అందుకే జాతీయ హోదా స్కీమ్‌లో దానిని చేర్చలే
ఎంపి ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక జవాబు
న్యూ దిల్లీ, జూలై 21 : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం,జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు అన్నారు. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు స్కీమ్ లోకి కాళేశ్వరాన్ని చేర్చే అర్హతలేదని వెల్లడించారు. మొత్తంగా జాతీయ హోదాకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. అయితే ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పర్మిషన్లు ఉంటేనే కాళేశ్వర ప్రాజెక్టును హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. హైపవర్ కమిటీ అనుమతిస్తేనే జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చే అర్హత దానికి లేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయకమంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. జాతీయ హోదా ప్రాజెక్టు పథకంలో ఏ ప్రాజెక్టునైనా చేర్చాలంటే కేంద్ర జలసంఘం అధ్యయనం తప్పనిసరి కేంద్రం చెబుతుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ సలహా కమిటీ ఆమోదం పొందాలని పేర్కొంది. పెట్టుబడుల అనుమతి కేంద్రం నుంచి తీసుకోవాలని తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోలేదని కేంద్రం అంటుంది. కాళేశ్వరరానికి జాతీయ హోదా లభిస్తే.. ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.