- ప్రజల్లో ఎక్కడా కానరాని చర్చ
- 1.30 లక్షల ఆదాయం ఉంటే..రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్ ఎలా సాధ్యం?
- బీజేపీ శిక్షణ తరగతుల ప్రారంభించిన పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్
ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : బడ్జెట్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజల్లో బడ్జెట్‌పై చర్చ లేదు. మాటలు తప్ప చేతల్లేవు. కేటాయింపులు ఘనం..ఖర్చులు స్వల్పం. రూ.2.9 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ. 1.30 లక్షల కోట్లే చూపడమా? మిగిలిన ఆదాయం ఎక్కడి నుండి వొస్తుందో ఎందుకు చెప్పలేదన్నారు. మన్నెగూడలో మంగళవారం వేద కన్వెన్షన్లో బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు ముఖ్య అతిథిగా సంజయ్ హాజరయ్యారు. బండితో పాటు…జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి మురళీధర్ రావు మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, బూర నర్సయ్య గౌడ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..లిక్కర్, భూములు అమ్మకోవడం, పన్నులు, ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం ద్వారా ఆదాయం పెంచుకోవాలనుకుంటున్నారు. కేంద్రాన్ని తిట్టడానికి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుంది. దేశంలో బడ్జెట్‌ను పూర్తి వివరాలతో ప్రవేశపెట్టారు. లిక్కర్ ఆదాయం రూ.40 వేల కోట్లుంటే…కేసీఆర్ అమలు చేస్తున్న ప్రధానమైన సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు దాటడం లేదు. మరి అప్పులు చేస్తున్న లక్షల కోట్లు ఏం చేస్తున్నారో తెల్వని పరిస్థితి ఏర్పడిందని బండి సంజయ్ అన్నారు.