బాసర ఐ.టిని బతికించుకుందాం!!

‘‘విశాలమైన జాతీయ స్థాయి సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్యం,లేదు,పరిపాలనా నియమ,నిబంధనలు లేవు. వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌వ్యక్తిగత నిర్ణయాలే అక్కడ పాలనా సూత్రాలు. గత ప్రభుత్వం దశాబ్ద కాలపు అశ్రద్ధ ఫలితంగా త్రిపుల్‌ ఐ.‌టి. బాసర లో చదువుల విధ్వంసం జరిగింది. కొత్త సర్కార్‌ ‌లో కూడా ఆయన ఏక్‌ ‌నిరంజన్‌ ‌పాలన అప్రతిహతంగా కొనసాగుతుంది.’’

(గత సంచిక తరువాయి…)

నేనే రాజు. నేనే మంత్రి…అంతా నా ఇష్టం…అంటూ ప్రభుత్వ విద్యాకేంద్రాన్ని ఫ్యూడల్‌ ‌పోకడలతో అవి నీతితో భ్రష్టుపట్టిస్తున్న ఒక ఏక్‌ ‌నిరంజన్‌ ‌వైఖరి పై ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు? విశాలమైన జాతీయ స్థాయి సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్యం,లేదు,పరిపాలనా నియమ,నిబంధనలు లేవు. వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌వ్యక్తిగత నిర్ణయాలే అక్కడ పాలనా సూత్రాలు. గత ప్రభుత్వం దశాబ్ద కాలపు అశ్రద్ధ ఫలితంగా త్రిపుల్‌ ఐ.‌టి. బాసర లో చదువుల విధ్వంసం జరిగింది. కొత్త సర్కార్‌ ‌లో కూడా ఆయన ఏక్‌ ‌నిరంజన్‌ ‌పాలన అప్రతిహతంగా కొనసాగుతుంది.

ఎనిమిది వేల మంది కి సంబంధించిన ఒక జాతీయ స్థాయి రెసిడెన్షియల్‌ ‌విద్యాకేంద్రం ఏక వ్యక్తి పాలనకు వదిలివేయడం వలన విశ్వవిద్యాలయం ప్రతిష్ట నానాటికి తిరోగమన దారిపడుతున్నది. ఎకడమిక్‌ ‌విలువలు, మౌలిక సౌకర్యాలు ,విద్యార్థుల వసతి సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడటం పై ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో బాసర త్రిపుల్‌ ఐ.‌టి.అడ్మిషన్ల సంఖ్యగతానితో పోలిస్తే ఐదురెట్లు పడిపోయింది. ఈ యేడుకేవలం పదిహేను వేల అడ్మిషన్లే రావటం ఆశ్చర్యం కలిగిస్తోంది..

image.png
ఎకడమిక్‌ ‌విలువలకు తిలోదకాలేనా!?
ఖాలీగా వున్న 149 రెగ్యులర్‌ ‌పోస్టులను దశాబ్ద కాలంగా భర్తీ చేయటం లేదు. మొదటి, రెండవ సంవత్సరం పి.యు.సి.విద్యార్థులు కోసం ప్రతియేటా తాత్కాలిక బోధనాసిబ్బంది నియమాకం జరుగుతున్నది. సంబంధిత సబ్జెక్టు అర్హతలు లేని వారితో తరగతులు.చెప్పించే ప్రయత్నం ప్రతి సారి విఫలమవుతున్నది. వారి రోజువారీ హాజరు పై నియంత్రణ లేకపోవటం ప్రధాన సమస్యగా మారింది. ఎస్సెస్సీ లో టాపర్‌ ‌గా నిలిచి త్రిపుల్‌ ఐ.‌టి. లో సీట్‌ ‌దొరకటమే అదృష్టంగా భావించి చేరుతున్న విద్యార్థులకు కనీసం క్లాసులు చెప్పించలేని దుర్గతి నెలకొన్నది. మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు సెమిస్టర్‌ ‌పద్దతి పునరుద్దరించాలని గత రెండేళ్ళుగా డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఈ మేరకు వైస్‌ ‌ఛాన్సలర్‌ , ‌స్పెషల్‌ ఆఫీసర్‌ ‌లకు పలుమార్లు వినతి పత్రం సమర్పించారు.

