ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 18 : బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి,స్థానిక ఎంఎల్ఎ అక్రమాలపై ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండిపడ్డారు.ప్రభుత్వం పై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ వారిని అక్రమంగా అరెస్ట్ లు చేయడం ఎంతవరకు సబబని నాయకులు మూకుమ్మడిగా ప్రశించారు.శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మీపతి గౌడ్,టీపిసిసి కార్యదర్శి,ప్రచార కమిటీ కార్యనిర్వహక సభ్యులు దండెం రాంరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా చేసిన మోసాలను,అన్యాయాలను,భూ కబ్జాలను,కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులను గురించి మీడియాకు తెలిపారు.
3 సంవత్సరాల క్రితం నియోజకవర్గ కేంద్రంలో మీటింగ్ పెట్టి అన్ని మండలాలు, మున్సిపాలిటీల అధ్యక్షులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు,ఎన్ఎస్యుఐ నాయకుల సమక్షంలో అందరం కలిసి తీర్మానం చేసి నియోజకవర్గంలో కావలసిన 13 ముఖ్యమైన అవసరాలను గుర్తించి ప్రభుత్వానికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.ఇప్పటి వరకు వాటిమీద ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు.ఇప్పుడు ఎన్నికల వేళ వచ్చి హడావిడి ఆర్భాటాలు చేస్తున్నారని, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.నియోజకవర్గంలో రైతులకు ఋణమాఫీ లేదని,దళిత బంధు ఉన్నవారి బంధు అయిందన్నారు.నియోజకవర్గం అభివృద్ధి చెందకపోగా,ప్రజల దగ్గర దౌర్జన్యంగా భూములు లాక్కొని విషం కక్కే ప్రాజెక్టులు తెచ్చి పెట్టడం జరుగుతుందని మండిపడ్డారు.ఐటీ కంపెనీలను తీసుకురాకుండా ఫార్మాసిటీ లాంటి కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలను తీసుకొచ్చి పరిసర ప్రాంతాలను కాలుష్య పరం చేయబోతున్నారని ఆయన ఆవేదన వ్యక్త పరిచారు.బండరావిర్యాలలో మైనింగ్ జోన్ తెచ్చారని,విటి వల్ల పెద్ద ఎత్తున కాలుష్యం ఏర్పడి పంట పొలాలు నాశనం అవ్వడం జరుగుతుంది అన్నారు.అలానే గృహ లక్ష్మి పథకం అన్నారు అది ఎవరికి అందడం లేదు,కొత్త రేషన్ కార్డులు,పింఛన్లు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక వారు ఎన్నిరోజులు దీక్షలు చేసిన కూడా వారిని పట్టించుకున్న నాథుడు లేడు అన్నారు.ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి భూ కబ్జాలు,వ్యాపారాల మీద ఉన్న దృష్టి నియోజకవర్గ అభివృద్ధి మీద లేదని మండిపడ్డారు.అభివృద్ధి ఏమైన ఉంది అంటే అది ఎమ్మెల్యే ఇంట్లోనే ఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, నియోజకవర్గంలోని అన్ని సమస్యలు తీరుస్తామని,అన్ని పథకాలు అమలులోకి తీసుకు వస్తామన్నారు.మా కాంగ్రెస్ శ్రేణులపై చేస్తున్న దాడులకు ధీటుగా బిఆర్ఎస్ పార్టీకి ఎంఎల్ఎ కిషన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు పండల రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ ముత్యమయ్య, కప్పటీ రఘు, ఐలేశ్, ఆలి భామ్, చెన్నయ్య, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ కుమ్మడి శ్రీనివాస్ రెడ్డి, యాచారం మాజీ ప్రెసిడెంట్ దిండి రవీందర్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ సేవాదళ్ చైర్మన్ కందుకూరి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి హతిరామ్, భువనగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి తీగరాజు నర్సింగ్, వార్డ్ మెంబర్ కాంటేకర్ రాహుల్, తాండ్ర నర్సింహా,మాజీ సేవాదళ్ చైర్మన్ రాంబాబు, ఉసిగారి మధు,మనీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.