ప్రపంచ పట్టణాల సూచికలో మనమెక్కడ..!

ఆధునిక డిజిటల్‌ ఏఐ యుగంలోఆకరషణీయ ఉద్యోగ ఉపాధులను వెతుక్కుంటూ గ్రామీణ యువత పట్టణాలకు చేరడం వేగంగా జరుగుతోంది. పల్లె యువత ఆర్థికంగా లాభం లేని వ్యవసాయ ఆధార వృత్తులను వదిలి ఎర్ర బస్సెక్కి నగరాలకు చేరడం, ఏదో ఒక పనిని చూసుకొని బతుకు పోరు సాగించడం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ క్రమంగా, వేగంగా పెరగడంతో అంతే వడిగా సమస్యలు కూడా నగరవాసులకు నరకం చూపిస్తున్నాయని ఇటీవల ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ విభాగం విడుదల చేసిన ‘‘ప్రపంచ పట్టణాల సూచిక లేదా గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌’’ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 1,000 ప్రపంచ నగరాల ‘గ్లోబల్‌ సిటీస్‌ ఇండెక్స్‌‘ అధ్యయనాలకు మూలాలుగా నగరాల ఆర్థిక ప్రగతి, మానవ వనరులు, పర్యావరణం, జీవన నాణ్యత, ప్రభుత్వ పరిపాలనలకు సంబంధించిన 27 ఇండికేటర్స్‌ను తీసుకున్నారు.

ప్రపంచ పట్టణాల్లో అత్యంత వేగంగా జీడిపీ పెరుగుతున్న 10 భారత నగరాలు
2019 – 35 మధ్య కాలంలో ప్రపంచ నగరాలన్నింటిలో అత్యంత వేగంగా పెరుగుతున్న భారత్‌కు చెందిన 10 నగరాలు ముందు వరుసలో ఉండడం ప్రధాన అంశంగా పేర్కొంటున్నారు. ప్రతి ఏట వేగంగా పెరుగుతున్న 20 ప్రపంచ నగరాల జాబితాలో భారత్‌కు చెందిన 17 నగరాలు ముందు వరుసలో ఉండడం గమనార్హం. అత్యంత వేగంగా 9.17 శాతం జిడిపీ పెరుగుదల చూపిన గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమలతో పాటు వజ్రాల వాణిజ్య పట్టణమైన సూరత్‌  ప్రపంచ నగరాల జాబితాలో ప్రథమ స్థానం దక్కించుకుంది. దీనితో పాటు తొలి 10 స్థానాల్లో భారతీయ నగరాలు చేరాయని నివేదిక స్పష్టం చేస్తున్నది.

ఈ జాబితాలో సూరత్‌ (జిడిపీ వృద్ధి రేటు 9.17 శాతం), ఆగ్రా (8.58 శాతం), బెంగుళూరు (8.5 శాతం), హైదరాబాదు (8.47 శాతం), నాగపూర్‌ (8.41 శాతం), తిరుపూర్‌ (8.36 శాతం), రాజ్‌కోట్‌ (8.33 శాతం) తిరుచిరాపల్లి (8.29 శాతం), చెన్నై (8.17 శాతం), విజయవాడ (8.16 శాతం) లాంటి 10 నగరాలు తొలి 10 స్థానాలను దక్కించుకున్నాయి. ఆగ్రా నగరం పర్యాటకం, వస్త్ర పరిశ్రమలు, ఆటోమొబైల్స్‌ లాంటి అంశాలకు పేరుగాంచింది. ఏటికి పేరొందిన బెంగుళూరును సిలికాన్‌ వ్యాలీలా ఆఫ్‌ ఇండియాగా పిలుస్తున్నాం. ఐటీ, అంకుల్‌ సంస్థల హబ్‌గానే కాకుండా ‘సిటీ ఆఫ్‌ పెరల్స్‌’గా హైదరాబాదుకు గుర్తింపు ఉన్నది. నాగపూర్‌లో దాదాపు 22,000 ఎంఎస్‌ఎంఈలు పనినచేస్తున్నాయి. నిట్‌వేర్‌ ఇండస్ట్రీ హబ్‌గా తిరుప్పూర్‌, మాన్యుఫాక్చరింగ్‌, ఆటోమొబైల్‌ హబ్‌గా రాజ్‌కోట్‌, ఇండస్ట్రియల్‌ సిటీగా తిరుచురాపల్లి, ఆటోమొబైల్‌, ఫిలిం, ఐటీ హబ్‌గానే కాకుండా ‘డెట్రాయిట్‌ ఆఫ్‌ ఇండియా’గా చెన్నై, పలు రకాలైన వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా విజయవాడ నగరాలకు గుర్తింపు ఉన్నది.