ఎకడమిక్‌ ఇయర్‌ ‌పద్దతిలో విద్యార్థులకు పరీక్షల సిలబస్‌ ‌భారం అవుతుందని,పాస్‌ ‌పర్సంటేజీ నలభై కూడా దాటటం లేదని వారు వాపోతున్నారు. ఫాకల్టీ లేని పరిస్థితులలో వీడియో క్లాసుల ద్వారా సిలబస్‌ ‌కు ప్రిపేర్‌ అవుతున్న నేపథ్యంలో సెమిస్టర్‌ ‌పద్దతిలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు భారం కాకుండా వుంటుందని , పాస్‌ ‌పర్సంటేజీ కూడా పెరుగుతుందని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థుల అడ్మిషన్ల సమ యంలో వారికి హామీ ఇచ్చినట్టుగా టాబ్‌ ‌లు, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు గత చాలా కాలంగా వ్వటం లేదు. గత సంవత్సరం చివరి పరీక్షల ముందు ఇవి అందచేశారు. మూడవ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే గత సంవత్సరం టాబ్‌లు ఇచ్చారు. గత సంవత్సరం వరకూ పి.యు.సి విద్యార్థులకు రేకుల షెడ్డ్లలోనే హాస్టల్‌ ‌నిర్వహించారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌ ‌విద్యార్థుల బ్లాక్‌ ‌లోకి తరలించారే తప్ప నూతన హాస్టల్‌ ‌గదుల నిర్మాణం చేపట్టలేదు.

ఇరవై యేళ్ళంగా లేని కరికులం అప్‌ ‌డేషన్‌
‌జాతీయస్థాయి , అంతర్జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు దీటుగా విద్యార్థులను తీర్చి దిద్దేందుకు ఎలాంటి సాంకేతిక విద్యాసంస్థలైనా తమ కరికులం సిలబస్‌ ‌ను అప్‌ ‌డేట్‌ ‌చేసుకుంటాయి. కానీ దురదృష్టవశాత్తు త్రిపుల్‌ ఐ.‌టి. బాసరలో గత దశాబ్దాలుగా సిలబస్‌ అప్‌ ‌డేట్‌ ‌చేసేందుకు విశ్వవిద్యాలయ పాలకవర్గం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థులు రెండవ సంవత్సరం పూర్తయిన వెంటనే జె.యి.యి. రాసి వేరే త్రిపుల్‌ ఐ.‌టి. విద్యాసంస్థలలో చేరుతున్నారు. ఆరేళ్ళు బాసరలోనే పూర్తి చేసిన వారు క్యాంపస్‌ ‌సెలక్షన్‌ ‌లకు నోచుకోక బయటికి వచ్చాక వివిధ కాంపిటేటివ్‌ ‌పరీక్షలకు,రిక్రూట్‌ ‌మెంట్‌ ‌పరీక్షలకు యేళ్ళ తరబడి ప్రిపేర్‌ అవుతున్నారు. ఇతర త్రిపుల్‌ ఐ.‌టి. విద్యార్థులతో పోటీ పడటంలో వెనుకబడిపోతున్నారు.

