- కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడోకు విశేష స్పందన
- ఏకమవుతున్న సీనియర్లు..కార్యకర్తల్లో జోష్
రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి ధృడ సంకల్పం తీసుకున్నారు. అందుకే అరవై రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించే పక్రియకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో చివరి నాటి వరకు అధికారంలో ఉన్న ఈ పార్టీ గత తొమ్మిదేళ్ళుగా రెండు రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరమైంది. ప్రజాభిష్టాన్ని మన్నించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయగలిగిందేగాని 2014, 2018ల్లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఓటములను చవిచూడాల్సి వొచ్చింది. ఆనాటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షానికే పరిమితమయింది. అయినప్పటికీ ఈసారైనా పార్టీని గట్టెక్కించాలన్న పట్టుదల రేవంత్‌రెడ్డిలో కనిపిస్తున్నా ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండీ పార్టీలో అంతర్గత కలహాలు ఆయన లక్ష్యానికి అవరోధంగా మారాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో నేటికీ ఆ పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉన్నప్పటికీ సంఘటితంగా పోరాటం చేయలేకపోవడం ఆ పార్టీ ఎదుగుదలకు పెద్ద మైనస్ పాయింట్ అయింది.
ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే దూసుకువస్తున్న బిజెపికన్నా కాంగ్రెస్‌కే స్థానబలం ఎక్కువగా ఉన్నా విభేదాల కారణంగా రాష్ట్రంలో ఆ పార్టీ మూడవ స్థానానికి చేరుకునే స్థితికి దిగజారింది. అయితే పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా మానిక్‌రావ్ థాక్రే వొచ్చిన తర్వాత కొంత వరకు ప్రశాంత• వాతావరణాన్ని తీసుకురాగలిగినట్లు కనిపిస్తున్నా రేవంత్‌రెడ్డి పాదయాత్ర విషయంలో కూడా సీనియర్లమాటే నెగ్గింది. ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్ర చేసుకునే విధంగా ఒప్పందం జరిగిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పాదయాత్రకు ఆటంకాలు తొలగిపోయాయి. డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వపరంగా లేదా పార్టీ పరంగా ఏ కార్యక్రమం ప్రారంభించినా చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రా రెడ్డి నియోజకవర్గం నుంచి ప్రారంభించినట్లుగానే, రేవంత్‌రెడ్డి సమ్మక్క ఆశీర్వాదంతో సీతక్క నియోజకవర్గం నుండి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సీతక్క తమ ఇంటి ఆడబిడ్డగా రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లుగానే ఆమె మంగళహారతులతో రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికింది.
అన్యాయాన్ని ఎదిరించడంలో తమ ప్రాణాలను కోల్పోయిన అడవి బిడ్డల సాక్షిగా తెలంగాణ సర్కార్‌పై రణానికి సమాయత్తమవుతున్న క్రమంలో సమ్మక్క-సారలమ్మల పూజారుల సంప్రదాయ ఆశీర్వచనాలు అందుకున్న రేవంత్‌రెడ్డి, కెసిఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా తాను వేస్తున్న ఈ తొలి అడుగు కెసిఆర్‌ను పాతాళానికి తొక్కుతుందంటూ శపథం చేసిన తీరు ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలు వేయించింది. పాదయాత్ర మొదటి రోజున్నే ఈ యాత్ర విజయవంతమవుతుందన్న సంకేతాన్నిచ్చింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రేతో పాటు మాజీ ఎంపీలు మల్లు రవి, మధుయాస్కీ, సిరిసిల్ల రాజయ్య, మాజీ కేంద్రమంత్రి బలరామ్‌నాయక్, షబ్బీర్ అలీ, అంజనీకుమార్ యాదవ్, బెల్లయ్యనాయక్, విజయ రమణారావు లాంటి సీనియర్లతో పాటు అశేష జనప్రవాహం ఆయన వెంట నడిచిన తీరు మళ్ళీ కాంగ్రెస్‌కు మహర్థశ పట్టనుందనిపించేదిగా ఉంది. ఈ యాత్రలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. పైకి కీచులాడుకున్నట్లు, ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నా వాస్తవంగా బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు ఒకే తాను ముక్కలంటూ తీవ్ర విమర్శ చేశారు. ఉప్పులో నిప్పులా ఉన్న గవర్నర్, కెసిఆర్ మధ్య కీచులాట అన్నది ఒట్టి అబద్ధమన్నారు.
అనేక విషయాల్లో కెసిఆర్‌ను వ్యతిరేకించిన గవర్నర్ స్వరంలో మార్పు రావడమే ఈ విషయాన్ని ఎత్తిచూపుతుందంటారాయన. బడ్జెట్ ప్రసంగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన అబద్ధాల ప్రసంగాన్ని గవర్నర్ యథావిధిగా చదవడం ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పకనే చెబుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసినా, తెలంగాణ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్నారు. విభజన హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐ కారిడార్, పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా లాంటి విషయాను విస్మరిస్తే, వాటిని తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పెట్టించుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. గత తొమ్మిదేళ్ళుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి బిజెపి, బిఆర్‌ఎస్ ఇద్దరూ దోషులేనంటారాయన. ఉద్యోగ, ఉపాధిని కల్పించడంలో విఫలమైన కేంద్రం, ప్రజా సంక్షేమాలను పక్కకు పెట్టి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌ను తయారుచేసిందన్నది స్పష్టం. దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రం భ్రష్ట్టుపట్టిస్తుంది. అందుకే ఈ పార్టీలను ఇంటికి పంపించేందుకే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలో తమ పార్టీ హాత్ సే హాత్ జోడో అంటూ ప్రజలకు వాస్తవాలను తెలియజేప్పే కార్యక్రమానికి స్వీకారం చుట్టామన్నారు. మేడారం నుండి రామప్ప మీదుగా రెండవరోజు కొనసాగుతున్న పాదయాత్రలో ప్రజలు అశేషంగా పాల్గొంటున్న తీరు కాంగ్రెస్‌కు పూర్వ వైభవం కలిగిస్తుందన్న నమ్మకాన్ని కలిగించేదిగా ఉంది.