అత్యధిక ఆర్థిక వ్యవస్థలు కలిగిన 10 ప్రపంచ పట్టణాలు
అత్యధిక ఆర్థిక వ్య వస్థ (లార్జెస్ట్‌ అర్బన్‌ ఎకానమీ) కలిగిన ప్రపంచ నగరాల జాబితాలో న్యూయార్క్‌ ప్రధమ స్థానాన్ని నిలుపుకుంటూ వస్తున్నది. అత్యధిక ఆర్థిక వ్యవస్థ కలిగిన నగరాల్లో భారత నగరాలు వెనుకబడి ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ప్రపంచ పట్టణాల సగటు ఆర్థిక వృద్ధి 2.6 శాతంగా నిర్థారించబడిరది. అత్యధిక ఆర్థిక వ్యవస్థ కలిగిన 10 ప్రపంచ పట్టణాల్లో న్యూయార్క్‌(యూఎస్‌), లండన్‌(యూకె), సాన్‌ జోస్‌ (యూఎస్‌), టోక్యో(జపాన్‌), పారిస్‌(ఫ్రాన్స్‌), సీటిల్‌ (యూఎస్‌), లాస్‌ ఎంజెలిస్‌ (యూఎస్‌), సాన్‌ ఫ్రాన్సిక్సో (యూఎస్‌), మెల్బర్న్‌(ఆస్ట్రేలియా), జూరిచ్‌(స్విస్‌) ముందు స్థానాలను దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్త ప్రధాన 1,000 నగరాల ద్వారా 60 శాతం జిడిపీ వయద్ధి నమోదు అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ జాబితాలో యూఎస్‌కు చెందిన 5 పట్టణాలు ఉండడం విశేషం.

మానవ వనరులు, క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌, పరిశుద్ధ పర్యావరణం, ప్రభుత్వ పాలన విభాగాలు
హ్యూమన్‌ క్యాపిటల్‌ (మానవ వనరులు) విభాగంలో లండన్‌ (యూకె), టోక్యో(జపాన్‌), రియాద్‌?(సౌథీ), న్యూయార్క్‌ (యూఎస్‌), సియోల్‌(దక్షిణ కొరియా) నగరాలు తొలి ఐదు స్థానాలను దక్కించుతున్నాయి. జీవన నాణ్యత లేదా క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ విభాగంలో గ్రెనోబుల్‌ (ఫ్రాన్స్‌), కాన్‌బెరా (ఆస్ట్రేలియా), బెర్న్‌(స్విస్‌), బెర్జెన్‌(నార్వే), బేసెల్‌(స్విస్‌) పట్టణాలు తొలి ఐదు స్థానాలను ఆక్రమించాయి. పరిశుద్ధ పర్యావరణం కలిగిన ప్రపంచ నగరాల జాబితాలో సువా(ఫిజి), ఫోర్టలెజా(బ్రెజిల్‌), సాన్‌ జువా(పెర్టో రికో),నాటల్‌(బ్రెజిల్‌), వెల్లింగ్టన్‌(న్యూజీలాండ్‌) పట్టణాలు ఉన్నాయి. పారదర్శక, నిష్పాక్షిక ప్రభుత్వ పరిపాలన విభాగంలో న్యూజీలాండ్‌, డెన్మార్క్‌, ఫిన్‌లాండ్‌, నార్వే, స్వీడెన్‌ దేశాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

భారత పట్టణాల్లో నేడు పర్యావరణ కాలుష్యం, జీవన నాణ్యత కొరవడడం, ప్రభుత్వ పాలన అవినీతి కోరల్లో చిక్కడం, మౌళిక వనరుల కొరత, అస్తవ్యస్త ప్రజారవాణ, రోడ్ల దుస్థితి, పలుచనైన హరిత వనాలు, ప్రణాళికా రహిత పట్టణీకరణ లాంటి పలు ప్రధాన సమస్యలు పట్టి పీడిస్తున్నాయని తెలుసుకొని ప్రభుత్వాలు, పట్టణ పౌర సమాజం తమ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరుకుందాం.
 -డా.బుర్ర మధుసూదన్‌ రెడ్డి
కరీంనగర్‌, 9949700037 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page