బోధనా సిబ్బంది నియామకంపై నిర్లక్ష్యమెందుకు!?
క్యాంపస్‌ ‌లో 149 టీచింగ్‌ ‌పోస్టులకు గాను రెండేళ్ళ క్రితం కనీసం తాత్కాలిక సిబ్బందిగా కూడా పదిహేను మందిని నియమించలేదు. శాశ్వత సిబ్బందిని నియమించకుండా తాత్సారం చేయటం వెనుక పాలక వర్గం ప్రయోజనాలున్నాయని ఆరోపణ వుంది. ప్రస్తుతం ఎంత మంది బోధన బోధనేతర సిబ్బంది వున్నారో , ఎంత మందికి ,ఏ పద్దతిన జీతాలను చెల్లిస్తున్నారనే విషయంలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు వినవస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా విశ్వవిద్యాలయానికి రావాల్సిన వంద కోట్ల నిధుల స్థానంలో ముప్పయి లేదా ముప్పయైదు కోట్ల కన్నా ఎక్కువ మంజూరు కాలేదని తెలుస్తుంది.

గత సంవత్సరం నుండి డెబ్బయి ఐదు కోట్లకు మించి వస్తున్న నిధుల వినియోగం పై జవాబుదారి తనం లేదు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇచ్చే ఏడెనిమిది వేల వార్షిక నిధులకే స్టేట్‌ ఆడిట్‌ , ‌సెంట్రల్‌ ఆడిట్‌ అం‌టూ హంగామా చేసే ప్రభుత్వం బాసర ఐ.టి.కి ఇచ్చే కోట్లాది రూపాయల నిధుల వినియోగం పై ఆడిట్‌ ఎం‌దుకు చేయదో ఎవరికి అంతుబట్టని రహస్యం. విశ్వవిద్యాలయం లో అస్మదీయులకు అర్హతలు చాలకున్నా కూడా వారి స్థాయికి మించిన బోధనేతర బాధ్యతలు అప్పగించటం, రూల్స్ ‌గురించి మాట్లాడే వారికి వీలయినంత త్వరగా ఉద్వాసన చెప్పటం వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌వైఖరిగా తెలుస్తుంది. ప్రస్తుతం విద్యార్థుల పై అధిక పెత్తనానికి మించి పోలీసింగ్‌ ‌ఛలాయిస్తున్న స్పెషల్‌ ఆఫీసర్‌ ‌పోస్ట్ ‌లో వున్న మహిళ కు ఆ పదవి చేపట్టగలిగే అర్హతలపై సందేహాలు వ్యక్తమవుతున్నా
యి.
image.png
స్కాలర్‌ ‌షిప్‌ ‌ల మాయాజాలం- వసూళ్ళ పర్వం
మొదటి సంవత్సరంలో తీసుకోవల్సిన 1500 అడ్మిషన్లు కాగా వాస్తవంగా అడ్మిషన్ల సంఖ్య అంతకన్నా ఎక్కువనే వుంటున్నది. ప్రతి యేటా ఈడబ్ల్యూఎస్‌, ఈబీఎస్‌ ‌విద్యార్థులకు రావల్సిన స్కాలర్‌ ‌షిప్‌ ‌లో గత సంవత్సరం కొంత కోత పెట్టారు. వారినుండి పద్నాలుగు వేల రూపాయల చొప్పున కట్టించుకున్నాకనే పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. బి.సి. విద్యార్థుల కు మూడేళ్ళకొకసారి స్కాలర్‌ ‌షిప్‌ ‌మంజూరవుతున్నది. ఇంజనీరింగ్‌ ‌కోర్సు కోసం వేరే కళాశాలలకు వెళ్ళే విద్యార్థుల నుండి స్కాలర్‌ ‌షిప్‌ ‌మంజూరు కాలేదంటూ దాదాపు ఒక్కరి నుండి డెబ్బయి వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. యేటా నాలుగు వందల మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌ ‌కోసం కళాశాల విడిచి వెళ్ళటం సహజంగా జరుగుతున్నది. యేటా దాదాపు మూడుకోట్ల రూపాయల ఆదాయం కళాశాల విడిచి వెళ్ళే పిల్లల నుండి లభిస్తున్నది. ఖాళీ అవుతున్న నాలుగు వందల సీట్లను నింపకపోవటం పై పాలక వర్గం ఇష్టారాజ్యమే నడుస్తున్నది. వెళ్లిపోయిన విద్యార్థులకు సంబంధించి మూడేళ్ళ తర్వాత నైనామంజూరయ్యే స్కాలర్‌ ‌షిప్‌ ‌సొమ్ము ను ఏం చేస్తున్నారనేది తెలియాల్సిన అవసరముంది.

