భారత టూరిజం అభివృద్ధితో మాల్దీవులకు సమాధానం ఇవ్వలేమా!?

కొద్ది రోజుల క్రితం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో చేసిన పర్యటన సందర్భంగా లక్షద్వీప్‌ సహజ అందాలు, బీచ్‌లు పర్యాటకులకు స్వర్గధామం అంటూ స్కూబా డైవింగ్‌, బీచ్‌ల అందాలను ఆవిష్కరించే విధంగా కొన్ని ఆకర్షణీయ అద్భుత వీడియోలు, ఫోటోలను ఆన్‌లైన్‌లో ఫేర్‌ చేయడంతో పలువురు నెటిజెన్లు లక్షద్వీప్‌ను మల్దీవులతో పోల్చడం, మన దేశ అందాలను ఆస్వాదించే ఆన్‌లైన్‌లో ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ ‘‘సాహసం ఇష్టపడే వారు ఎవరైనా కచ్చితంగా లక్షద్వీప్‌ చూడాల్సిందే’’ అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్‌ హ్యాండిల్‌’లో రాస్తూ లక్షద్వీప్‌ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పోస్ట్‌ చేశారు. ఈ విషయాలకు మాల్దీవుల మతిలేని మంత్రి మరియం షివుమా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ మోదీని ‘జోకర్‌ లేదా విదూషకుడిగా, టెర్రరిస్ట్‌, ఇజ్రాయిల్‌ చేతిలో కీలుబొమ్మ లేదా తోలుబొమ్మ’గా పేర్కొంటూ ట్వీట్లు చేశారు.

అలాగే మాల్దీవుల మంత్రులు మజీద్‌?, మల్షా, ఎంపీ జహీద్‌? రమీజ్‌లు కూడా ఇవే రకమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ‘భారత్‌లో హోటల్‌ గదులు అసహ్యంగా ఉంటాయని, మా దేశంతో లక్షద్వీప్‌కు పోలికేంటి ?’ అంటూ నోరు పారేసుకున్నారు. మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్‌పై అలా నోరు జారడం దారుణం అంటూ సర్వత్రా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడడం చూసాం. ఈ అనుచిత వ్యాఖ్యలకు స్పందించిన భారత ప్రముఖులు, సీనీ ప్రముఖులు, ప్రముఖ క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, నెటిజెన్లు ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’ అంటూ ముక్తకంఠంతో పిలుపునివ్వడం, ప్లాన్‌ చేసుకున్న హాలీడే ట్రిప్పులను పలువురు రద్దు చేసుకోవడం లాంటివి కుక్క కాటుకు చెప్పు దెబ్బగా పని చేశాయి. దిద్దుబాటు చర్యలను చేపట్టిన మాల్దీవుల మయిజ్జూ ప్రభుత్వం ఈ వివాదస్పద ద్వేశపూరిత వ్యాఖ్యలు చేసిన మరియం షియునా, మల్షా, హసన్‌ జిహాన్‌ అనబడే ముగ్గురు నోరుజారిన మంత్రులను బర్తరఫ్‌/సస్పెండ్‌ చేసినప్పటికీ మాల్దీవుల పర్యాటకంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడడం ప్రారంభమైంది.

 చిట్టి ద్వీపాల సమాహార దేశంగా మాల్దీవులు
మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో మూడో వంతు పర్యాటక రంగం నుంచే వస్తున్నదని, గత ఏడాది మాల్దీవుల్లో పర్యటించిన విదేశీయుల్లో భారతీయులే అధికమని తెలుసుకోవాలి. హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న 1200 పగడపై దీవులతో మాలే రాజధాని అయిన మాల్దీవుల దేశంలో 5.2 లక్షల జనాభా మాత్రమే ఉన్నది. ఆహారం, మౌళిక సదుపాయాలు, నిర్మాణాలు, విద్య, వైద్యం టెక్నాలజీల కోసం పొరుగు దేశమైన భారత్‌ మీదనే ఆధారపడుతూ వస్తున్నది. 2022లో 2.41 లక్షల మంది, 2023లో 2 లక్షలకు పైగా భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి చిట్టి మాల్దీవుల ద్వీపాల సముదాయ సముద్ర తీరాల్లో వెయ్యికి పైగా రిసార్టులు నిర్మించడం జరిగింది. బీచ్‌ ప్రాంతాల్లో హోటల్స్‌, రిస్టారెంట్లు, వాటర్‌ స్పోర్ట్స్‌ సదుపాయాలు కల్పించడం కనీస బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి.

