కేసీఆర్ మూడో కలను.. ‘ఖల్లివెల్లి’ చేసిన గల్ఫ్ కార్మికులు
కార్మికులు గల్ఫ్‌లో ఉన్నా.. గ్రామాల్లో పట్టు
గల్ఫ్ సంక్షేమం గురించి కేసీఆర్ ఇచ్చిన అమలుకాని హామీలకు జవాబుగా తాము కేసీఆర్ ను ‘ఖల్లివెల్లి’ చేయగలిగామని గల్ఫ్ కార్మికులు చర్చించుకుంటున్నారు. పారిపోవడాన్ని అరబ్బీ భాషలో ‘ఖల్లివెల్లి’ అని అంటారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ బీఆర్ఎస్ పతనాన్ని సూచిస్తూ, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో గల్ఫ్ వోటు బ్యాంకు ప్రభావం గురించి గల్ఫ్ వలస కార్మిక సంఘాల నాయకుల విశ్లేషణ. ఫలితాలు వెలువడిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది. గల్ఫ్ కార్మిక కుటుంబాల అసంతృప్తి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక వోటుగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం ఇందుకు తోడైంది. గల్ఫ్ వోటు బ్యాంకు ఎక్కువశాతం కాంగ్రెస్ వైపు, కొంతమేర బీజేపీ వైపు మొగ్గు చూపారు. ప్రభుత్వ వ్యతిరేక వోటు ను కాంగ్రెస్, బీజేపీ లు చీల్చడం వలన కొన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ లాభ పడిరది. గల్ఫ్ జెఏసి నాయకులు సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, ధర్మపురి, నిర్మల్ ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయడంతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిరది. గల్ఫ్ సంఘాల నాయకులు ఎన్ని వోట్లు సాధించారు అనే దానికన్నా వారు లేవనెత్తిన గల్ఫ్ సంక్షేమం అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అన్ని పార్టీలు గల్ఫ్ పై మాట్లాడాల్సిన అనివార్యత ఏర్పడిరది. ఇది గల్ఫ్ కార్మికుల నైతిక విజయంగా చెప్పవచ్చు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏర్పాటు గురించి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా తమ ఎలక్షన్ మేనిఫెస్టో లలో స్పష్టమైన హామీ ఇచ్చారు. పదేళ్ళపాటు గల్ఫ్ సమస్యను పక్కనబెట్టిన బీఆర్ఎస్ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కుటుంబాల తీవ్రమైన వ్యతిరేకతను ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం గమనించింది. దిద్దుబాటు చర్యగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇవ్వనున్న రూ.5 లక్షల బీమాను గల్ఫ్ కార్మికులకు కూడా వర్తింపజేస్తామని డిచుపల్లి సభలో కేసీఆర్ ప్రకటించారు. గల్ఫ్ సంక్షేమ పథకాలను జనవరి నుంచి అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ తన సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక రోడ్ షో లో ప్రకటించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కేసీఆర్, కేటీఆర్ ల మాటలను ఆపద మొక్కుల ప్రకటనలను గల్ఫ్ కుటుంబాలు విశ్వసించలేదు.
గల్ఫ్ శ్రామికుల హక్కుల ఉద్యమకారులు, గల్ఫ్ కార్మిక సంఘాలు, గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికులు సోషల్ మీడియా వేదికగా తమకు జరిగిన అన్యాయాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తెచ్చారు. సప్త సముద్రాలు దాటి ఎడారిలోని అరబ్ గల్ఫ్ దేశాలకు వలసపోయిన కార్మికులు… తెలంగాణ గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్ లో తమ ప్రభావాన్ని చూపారు. కార్మికులు గల్ఫ్ లో ఉన్నా.. గ్రామాల్లో పట్టు కలిగి గెలుపోటములను శాసించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో… బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి అనే నినాదం ఒక పవర్ ఫుల్ మిస్సయిల్ లాగా పనిచేసింది. ఇప్పుడు… అదే ఉద్యమ నినాదం తిరగబడ్డ మిస్సయిల్ అయ్యింది. కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైనందున బీఆర్ఎస్ పార్టీకి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు దూరమయ్యాయి. 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్ సభ స్థానాలలో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీల ఓటమిలో గల్ఫ్ కార్మిక కుటుంబాల పాత్ర కీలకం. గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో గల్ఫ్ వోటు బ్యాంకు చూపిన ప్రభావాన్ని తేలికగా తీసుకుని, సరిగా విశ్లేషణ చేసుకోకపోవడం వలన ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ మూల్యాన్ని చెల్లించుకున్నది. ‘గల్ఫ్ గండం’ ను తప్పించుకోలేక పోయింది.
గత పదేళ్లలో గల్ఫ్ దేశాలలో మృతి చెందిన సుమారు రెండు వేల మంది తెలంగాణ వలస కార్మికులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వకపోవడం, గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించకపోవడం, గల్ఫ్ బోర్డుతో కూడిన సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటించకపోవడం గల్ఫ్ కార్మికుల ఆగ్రహానికి కారణమైంది. ఇచ్చిన హామీని నెరవేర్చని కేసీఆర్ పై గల్ఫ్ మృతుల కుటుంబాల శాపనార్థాలు, గల్ఫ్ బాధితుల ఆర్తనాదాలు బీఆర్ఎస్ ను గట్టిగా తాకాయి. కొరోనా కష్ట కాలంలో హోటల్ క్వారంటయిన్ పేరిట రూ.8 వేల చొప్పున వసూలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంపై, అధిక విమాన ఛార్జీలు వసూలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వంపై గల్ఫ్ రిటనీలు తమ అసంతృప్తిని చాటారు. గల్ఫ్ దేశాలలో తెలంగాణ కూలీలు 15 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా. గత పదేళ్లలో ఎడారి దేశాల నుండి మరో 15 లక్షల మంది వాపస్ వచ్చి గ్రామాలలో సరైన ఉపాధి లేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. స్థానిక వనరులతో పరిశ్రమలు ఏర్పాటు, వ్యవసాయ రంగానికి మద్దతు ఇస్తే వలస సమస్యలు కొంతవరకు తీరేవి. వీరందరి కుటుంబ సభ్యులు కలిస్తే ఒక కోటి వరకు గల్ఫ్ వోటు బ్యాంకు ఉన్నది. తెలంగాణలో 32 అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్ కుటుంబాల ఓట్లు నిర్ణయాత్మకంగా మారాయి. సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, ధర్మపురి (ఎస్సీ), నిర్మల్, ముధోల్, ఖానాపూర్ (ఎస్టీ), చొప్పదండి (ఎస్సీ), బాల్కొండ, ఆర్మూర్, జగిత్యాల, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్ 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అత్యధిక గల్ఫ్ వలసలు ఉన్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు (ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, బోధన్, పెద్దపల్లి, దేవరకద్ర, మక్తల్, మెదక్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, పరిగి 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోఒక మోస్తరు గల్ఫ్ వలసలు ఉన్నాయి. డిసెంబర్ 3 తర్వాత ఈ 32 అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలను విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.
-గల్ఫ్ కార్మికుడు