పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 17: నమ్మకానికి ప్రతీక బిఆర్ఎస్ పార్టీ అని నయవంచనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం గుమ్మడిదల మండల పరిధిలోని కొత్తపల్లి, నల్లవల్లి, మంబాపూర్, రామిరెడ్డి బావి, వీరన్న గూడెం, మొల్లగూడెం, కానుకుంట అనంతారం గ్రామాలలో ఎమ్మెల్యే జిఎంఆర్ రోడ్ షో, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు బొంతపల్లిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ బిజెపి బీఎస్పీ పార్టీల నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జీఎంఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రతి గ్రామంలో తమ ఆత్మీయ నేతకు ఆయా గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి జీవితంలో వెలుగు రేఖలు నింపుతూ వారి ఆర్థిక అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. 11 సార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతికి అరాచకాలకు పెద్దపీఠ వేస్తూ అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచిందని విమర్శించారు. లక్ష రూపాయల నిధుల కోసం సంవత్సరాల పాటు కార్యాలయాలు చుట్టే దుర్భర పరిస్థితులు ఉండేవని అన్నారు. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామానికి ప్రతి నెల జనాభా ఆధారంగా నిధులు కేటాయిస్తూ ప్రజల ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా ప్రజల సమక్షంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గుమ్మడిదల మండలాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామం అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ సొంత నిధులతో మౌలిక సదుపాయాలతో పాటు గుడులు బడులు మసీదులు చర్చిల తో పాటు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ నక్కా మంజుల వెంకటేష్ గౌడ్, పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, సినీర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.