బీఆర్‌ఎస్‌ను బలహీనం చేస్తే బీజేపీ బలోపేతం!

ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్‌  వ్యూహాత్మక తప్పిదమే..

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తోందా? అంటే నిజమేననిపిస్తుంది. సొంతంగా మెజార్టీ ఉంది. అయినా బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. ఇల్లలకనే పండుగకాదు. ముందుంది మొసళ్ల పండుగ. బీఆర్‌ఎస్‌  నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను ఎందుకు ఫిరాయింపులకు ప్రోత్సహించాలి. దీని వల్ల సాధించేదేమీ ఉండదు. కాని రాజకీయంగా బలమైన శత్రువును కాంగ్రెస్‌  తయారు చేసుకుంటోంది. ఫిరాయింపుల వ్యవహారం ముగింపు సంతోషంగా ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది విషాదానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు. పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం వల్ల విపరీతమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. రాజకీయంగా చేదు ఫలితాలను చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బలను కాంగ్రెస్‌ ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు.

2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు విశేషమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు వల్లనే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం గండం గడిచింది. బీజేపీకి 240 సీట్లు రావడమంటే, తెలంగాణ సర్కార్‌కు ఉపశమనం కలిగినట్లయింది. అదే బీజేపీకి బంపర్‌ మెజార్టీ వచ్చివుంటే తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ను అస్థిరపరిచేందుకు అనేక ప్రయత్నాలు జరిగేవి. గత ఏడాది ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వొచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో ఆనందం ఏమీ ఉండేది కాదు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మంచి మెజార్టీ వస్తే తమను ఇంటికి సాగనంపుతుందని, రాజకీయ అస్టిరత్వం చోటు చేసుకుంటుందని కాంగ్రెస్‌  నేతలు ఆందోళనతో ఉండేవారు. కాని బీజేపీ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన మెజార్టీ రాలేదు. అది వరకు బీజేపీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టింది. అంతా మనమంచికే అన్నట్లుగా కేంద్రంలో బీజేపీ తగిన మెజార్టీ రాకపోవడం తెలంగాణలో కాంగ్రెస్‌  సర్కార్‌కు మంచిదైంది. గత ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం  చేసే విధంగా అనేక ప్రజా ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టింది. కాంగ్రెస్‌ ను  భూస్తాపితం చేయాలన్న లక్ష్యంతో అనేక అక్రమాలకు పాల్పడిరది.

ఒక వేళ బీజేపీకి తెలంగాణ సర్కార్‌ ను  అస్థిరత్వంలోకి నెట్టివేయాలన్న ఆలోచన వచ్చిందనుకోండి. బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఊరికే ఉంటారా. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నందు వల్ల బీజేపీ సైలెంటయింది. విపక్ష పార్టీ ప్రభుత్వాలను కూల్చాలన్న ఆలోచన నుంచి తప్పుకుందా అనిపిస్తోంది. చంద్రబాబు ఆశీర్వాదాలు రేవంత్‌కు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలినిందే. ఇది బహిరంగ రహస్యమే. భవిష్యత్తు సంగతి ఎలా ఉన్నా, ఇప్పట్లో చంద్రబాబు కేంద్రంలో ఎన్డీఏ  సర్కార్‌ తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ను భూస్తాపితం చేయాలనే ప్రయత్నం చేస్తే మౌనంగా ఉంటారా ? బీఆర్‌ఎన్‌ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేందుకు కాంగ్రెస్‌  ప్రోత్సహిస్తోంది. దీని వల్ల తమ బలం పెరిగి ప్రభుత్వం స్థిరంగా  ఉంటుందని కాంగ్రెస్‌ వాదులు భావిస్తున్నారు. బీజేపీ పన్నాగాలు ఫలించకుండా తమబలాన్ని పెంచుకుంటే బాగుంటుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. కాని ఇక్కడే కాంగ్రెస్‌ పెద్ద తప్పిదం చేస్తోంది.  దీని వల్ల కాంగ్రెస్‌ తీవ్రమైన నష్టాలను భవిష్యత్తులో ఎదుర్కొంటుంది. బలమైన బీఆర్‌ఎస్‌ బలహీనం కావడం వల్ల ఆ మేరకు రాజకీయ శూన్యత, స్పేస్‌ను ఆక్రమించుకునే శక్తి బీజేపీకి ఉంది. బీఆర్‌ఎస్‌ బలహీనపడే కొద్దీ బీజేపీ ఎదుగుతుంది. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో  ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తుంది. తామెటూ బలహీనపడుతున్నాం. కాంగ్రెస్‌ ను బలంగా ఎదుర్కొనేందుకు బీజేపీతో జత కట్టాలనే ఆలోచనలో బీఆర్‌ఎస్‌ ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా, వచ్చే నాలుగేళ్ల తర్వాత ఇదే జరుగుతుందేమో.

