బిఎల్వోల ద్వారా ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలి

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర నవంబర్ 16: బిఎల్ఓల   ద్వారా ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులను అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ ప్రక్రియ, ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థుల వెచ్చిస్తున్న ఖర్చులు తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 4 నియోజకవర్గాల ఓటర్ జాబితాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపించడం జరిగిందన్నారు. 9,60, 376 మంది కి సంబంధించిన ఓటర్ స్లిప్పులను సిద్ధం చేసి బూత్ స్థాయి అధికారుల ద్వారా  ఓటర్ స్లిప్పుల పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్ స్లిప్పుల్లో ఓటర్ వివరాలతో పాటు పోలింగ్ కేంద్రం లోకేషన్, ఓటు వేసే విధానంపై సమాచారం పొందుపరచడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఓటర్ స్లిప్ తో పాటు ఓటర్ గైడ్, సి-విజిల్ కరపత్రాన్ని కూడా ప్రతి ఇంటికి అందజేస్తున్నామన్నారు. డబ్బు, మద్యం పంపిణీ లేదా కోడు ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లయితే ఫోటో తీసి సి-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని కలెక్టర్ తెలిపారు.  ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్లే క్రమంలో ఓటర్ స్లిప్ తో పాటు ప్రభుత్వంచే జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకొని వెళ్లే విధంగా  సూచించాలని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాలెట్ పత్రాలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.  ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తాము చేస్తున్న ఖర్చులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా పత్రికల్లో మూడుసార్లు తమపై నమోదైన కేసుల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఉచితంగా ఓటర్ జాబితాను ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు జాబితా ప్రింటింగ్ ఖర్చులను అందించి రిటర్నింగ్ అధికారుల వద్ద ఓటర్ జాబితాలను పొందవచ్చు అని కలెక్టర్ తెలిపారు. పిడబ్ల్యుడి, 80 సంవత్సరాల పైబడిన వృద్ధుల నుండి 150 మంది ఓటర్లు ఇంటినుండే ఓటర్ హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా నమోదు చేసుకోవడం జరిగిందని అదేవిధంగా 150 మంది వివిధ శాఖల పని చేసే ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ నిమిత్తం నమోదు చేసుకోవడం జరిగిందని దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో వికారాబాద్,  కొడంగల్  , పరిగి నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారులు రాహుల్ శర్మ , లింగ్యా నాయక్,  విజయ కుమారి, వివిధ విభాగాల నోడల్ అధికారులు కృష్ణన్, మల్లేశం, సుధారాణి, దీపా రెడ్డి, ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ నవీన్ చంద్ర, జడ్పి డిప్యూటీ సీఈవో సుభాషిని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page