- ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
- అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్ నేతల నివాళి
- ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : బీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికయ్యారు. శనివారం బీఆర్‌ఎస్ పీపీ నేత కేశవరావు అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ను ఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా..మాజీ మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆమోదించారు. శాసన సభా పక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్‌కు అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. కాగా…ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ , పద్మారావు హాజరుకాలేదు. తుంటి ఎముక విరిగి యశోదా దీవ్ణతీష్ట్రబీఓaనలో చికిత్స పొందుతున్న కేసీఆర్ వెంట కేటీఆర్ ఉండగా.. పద్మారావు దైవ దర్శనం నిమిత్తం వేరే రాష్ట్రానికి వెళ్లడంతో సమావేశానికి గైర్హాజరయ్యారు. బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు.
అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్ సభ్యుల నివాళి
గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం స్థూపం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు జోహార్లు.., జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం శాసన సభకు చేరుకుని బీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్నట్లు తీర్మానాన్ని స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి అందిచారు. తర్వాత సభకు హాజరై ప్రమాణం చేశారు.
ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా
ఎమ్మెల్సీ పదవులకు పలువురు బీఆర్‌ఎస్ నేతలు రాజీనామా చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీలుగా శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. వీరి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించారు. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరు ముగ్గురూ ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో వీరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లోపు ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇక ఖాలీ అయిన ఈ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది.