తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి కెటిఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని, అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితమనే తెలిపారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యవస్ధల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహన లేకుండా, బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు, ప్రభుత్వ శాఖలపై కనీస పరిజ్ఞానం, వాటి మధ్య ఉన్న తేడా తెలవకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా అర్థరహితమైన ఆరోపణలు చేయడం..బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిరద్శనమన్నారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు ధరణి పోర్టల్, టీఎస్‌పీఎస్సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం సహించబోనని హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి అర్థరహితమైన, నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలో అబాసు పాలై, పరువునష్టం కేసు ఎదుర్కుంటున్నారని గుర్తుచేశారు. అయినా బండి సంజయ్‌కి బుద్ది రాలేదని, ఈసారి కూడా తనకు సంబంధం లేని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కునాల్సి వొస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీ పాలిస్తున్న అనేక రాష్ట్రాల్లో వరుసగా ఉద్యోగ నియామక పక్రియలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాలు వందల్లో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే 8 సంవత్సరాలలో 13 సార్లు జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై బండి సంజయ్‌ని సూటిగా ప్రశ్నించారు. గుజరాత్‌లో పేపర్ లీకేజీలపై ప్రధానమంత్రి మోదీని బాధ్యున్ని చేసి ఆయన రాజీనామాను డిమాండ్ చేయాలని సవాల్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్వశ్చన్ పేపర్లు లీకైతే.. తిరిగి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. అక్కడ పేపర్లు లీకైనప్పుడు మంత్రిని కానీ.. లేక అక్కడి ముఖ్యమంత్రిని కానీ.. ఏనాడు బీజేపీ బాధ్యులను చేయలేదని గుర్తుచేశారు. స్వయంగా బీజేపీ నాయకులే కీలక సూత్రధారులుగా ఉన్న మధ్యప్రదేశ్‌లో ఉద్యోగాల కుంభకోణంలోనూ బీజేపీ ఎలా వ్యవహరించిందో దేశం మొత్తానికి తెలుసన్నారు. బీజేపీ ప్రభుత్వాల హయాంలో జరిగితే ఒకలా..ఇతర పార్టీలు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిందిస్తూ మరోలా వ్యవహరించడం బీజేపీ డబుల్ స్టాండర్డస్‌కు నిదర్శనమని కేటీఆర్ దుయ్యబట్టారు