రోజు రోజుకూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురి కావడం వల్ల కాంగ్రెస్‌ లోకి   వెళుతున్నారు. బీజేపీతో చట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు బీఆర్‌ఎన్‌ నేతలు ఇప్పటికే మానసికంగా సిద్ధమవుతున్నారు. ఈ ప్రమాదాన్ని కాంగ్రెస్‌ గుర్తించాలి. ఇప్పటికే రాజ్యసభలో  బీజేపీతో అంటకాగేందుకు బీఆర్‌ఎన్‌ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఆ మేరకు సంకేతాలు కూడా ఇచ్చారంట. కాంగ్రెస్‌  చర్యల వల్ల బీఆర్‌ఎస్‌  బీజేపీకి దగ్గరవుతుంది. అనవసరంగా విపక్ష పార్టీలు బలపడే వ్యూహాలతో కాంగెస్‌ అడుగులు వేస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా, ఆ పార్టీని అప్పటీ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బతకనివ్వలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించేందుకు కేసీఆర్‌ అన్ని ఎత్తుగడలు అమలు చేశారు. చివరకు టీటీడీపీని కూడా కలిపేసుకున్నారు. కేసీఆర్‌ దుర్మార్గపు రాజకీయ వ్యూహాలకు బలైన పార్టీ కాంగ్రెస్‌. చివరకు అసెంబ్లీలో లెజిస్లేచర్‌ పార్టీ హోదాను కూడా కాంగ్రెస్‌ పార్టీ కోల్పోయింది. దీని వల్ల బీజేపీ బలం పుంజుకుంది. అది వరకు తెలంగాణలో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఈ రోజు బీఆర్‌ఎస్‌కు పట్టిన గతినే రేపు కాంగ్రెస్‌కు పట్టవొచ్చు. అదే దుష్ట సంస్కృతిని కాంగెస్‌ అమలు చేయడం ఎందుకు ? దీని వల్ల ఏతా వాతా బీజేపీ పటిష్టమవుతుంది. బీఆర్‌ఎస్‌ క్షీణించడం వల్ల ఉత్పన్నమయ్యే రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని బీజేపీ తాజాగా ఉవ్విళ్లూరుతోంది.
బీఆర్‌ఎస్‌  ఉనికి కోల్పోవడం వల్ల బీజేపీ పుంజుకుంటుం దన్న థియరీని గమనించండి. కాంగ్రెస్‌  పార్టీ బీజేపీ ట్రాప్‌లోకి వెళుతోంది. బీఆర్‌ఎస్‌ బలహీనపడితే వెంటనే బీజేపీ పటిష్టమవుతుంది. ఆ మేరకు తీవ్రమైన దుష్పలితాలను కాంగ్రెస్‌ రానున్న రోజుల్లో అనుభవించక తప్పుదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని పశ్చాత్తాపపడి  ప్రయోజనం ఉండదు.

తాత్కాలికంగా కాంగ్రెస్‌ కు  ప్రయోజనాలు కలగవొచ్చు. దీర్ఘకాలంలో బీజేపీకి లాభించవొచ్చును. బీఆర్‌ఎస్‌ ను బలహీనం చేస్తే కాంగ్రెస్‌ లాభపడదు. దీని వల్ల బీజేపీ శక్తి పెరుగుతుంది. ఈ చిన్న లాజిక్‌  కాంగ్రెస్‌ కు  అర్థమవుతుంది.
తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వోటు బ్యాంకు  పెరిగింది. ఎనిమిది సీట్లు వొచ్చాయి. అనూహ్యంగా బీజేపీ తెలంగాణలో బలం పుంజుకుంది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అనే సంకేతాలను కాంగ్రెస్‌  పార్టీ జనంలోకి పంపింది. బీఆర్‌ఎస్‌  పునాదిగా మాత్రమే బీజేపీ బలం పుంజుకోవాల్సి ఉంటుంది. అందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల నిజంగా లాభపడేది కాంగ్రెస్‌ కంటే బీజేపీ మాత్రమే అనే విషయాన్ని గ్రహించాలి. నిరంతరం బీఆర్‌ఎస్‌ ను బలహీనపరిచే చర్యల వల్ల కాంగ్రెస్‌కు చేకూరే లాభం ఏమీ ఉండదు. చిన్నాభిన్నమైన బీఆర్‌ఎస్‌ లోపాలను తమకు అనుకూలంగా వాడుకునేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికైనా తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ కళ్లు తెరిచి భవిష్యత్తులో కాంగ్రెస్‌ కు నష్టం చేకూర్చే చర్యలకు స్వస్తి చెప్పడం మంచిది. ఈ అసెంబ్లీ కాలపరిమితి ఉన్నంత వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వచ్చే లాభాలను కాంగ్రెస్‌ ఎంజాయ్‌ చేయవొచ్చు. కాని ఎన్నికల్లో మాత్రం తీవ్రపరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
-‘ప్రజాతంత్ర’ డెస్క్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page