బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి
సత్యవతి వ్యాసునికి అసలు విషయం చెప్పింది. సర్వధర్మ విదుడైన వ్యాసుని దేవర న్యాయాను సారం వంశాన్ని నిలబెట్టమంది. తల్లి మాటకు తలవంచాడు వ్యాసుడు. అంబికను పిలిచి సత్యవతి కురువంశం అంతరించకుండా వ్యాసుని వలన కుమారుని కనవల్సిందిగా చెప్పి శయ్యగృహానికి పంపింది. నాటి రాత్రి అంబిక మునివేషంలో ఉన్న వ్యాసుని చూసి భయంతో ••న్నులు మూసుకుంది. వ్యాసుడు ఆమెతో కలిసాడు. మరునాడు తల్లితో ఇలా చెప్పాడు. ‘అంబిక యందు బల పరాక్రమశాలియైన కొడుకు పుడతాడు. కానీ అంబిక సమాగమ కాలంలో భయంతో కనులు మూసుకుంది. కావున, ఆమెకు కలుగబోయే పుత్రుడు అంధుడై ఉంటాడు’ అన్నాడు.
అందుకు సత్యవతి కురురాజ్యానికి గుడ్డివాడు రాజు కావడానికి వీలులేదు అంటూ అంబాలికను అనుగ్రహించమంది. వ్యాసుడు అంగీకరించి అంబాలిక శయన మందిరానికి వెళ్ళాడు. ఆమె కూడా భయంతో వ్యాసుని కలిసింది. మరునాడు తల్లి అడిగితే, అంబాలికకు బలపరాక్రశాలి, వంశకర్త యగు కుమారుడు కలుగుతాడు. కానీ సమాగమకాలంలో అంబాలి••వున్న పరిస్థితినిబట్టి పాండురోగము కలవాడైపుడతాడని చెప్పాడు. సత్యవతి వ్యాసుని ఎటువంటి అవలక్షణాలు లేని పుత్రుని ప్రసాదించమంది. వ్యాసుడు అంగీకరించగా, అంబికను పిలిచి తగు సలహాలనిచ్చి దేవర న్యాయమునకు నియమించింది. అంబిక అత్తగారి మాటకు ఎదురు చెప్పలేక, వ్యాసుడి మునివేషానికి ఎవగించుకుని అంతఃపురానికి తన దాసిని అలంకరించి పంపించింది. ఆ దాసి మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవించి, సంతుష్టుని చేసి, ఆనందంగా శయనించింది.
మరునాడు ‘వ్యాసుడు తల్లితో జరిగిన విషయం చెప్పాడు. శాపగ్రస్తుడైన యమధర్మరాజును ఆమె గర్భంలో నిక్షేపించానన్నాడు. ఆమెకు పుట్టినవాడు ధర్మపరుడూ, లోభ, క్రోధ రహితుడు, మహావిద్వాంసుడూ, అయి వంశాభివృద్ధికి పాటుపడతాడని చెప్పి వెళ్ళిపోయాడు. అంబిక కొడుకు ధృతరాష్ట్రుడు, అంబాలిక పుత్రుడు పాండురాజు. దాసికి జన్మించినవాడు విదురుడు. ధృతరాష్ట్రుడూ, పాండురాజూ విదురుని తమ్ముడిగానెంచి ఆదరిస్తూవున్నారు. గాంగేయుడు వారు ముగ్గురికీ విద్యాబుద్ధులు నేర్పించాడు. పాండురాజు విలువిద్యలో అసమానఖ్యాతి గడించాడు. ధృతరాష్ట్రుడు తన దేహబలంతో అసదృశుడయ్యాడు. విదురుడు ధర్మవిషయవిదుడూ, ఆత్మజ్ఞానీ అయ్యాడు. అంధుడైన కారణంగా ధృతరాష్ట్రుడు రాజుకాలేకపోయాడు. పాండు రాజును చక్రవర్తిని గావించారు. ధృతరాష్ట్రుడూ, పాండురాజూ యవ్వనులైనారు.
(తరువాయి..వొచ్చే సంచికలో)