మాల్దీవు మంత్రుల వ్యాఖ్యలు మనకు మేలుకొలుపు కావాలి
ఇప్పటి వరకు ఇండియన్‌ బీచ్‌ అందాలను ఆస్వాదించడానికి కొంతైనా ఆసక్తి చూపని భారత సూపర్‌ స్టార్స్‌ నేడు అందమైన భారత బీచ్‌లను ఆస్వాదించడానికి పూనుకోవడం దేశ పర్యాటకానికి శుభ పరిణామంగా అర్థం చేసుకోవాలి. ‘చచఎక్స్‌ఫ్లోర్‌ ఇండియన్‌ ఐలాండ్స్‌’ అంటూ నినాదాలు మిన్నంటుతున్న వేళ దేశ పర్యాటకానికి ఊపిరులూదడం, దేశ ఆర్థికానికి ఊతం ఇచ్చే విధంగా మన ప్రభుత్వ పటిష్ట అడుగులు పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. 5,000 వేల ఏండ్ల నాగరికత, సంస్కృతి, వైవిధ్య కల్చర్‌ కలిగిన సువిశాల భారతంలో పోర్టుల నుంచి జీవ నదుల వరకు, దేవాలయాల నుంచి చర్చిల వరకు, అందమైన హరిత అడవుల నుంచి వన్యప్రాణ వరకు, పాకశాస్త్రం నుంచి హస్తకళల అద్భుతాల వరకు, అమాయక పల్లెల నుంచి ఆధునిక మెట్రొపాలిటన్‌ మహానగరాల వరకు, అమాయక గ్రామీణ గుడిసెల నుంచి పట్టణాల్లోని ప్యాలేస్‌ల వరకు అనంత వైవిధ్యభరిత అందాలు కొలువైన కోవెలగా భారతం పర్యాటకులకు అందాల విందులు చేసే అన్ని అర్హతలను కలిగి ఉన్నది. భారత్‌కు 7,000 కిమీ సముద్ర తీరం, 1,000కి పైగా పోర్టులు ఉండడం మన ప్రత్యేకత. భారత్‌లో ఆంగ్లభాష మాట్లాడే ప్రజలు అనేకం కనిపించడంతో పాటు పర్యాటకులతో స్నేహపూరితంగా మసలుకునే స్వభావం మన రక్తంలోనే ప్రవహిస్తున్నది. ప్రతి ఏట విదేశాలకు 20 మిలియన్ల భారతీయ పర్యాటకులు వెళుతుండగా, మన దేశానికి 7 మిలియన్ల విదేశీ పర్యాటకుల మాత్రమే రావడం జరుగుతోంది. నేడు వందకు పైగా రైల్వే స్టేషన్లు, అనేక అత్యాధునిక ఎయిర్‌ పోర్టులు, సూపర్‌ హైవేలు అందుబాటులోకి వచ్చినప్పటికీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి మన విలక్షణ వైవిధ్యాలను పరిచయం చేయడానికి మరెంతో చేయాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పర్యాటకానికి ప్రాధాన్యమివ్వని భారతం
నేడు ప్రపంచ దేశాల్లో పర్యాటకులను ఆకర్షించే ఉత్తమ దేశాల ‘‘ట్రావెల్‌ అండ్‌ టూరిజం డెవెలప్‌మెంట్‌ ఇండెక్స్‌’’ జాబితాలో భారత్‌కు 54వ స్థానం లభించడం విచారకరం. భారత కేంద్ర ప్రభుత్వంలోని పర్యాటక మంత్రిత్వశాఖకు సాలీనా రూ: 2,400 కోట్లు బడ్జెట్‌ మాత్రమే కేటాయించడం మన ప్రాధాన్యాలను స్పష్టం చేస్తున్నది. యూపీ, పంజాబ్‌, తెలంగాణ, ఎంపీ, ఢల్లీి రాష్ట్రాల ప్రచార ఖర్చు కూడా మన భారత పర్యాటక మంత్రిత్వ శాఖకు కేటాయించిన సొమ్ము కంటే అధికంగా ఉండడం సోచనీయం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ అనే నినాదంతో తన పర్యాటకాన్ని ప్రచారం చేసుకుంటున్నది. గుజరాత్‌ కూడా అమితాబచ్చన్‌ను పర్యాటక ప్రచారానికి వినియోగించుకోవడం కూడా సత్ఫలితాలను ఇస్తున్నది. అస్సోం, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు సినీ దిగ్గజాలైన అక్షయ్‌ కుమార్‌, ప్రియాంక చోప్రా, కంగనా రానౌట్‌లను వాడుకోవడం చూసాం. పరిస్థితులను అర్థం చేసుకున్న మన ప్రధాని మోదీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ తానే ప్రధాన ఆకర్షణగా మన పర్యాటకానికి ప్రచారం చేయడం ముదావహం. మన హిల్‌ స్టేషన్లను అర్బన్‌ స్లమ్‌ సెంటర్స్‌గా మార్చడం, పర్యాటక కేంద్రాల్లో రెస్టార్డెంట్లు నెలకొల్పడానికి 40కి పైగా ప్రభుత్వ అనుమతులు అవసరం కావడం, రైలు/రోడ్డు/విమానయాన రవాణా సౌకర్యాలు కొరవడడం, అనారోగ్యాల నెలవులుగా పబ్లిక్‌ యుటిలిటీస్‌ ఉండడం, పరిసరాల అపరిశుభ్రతలు ఆహ్వానం పలకడం లాంటి సమస్యల వలయంలో మన దేశ పర్యాటకం విలవిల్లాడుతున్నది.

