బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 13: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ 17వ డివిజన్ హనుమాన్ నగర్, 4వ డివిజన్  వెంకటగిరి కాలనీలలో విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల వాసులు సబితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికి, తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాలనీ ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాలనీల సంక్షేమానికి కృషి చేసానని, నేను చేసిన అభివృద్ధిని చూసి పట్టం కట్టాలన్నారు. ఎల్లప్పుడూ మీ మధ్యలోనే ఉంటానని, అందరి ఆశీర్వాదాలు కావాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే రూ.400 కే వంట గ్యాస్ అందించనున్నట్లు తెలిపారు. రూ.2 వేలు ఉన్న ఆసరా పెన్షన్లు రూ.5 వేలు, రూ.4 వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ రూ.6 వేల వరకు పెంచబోతున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రతి నెల సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా రూ.3 వేలు అందిస్తామని, రైతు భీమా లాగా రాష్టంలోని 93 లక్షల తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి రూ.6 లక్షల భీమా సౌకర్యం కలిస్తామన్నారు. మహేశ్వరం నియోజకవర్గములోని బడంగ్ పేట్, మీర్ పేట్, తుక్కుగూడ, జల్ పల్లి జంట కార్పొరేషన్లు, జంట మునిసిపాలిటీలలో  రూ.832 కోట్ల రూపాయల భారీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. జంట  కార్పొరేషన్ల పరిధిలో ట్రంక్ లైన్లు, నాళాల నిర్మాణాలతో వరదనీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. రూ.110 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టిన నాలా నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. తాగునీటి సమస్య లేకుండా చేయటానికి రూ.280 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపట్టి, నూతన పైప్ లైన్లు, ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని బడంగ్ పేట్, మీర్ పేట్, జల్ పల్లి, తుక్కుగూడ పరిధిలో గల 11 చెరువులను రూ.40 కోట్లతో అభివృద్ధి చేసి, సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గం పరిధిలో 13 బస్తీ దవాఖానలు, 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవే కాకుండా మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కళాశాలతో పాటు పలు డిగ్రీ, జూనియర్ కళాశాలల ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాకుండా నిత్యం మీ మధ్య ఉంటూ.. నియోజకవర్గాని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఅర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page