిడ్‌ మహమ్మారి తర్వాత లేబర్‌ మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశించిన చాలా మంది మునుపటిలా అదే సంఖ్యలో పని చేయలేక పోతున్నారని, కోవిడ్‌ అనంతరం అనారోగ్యం కారణంగా పనిచేయని  రోజుల సంఖ్య గణనీయంగా పెరిగాయాని తెలిపింది. ఉద్యోగ మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం త్వరగా పుంజుకున్నా కూడా లింగ  అంతరం కూడా కొనసాగుతోందని పేర్కొంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వృద్ధిని నమోదు చేసే దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో యువత నిరుద్యోగిత రేట్లు ఒక సవాలుగా కొనసాగుతున్నాయి. ఏ ఉద్యోగంలో లేదా చదువులో లేదా శిక్షణా కార్యక్రమంలో  లేని యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యువతులలో దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలకు సవాళ్లు ఎదురవుతున్నా యి. కోవిడ్‌19 మహమ్మారి తర్వాత  కార్మిక ఉత్పాదకత మునుపటి దశాబ్ద కనిష్ట స్థాయికి తిరిగి వచ్చింది. ముఖ్యంగా సాంకేతిక పురోగతులు మరియు పెరిగిన పెట్టుబడులు ఉన్నప్పటికీ ఉత్పాదకత వృద్ధి మందగించడం కొనసాగించిందని నివేదిక కనుగొంది.

కారణం ఏమిటంటే గణనీయమైన మొత్తంలో పెట్టుబడులు సేవలు మరియు నిర్మాణం వంటివి తక్కువ ఉత్పాదక రంగాల వైపు మళ్లించబడ్డాయి. వ్యక్తిగత జీవనోపాధి మరియు వ్యాపారాలు రెండిరటికీ ముప్పుగా పరిగణిస్తున్న శ్రామికశక్తి సవాళ్లను ఎదుర్కుంటుంది. వాటిని సమర్థవంతంగా మరియు వేగంగా పరిష్కరించడం చాలా అవసరం.   నిరంతర ద్రవ్యోల్బణంతో పడిపోతున్న జీవన ప్రమాణాలు మరియు బలహీన ఉత్పాదకతలు ఎక్కువ మంది ప్రజలలో అసమానత  పరిస్థితులును కలిగజేయడమే  కాకుండా సామాజిక న్యాయం సాధించే ప్రయత్నాలను కూడా బలహీనపరిచే ప్రమాదం ఉందని నివేదిక తెలిపింది. సామాజిక న్యాయం  లేకుండా ప్రపంచం ఎప్పటికీ స్థిరమైన పునరుద్ధరణను పొందలేదని ఐయల్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌ గిల్బర్ట్‌ హౌంగ్బో హెచ్చరించారు. శ్రామిక శక్తి సవాళ్లను త్వరగా మరియు సమర్ధవంతంగా పరిష్కరించాలని పిలుపునిచ్చారు.

జనక మోహనరావు
అధ్యాపకుడు, ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా,  ఆంధ్రప్రదేశ్‌, 8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page