పదేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి ఆ పార్టీ స్వయంకృతమేనన్నది బలంగా వినిపిస్తున్నది. తాము చెప్పిందే తప్ప ఎదుటివారి మాటలు వినేదిలేదన్న రీతిలో పాలన సాగటమే ఇందుకు కారణంగా ప్రజలు విశ్లేషించు కుంటున్నారు. ఇది ఒక విథంగా తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో నాటి టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలిచారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు మొదలు ఏ ఎన్నికలు వొచ్చినా టిఆర్ఎస్ నుండి నిలబడిన అభ్యర్థిని గెలిపించుకున్నారు. అలాంటిది ఈ ఎన్నికల్లో ‘మార్పు కావాలన్న’ నినాదం తీసుకున్నారు. ఫలితంగా రాష్ట్ర (మాజీ)ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావునే ఒక ,చోట ఓడిరచారంటేనే ప్రజలు ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారన్న విషయం అర్థమవుతున్నది. కర్ణుడి చావుకు పలుకారణాలన్నట్లుగా బిఆర్ఎస్ తన ఓటమికి కారణాలను తానే సృష్టించుకుందన్నది స్పష్టమవుతున్నది. పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమం సాగిందే నిధులు, నీళ్ళు, నియామకాల నినాదం మీద… వీటిల్లో ప్రధానంగా తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో తమకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా లభిస్తాయని ఆశించారు. కాని వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఉమ్మడి అంధ్రప్రదేశ్లోలాగానే ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలను తెలంగాణ నిరుద్యోగులు పొందలేకపోవడం, వారి ఆగ్రహాన్ని వోట్లరూపంలో ప్రదర్శించారన్నది కాదనలేనిది.
ఉద్యోగాల కోసం బోర్డు పరీక్షలను నిర్వహించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర వైఫల్యానికి గురైంది. కనీసం నిర్వహణలోపాన్ని గ్రహించి అక్రమానికి పాల్పడినవారిపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం తమను ఇబ్బందులకు గురిచేసిందన్నది నిరుద్యోగుల్లో బలంగా నాటుకుపోయింది. విపక్షాలు దాన్నే తమ ఎన్నికల నినాదంగా తీసుకోవడం బిఆర్ఎస్కు చెప్పలేని నష్టాన్ని కలిగించింది. అలాగే సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లు ఇవ్వడం కూడా మరో తప్పిదంగా భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ల్లో చాలామంది అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న ఆ పార్టీ అధినాయకుడిగా కెసిఆర్ వాటిని పట్టించుకోకుండా వారికే తిరిగి అవకాశాన్ని ఇవ్వడాన్ని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఇముడ్చుకోలేక పోయారన్న వాదన కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వం తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల కాలంలో ఒకటవ తేదీన కాకుండా వారం, పదిరోజుల తర్వాత వేతనాలు చెల్లించడం, వారితోపాటు పెన్షనర్లకు కూడా విసుగు పుట్టించింది. రెవెన్యూ, పోలీసు శాఖలను నిర్వీర్యం చేశారన్న అపవాదను బిఆర్ఎస్ ప్రభుత్వం మూటకట్టుకుంది.
రెగ్యులర్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించకుండా రిటైర్డ్ అయిన ఇతర ప్రాంతాలవారిని పెద్ద పదవుల్లో కూర్చోబెట్టడం కూడా అసంతృప్తికి కారణంగా మారింది. డబుల్ బెడ్ రూమ్‌ల విషయంలో ప్రభుత్వం చెబుతున్నదానికి, వాస్తవానికి పొంతనలేదని, నిజంగా ఇండ్లులేని వారికన్నా తమ పార్టీ అనుమాయులకే వాటిని కేటాయించారన్న ఆరోపణలున్నాయి. ఏండ్ల తరబడి ఇండ్లు వొస్తాయని ఎదురుచూస్తున్న వారంతా నిరాశకు గురికావడం కూడా బిఆర్ఎస్కు వ్యతిరేక వోటుకు కారణమయిందంటున్నారు. ఇతర పథకాల విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. అన్నిటికి మించి కెసిఆర్‌ను కలవడం కష్టమని విస్తృత ప్రచారంలో ఉంది. మంత్రులకే ఆయన సమయం కేటాయించరన్నది రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్పేస్థాయిలో ప్రచారం జరిగింది. గత ముఖ్యమంత్రులు ప్రజలు తమ కష్టాలను చెప్పుకునేందుకు వ్యక్తిగతంగా కలుసుకోవడానికి కొంత సమయం కేటాయించేవారు.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పదేళ్ళలో అలాంటి అవకాశం సామాన్య ప్రజలకు కల్పించకపోవడం కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి గురైనారు. ఇది ఒక విధంగా కార్యకర్తలు, రెండస్థాయి నాయకుల్లో అసంతృప్తిని పెంచింది. ఉద్యమాన్ని ఉర్రూత లూగించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంత్రులెవరూ వెళ్ళలేని పరిస్థితి. విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శఉంది. అలాగే ఉద్యమకారులను, ఉద్యమంలో ప్రాణత్యాగం చేసినవారి కుటుంబాలను పట్టించుకోలేదని, ఆనాడు ప్రజలను ఉర్రూతలూగించిన పాటలు రాసిన కళాకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది కూడా బహుళ ప్రచారంలో ఉంది. సకలజనులను ఉద్యమం వైపు మళ్ళించేందుకు దోహదపడిన ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి మరికొందరని దూరంచేసుకోవడం, ప్రధానంగా ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచిన జర్నలిస్టులు గత పదేళ్ళుగా అడుగుతున్న ఇండ్ల స్థలాను కేటాయించడాన్ని వాయిదావేస్తూ రావడం లాంటి అనేకానేక విషయాలు బిఆర్ఎస్ను అధికారానికి దూరం చేయడానికి కారణంగా మారిందని విశ్లేషించుకుంటున్నారు.