- కెసిఆర్వి ప్రజా వ్యతిరేక విధానాలు
- టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్
ప్రజాతంత్ర, మెదక్, మార్చి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని అడిగితే అరెస్ట్ చేసి స్టేషన్కు పంపారని ఆయన మండిపడ్డారు. మల్లన్న సాగర్ రైతులు న్యాయం చేయమని అడిగినందుకు ఆ గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టారని ఆయన విమర్శించారు.
టీఎన్జీవో భవన్లో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమంపైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల భర్తీ పై జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి శూన్యమన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను, అప్పులు రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే వారి గొంతునొక్కు తున్నారని, అక్రమ కేసులు బానాయిస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.