ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?

ఉద్యోగులపై పని భారం
మహాలక్ష్మి పథకంతో కార్మికుల పెరిగిన భారం
ప్రశ్నోత్తరాల సమయంలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం వాస్తవం..తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తాన్న బిఆర్‌ఎస్‌ నేత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారని, అపాయింట్‌మెంట్‌ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్‌ అవర్‌లో ఆయన మాట్లాడుతూ..ఆర్టీసీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానాలు ఒకరకంగా చెప్పాలంటే బాధ్యతా రహితంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. జాప్యం జరగడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నిస్తే..లేదండీ అన్నారని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం వొచ్చి ఎనిమిదో నెల జరుగుతున్నదని, ఇంకా జాప్యం జరుగలేదని, ఎప్పటిలోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి..నియమిత రోజు ప్రకటించడం అవుతుందా అని తాను ప్రశ్నిస్తే..పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో పేజీ నెంబర్‌ 28లో ఐటెమ్‌ నంబర్‌ 14లో టీఎస్‌ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం అని పెట్టారని, ఇందులో ఆర్టీసీ కార్మికులను, ప్రభుత్వ విలీన పక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తామని చెప్పారని, అందుకు ఎనిమిది నెలల సమయం సరిపోదా..అంటూ ప్రశ్నించారు.

వొచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తామని, ఆర్టీసీ బస్సులను ఆధునికకీరించి.. విస్తరిస్తామని, అధునాతమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తామని, ఆర్టీసీ యూనియన్‌ పునరుద్ధరణకు అనుమతిస్తామని మేనిఫెస్టోలో చెప్పారని హరీష్‌ రావు గుర్తు చేశారు. తాను ఇతర విషయాల్లోకి వెళ్లకుండా మంత్రిని సూటిగా ప్రశ్నించ దలచుకున్నానని, మంత్రి ఎప్పటిలోగా అపాయింటెడ్‌ డే ప్రకటిస్తారని, ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని ప్రశ్నినస్తూ..పరిశీలనలో ఉంది.. చూస్తాం.. చేస్తామని కాలయాపన చేయడం కాదని, ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మంత్రిని కోరుతున్నానని, యూనియన్‌ పునరుద్ధరిస్తామని వారు హావిూ ఇచ్చారని, యూనియన్‌ పునరుద్ధరణ ఎప్పటిలోగా చేస్తారని హరీష్‌ రావు ప్రశ్నించారు. తమకు ప్రభుత్వం నుంచి యూనియన్‌ను పునరుద్ధరించేది లేదని ఉత్తర్వులు ఇచ్చినట్లుగా సమాచారం వొచ్చిందని, ఉత్తర్వులు ఇచ్చారా..లేదా..అని ప్రశ్నిస్తూ…ఇవ్వకపోతే ఎప్పటిలోగా యూనియన్‌ను పునరుద్ధరిస్తారంటూ నిలదీశారు.

ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో పిల్లలకు పర్మినెంట్‌ ఉద్యోగం ఇచ్చేవాళ్లమని, కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చాక ఆ పర్మినెంట్‌ ఉద్యోగం అనే నిబంధన తీసివేసి.. మరో స్కీమ్‌ను పెట్టి కేవలం రూ.15 వేల జీతం ఇచ్చి మూడేళ్లు పని చేస్తే అప్పుడు పర్మినెంట్‌ చేస్తామని చనిపోయిన కార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యాయం చేసినమాట వాస్తవమా..అని ప్రశ్నిస్తూ..ఇది ఎందుకు తెచ్చారని, గత ప్రభుత్వంలాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి నెక్లెస్‌ రోడ్‌లో తమ ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిన బస్సులు వొస్తే జెండా ఊపడం సంతోషమేనని, అయితే ప్రభుత్వం నిరంతర పక్రియ అని, జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు రూ.300కోట్ల చెక్కును సీఎం చూపించారని, కార్మికులకు పీఆర్సీ బకాయిలు విడుదల చేస్తామని చెక్కు చూపారని, పాపం మంత్రి సీఎం వెళ్లిపోయాక డవ్మిూ చెక్కులు కార్మికులకు ఇచ్చి ఫొటోలు దిగారన్నారు.

ఈ చెక్కులు ఫిబ్రవరి 10, 2024 రోజున ఇచ్చారని, మనం ఇవాళ జూలై నెలలో ఉన్నామని, దాదాపు ఐదునెలలైనా నెక్లేస్‌రోడ్‌ నుంచి ఆ చెక్కు బస్‌ భవన్‌కు చేరలేదని, ఆ చెక్కు ఎప్పడు చేరుతుంది..ఎప్పుడు ఇస్తరు చెప్పాలని కోరుతున్నానన్నారు. ఆర్టీసీలో ఉద్యోగులపై పనిభారం మోపుతున్నారని.. కొత్త ఉద్యోగులను ఎప్పుడు నియమిస్తారని మంత్రి హరీష్‌ రావు శాసనసభలో ప్రశ్రించారు. మహాలక్ష్మి పథకం తేవడం సంతోషమని, దాన్ని అభినందిస్తున్నామని, ఈ పథకానికి నెలనెల బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా అని ప్రశ్నిస్తూ.. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని, ఇప్పటి వరకు ఇచ్చినవి ఎన్ని అని హరీష్‌ రావు ప్రశ్నించారు. ఇవ్వకపోవడం వల్ల కార్మికుల పీఎఫ్‌, సీసీఎస్‌ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా…అనా ఆ నిధులు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఇచ్చామని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు బడ్జెట్‌లో రూ.100కోట్లు పెట్టారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.200కోట్లు పెట్టిందని, కానీ తమ ప్రభుత్వం రూ.1000కోట్లు, రూ.1500కోట్లు, బడ్జెట్‌లో పెట్టి ఆర్టీసీ సంస్థను కాపాడామన్నారు.

కార్మికులకు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యాక్ట్‌ ఉంటుందని, డ్రైవర్లు, కండక్టర్లు ఎనిమిది గంటలకంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుందని, అందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారన్నారు. వారిని 16 గంటలు, 18 గంటలు పని చేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్న మాట వాస్తవమా…అని ప్రశ్నిస్తూ..మహాలక్ష్మి పథకం వొచ్చాక ఓవర్‌లోడ్‌ కావడం ద్వారా పనిగంటల భారం పెరిగి.. దానికి సరిపడా కండక్టర్లు, డ్రైవర్లను నియామకం చేయకపోవడం వల్ల కార్మికులు ఓవర్‌టైం చేసి ఇబ్బందులు పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వొచ్చిందా అని ప్రశ్నించారు. దానికి అనుగుణంగా నియామకం ఎప్పటిలోగా చేస్తారని, రాజకీయాల్లోకి వెళ్లకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పక్రియ ఏర్పాటు చేయాలని.. స్పెసిఫిక్‌ డేట్‌ ఇచ్చి.. రాష్ట్రంలో ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపికబురు అందించాలని స్పీకర్‌ ద్వారా సీఎం, రవాణాశాఖ మంత్రిని కోరుతున్నానని హరీష్‌ రావు అన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం వాస్తవం..తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తాం
తెలంగాణకు అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తీర్మానాన్ని తాము ఏకగ్రీవంగా ఆమోదిస్తామని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయం వాస్తవమని హరీష్‌ రావు అన్నారు. ఈ అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటే వొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అంతేకాదు, బ్జడెట్‌లో రాష్ట్రానికి మొండిచేయి చూపినందుకు నిరసనగా సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీలో దీక్ష చేస్తానంటే తాము మద్దతిస్తామని చెప్పారు. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page