మెస్‌ ‌కాంట్రాక్టర్ల మార్పు చేయాలి.

దశాబ్ద కాలంగా మారని మెస్‌ ‌కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ ఇప్పటికీ అలాగే వుంది. టెండర్లు మారిన కూడా మారని కాంట్రాక్టర్లు క్యాంపస్‌ ‌లో అందిచ్చే అల్పాహారం ,భోజనం పై విద్యార్థులెవరూ సంతృప్తిగా లేరు. రెండేళ్ళ క్రితం అప్పటి మంత్రి కె.తారకరామారావు క్యాంపస్‌ ‌సందర్శించినప్పుడు విద్యార్థులకు మెస్‌ ‌కాంట్రాక్టర్ల మార్పుపై హామీ ఇచ్చినా మార్పు జరగ లేదు. ఇటీవల స్థానిక శాసన సభ్యులు మెస్‌ ‌ను హాస్టల్‌ ‌గదులనూ హడావుడిగా సందర్శించి మెస్‌ ‌నిర్వహకులపై కన్నెర్ర చేశారు. వసతిగృహాల నిర్వహణ తీరుపై, మౌలిక సౌకర్యాల పై తీవ్రంగా స్పందించారు. విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై తన ప్రత్యేక ఫోన్‌ ‌నెంబర్‌ ‌విద్యార్థులకు ఇచ్చి సహకారం కావల్సివచ్చినప్పుడు కాల్‌ ‌చేయమని తెలిపారు. కానీ ఆ ఫోన్‌ ‌నెంబర్‌ ‌కు కాల్‌ ‌చేస్తే ఏనాడూ స్పందించలేదని విద్యార్థుల ఆరోపణ.

నిత్య ఆత్మహత్యలను నివారించాలి..
గత దశాబ్ద కాలంగా విద్యార్థులతో బోధనా సిబ్బంది , పాలక వర్గం అధికారులు,సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరు వరుస ఆత్మహత్యలకు దారితీసింది. అటెండెన్స్ ‌తగ్గటం,వేర్వేరు కారణాలచేత పరీక్షలకు అనుమతి ఇవ్వకపోవటం ,అకారణంగా డిటెయిన్‌ ‌చేయటం వంటి పలు కారణాలతో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగాయి. తాజాగా పి.యు.సి. 2 విద్యార్థి అటెండెన్స్ ‌లేకపోవటంతో పరీక్షలు రాయలేకపోవటం. అవమానంగా తలచి గదిలో ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. పదిహేను , పదహారు సంవత్సరాల వయసుగల విద్యార్థులు తమ ఉద్వేగాలను అదుపులో పెట్టుకోలేని వయసులో వుంటారు. డిప్రెషన్‌ ‌కు గురైన వారికి తల్లిదండ్రులు , కుటుంబసభ్యులు అందుబాటులో వుండరు. వారికి కౌన్సిలింగ్‌ ‌చేసి ఆత్మహత్యలు నివారించాల్సిన బాధ్యతపై పాలక వర్గం మరింత శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులును విద్యావేత్తలు , విద్యా పరిరక్షణ కమిటీ వారిని క్యాంపస్‌ ‌లోకి అనుమతించకుండా పాలకవర్గం తీవ్ర ఆంక్షలం పెడుతున్నది.బాసర త్రిపుల్‌ ఐ.‌టి.నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా శ్రద్ధ తీసుకొని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు విద్యావేత్తల సహకారం తీసుకోవల్సి వుంది
– అజయ్‌ ‌బాబు.
ఉపాధ్యక్షులు.
తెలంగాణ ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page