హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 15 : భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు, సీనియర్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు.నేటి సామూహిక జాతీయ గీతాలాపన ఏర్పాట్లను పరిశిలించిన సిఎస్‌భారత స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకొని 16వ తేదీ, మంగళ వారం, నిర్వహించే భారత జాతీయ గీత సామూహిక ఆలాపన జరిగే పలు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేడు పరిశీలించారు. భారీ సంఖ్యలో హాజరయ్యే ప్రాంతాలైన అబిడ్స్ జీపీఓ సర్కిల్, నెక్లెస్ రోడ్ వాటర్ ఫ్రంట్ కూడలి తదితర ప్రాంతాల్లో నిర్వహించే జాతీయ గీతాలాపన ఏర్పాట్లను వివిధ శాఖల సీనియర్ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంతో పాటు, నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
నగరంలోని ప్రధాన కూడలి అబిడ్స్‌లో నెహ్రూ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం సామూహిక జాతీయ గీతాలపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక ప్రధాన కూడలిలో ఈ సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొంటారని సిఎస్ తెలిపారు. జీపీఓ సర్కిల్ వద్ద జరిగే కార్యక్రమాలు స్వాతంత్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించాలని, రంగురంగుల బ్యానర్లు, గీతాలాపన చేయడానికి మైక్ ఏర్పాట్లు చేయాలనీ ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులు పలు కళాశాలకు చెందిన విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ఏర్పాట్లను పరిశీయించిన వారిలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీపీ జితేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్, సిటీ పోలీసు కమీషనర్ సి వి ఆనంద్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.