- కరకట్టను ముంపు ప్రాంతాల వరకు పొడిగించాలి
- భద్రాచలం కరకట్ట ప్రజల్లో చిరస్థాయిగా నిలిచింది
- భద్రాచలం పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తూనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు భద్రాచలం చేరుకున్నారు. ముందుగా శ్రీ సీతారామ చంద్రస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం 2000 సంవత్సరంలో తాను నిర్మించిన గోదావరి నిరోధక కరకట్టను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1986 లో వచ్చిన వరద భద్రాచలం ప్రాంతాన్ని పూర్తిగా ముంచిందని అన్నారు.అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు నేరుగా భద్రాచలం పర్యటించి భద్రాచలానికి శాశ్వత పరిష్కారం చేయాలని అప్పట్లోనే నిర్ణయించారని తెలిపారు. అప్పట్లో తాను తెలుగుదేశం పార్టీని జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నానని వివరించారు.
అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ఆదేశాల మేరకు కరకట్ట నిర్మాణం కోసం భద్రాచలం ప్రాంతంలో పర్యటించి పక్కా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.ఆ తరువాత కొంతసమయం గడిచినప్పటికి 2000 సంవత్సరంలో కరకట్ట నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. అప్పటి నుండి భద్రాద్రి ప్రజలు వరదలపై భరోసా కలిగించినామని సంతృప్తి వ్యక్తం చేసారు. వరదల వలన తనకు ఎటువంటి హాని జరుగదనే నమ్మకాన్ని కలిగించిన ప్రభుత్వం తెలుగుదేశం అని గుర్తు చేసారు. ప్రస్తుతం కరకట్టను ఆంధ్రా ప్రాంతానికి విలీనమైన ప్రాంతా)ను పొడిగించినట్లైతే వరద ముంపు తగ్గుతుందని తెలిపారు. సాధ్యమైనంత వరకు రెండు ప్రభుత్వాలతో మాట్లాడేందుకు చొరవచూపుతానని తెలిపారు. అలాగే ఇటీవల వరద వలన నష్టపోయిన వరద బాధితులను పరామర్శించారు. వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రాలో విలీనమైన ఎటపాక తదితర పంచాయితీలలో చంద్రబాబు పర్యటించారు. కాగా అక్కడ ప్రజలు ఆంధ్రప్రదేశ్ వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తమను తెలంగాణలో కలపాలని చంద్రబాబును కోరారు. అయితే ముందుగా శాశ్వత పరిష్కారం కోసం కరకట్ట నిర్మాణం చేపట్టాలని చెప్తూ మాట దాటవేసారు.
తెలుగుదేశం ప్రభుత్వం వలనే భద్రాచలం రామాలయం అభివృద్ది జరిగిందని ప్రజల్లో నమ్మకం ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేసిందని గుర్తు చేసారు. భద్రాచలం పట్టణంలో తమకు చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన కరకట్ట అని గుర్తు చేసారు. అలాగే భద్రాచలం ప్రాంతంలో జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, వంద పడకల ఆసుపత్రి , ఇంజనీరింగ్ కళాశాల నిర్మించటం జరిగిందని గుర్తు చేసారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం యువత నాలెడ్జ్ అకాడమీలో భాగస్వాములు కావాలని తాను ఐటికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. చదువుకున్న ప్రతీ ఒక్కరు హైద్రాబాద్ లోనే కాకుండా ప్రపంచంలో ఉపాధి కల్పించినట్లు గుర్తు చేసారు. ఐదు పంచాయితీలు సురక్షితంగా ఉండాలంటే కరకట్ట నిర్మాణం చేసి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.