- చారిత్రాత్మకం కాబోతున్న ఖమ్మం బిఆర్‌ఎస్ సభ
- సనానహక సమావేశంలో మంత్రి హరీష్ రావు
ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 14 : దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఉద్యమ పార్టీ నేడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని మంత్రి తెలిపారు. నేడు తెలంగాణ ఆచరించింది..రేపు దేశమంతా అనుసరిస్తుందన్నారు. మన మిషన్ భగీరథను కేంద్రం దేశమంతా విస్తరిస్తుందని తెలిపారు. మిషన్ కాకతీయను అమృత్ సరోవర్ పేరుతో అమలు చేస్తుందని చెప్పారు.
రైతుబంధును కేంద్రం పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తుందని గుర్తుచేశారు. గ్రామాలకు అవార్డులు ఇస్తే 10కి పది తెలంగాణకే వొచ్చాయన్నారు. మతతత్వ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు. మతతత్వ పార్టీలకు ఎవరైనా వోటు వేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీని సాగనంపితేనే ప్రభుత్వ రంగ సంస్థలకు మనుగడ ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో 18 లక్షల పోస్టులు ఖాళీలుంటే ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయడం లేదన్నారు. ఉద్యోగాలు ఇచ్చే భారత్ రాష్ట్ర సమితి కావాలా.. ఉద్యోగాలు తీసేసే బీజేపీ కావాలా అని హరీష్ రావు ప్రశ్నించారు