ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ ‌తమిళిసై తీరు

• ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయం
• రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుందా..? : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:  ‌ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ ‌తమిళిసై వ్యవహరించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం పంపిన జాబితాను గవర్నర్‌ ఆమోదించడం సంప్రదాయమని, దానికి విరుద్ధంగా అనేక కారణాలు చెప్పి సర్కారు పంపిన పేర్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా బీజేపీ రాజ్యాంగం నడుస్తున్నదా అని ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు అసెంబ్లీ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. ఐలమ్మకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం డియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్‌ ‌తమిళిసై తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా అనర్హులని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గవర్నర్‌ ‌పదవి చేపట్టేముందు ఫక్తు రాజకీయ పదవిలో ఉన్న తమిళి సై సైతం రాజకీయాల్లో ఉన్నందునే ఇద్దరి అభ్యర్థిత్వాల తిరస్కరణకు కారణమని చెప్పటం రాజకీయం కాక మరేమిటని బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై రాష్ట్ర గవర్నర్‌గా నియమితులు కావచ్చుకానీ.. దాసోజు శ్రవణ్‌, ‌కుర్రా సత్యనారాయణ గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీగా ఉంటే తప్పేమిటి? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరూ అర్హులని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జూలై 31న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి, గవర్నర్‌ ‌కోటాకు సరితూగే దాసోజు శ్రవణ్‌, ‌కుర్రా సత్యనారాయణను ఎంపిక చేసింది. అయితే, ఆ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందని, ఈ కారణంగానే వారి అభ్యర్థిత్వాలను తిరస్కరించేందుకు ప్రధాన కారణమని గవర్నర్‌ ‌తమిళి సై పేర్కొనటం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది.

రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయాలు చేయటమే పరమావధిగా తమిళి సై వ్యవహారశైలి ఉందని మరోసారి రుజువైందని బీఆర్‌ఎస్‌ ‌నేతలు విమర్శిస్తున్నారు.రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. గవర్నర్లే ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయని తెలిపారు. బీసీ వర్గాలకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పెద్దపీట వేస్తున్నదని కవిత చెప్పారు. తమది బీసీ వ్యతిరేక పార్టీ అని బీజేపీ మరోసారి నిరూపించుకున్నదని వెల్లడించారు. కమలం పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. కాగా, ఉద్యమకారులు దాసోజు శ్రవణ్‌, ‌కుర్రా సత్యనారాయణలను గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపిన ఫైలును గవర్నర్‌ ‌తిరస్కరించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page