విదేశీ పర్యాటక రంగాలు మనకు స్పూర్తి కావాలి
సౌథీ అరేబియా, ఇండోనేషియా, ఓమన్‌, యూఏఈ లాంటి దేశాలు విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక సృజనశీల ప్రచారాలు చేయడం మనకు గుణపాఠం కావాలి. దుబాయ్‌, హాంకాంగ్‌, సింగపూర్‌, ఇస్తాంబుల్‌, అబుదాబి, కువైట్‌, ఓమన్‌, ఖతార్‌ లాంటి ప్రాంతాలకు భారత పర్యాటకుల క్యూ కట్టడం అనాదిగా జరుగుతోంది. ఇలాంటి దేశాలను స్ఫూర్తిగా తీసుకొని భారత దేశం తన పర్యాటక రంగానికి సత్వరమే మెరుగులు దిద్దాల్సి ఉంది. పర్యాటక పరిశ్రమతో దేశ ఆర్థికం కూడా ముడిపడి ఉందని మరిచిపోరాదు. ప్రపంచానికి యోగా, వ్యాక్సీన్స్‌, మిలిటరీ పవర్‌ లాంటివి ఎన్నో పరిచయం చేసిన భారతం నేడు అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా మారాలని ఆశిద్దాం.

‘భిన్నత్వంలో ఏకత్వం’ సాధించిన భారతంలో అపారమైన వైవిధ్యభరిత, ఆకర్షణీయ అందాల విందులు, బహువిధాల జీవనశైలిలు, సహజ అందాలు ఆరేసిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. మన సహజ వనరులు, చారిత్రక కట్టడాలు, కొండకోనలు, డిజిటల్‌ వెలుగులు, మహానగరాల మహాద్భుత ఆకర్షణలు లాంటివి అనేకం విదేశీ పర్యాటకాలకు వీనుల విందులు, కళ్లకు పసందులు చేయాలని కోరుకుందాం. భవ్య భారత పర్యాటక క్షేత్రాలకు అవసర మెరుగుదిద్ది ప్రపంచ పర్యాటకుల స్వర్గధామంగా భారతాన్ని తీర్చిదిద్దుదాం. భారత్‌ అనాదిగా నమ్మిన ‘అతిథి దేవోభవా(ది గెస్ట్‌ ఈజ్‌ గాడ్‌)’ అనే నినాదాన్ని మన పర్యాటకాభివృద్ధికి వినియోగించుకుంటూ మన దేశ విలక్షణతలను విదేశీయులకు పరిచయం చేద్దాం.

డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి
 కరీంనగర్‌, 9949700037  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page