బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి
శంతనునకు సత్యవతియందు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. వారు యుక్త వయస్కులు కాకుండానే శంతనుడు మరణించారు. సత్యవతి చెప్పిన విధంగా చిత్రాంగదుని రాజును చేసి, భీష్ముడు తానే రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. చిత్రాంగదుడు పెద్దవాడయ్యాడు. ఆ రోజుల్లో చిత్రాంగదుడనే గంధర్వుడు కూడా ఉండేవాడు. అతడు ఒక రోజున వచ్చి నువ్వుకూడా నా పేరే పెట్టుకున్నావు గావున నాతో యుద్ధంచేసి గెలుపొందిన సరే లేదా నీ పేరు మార్చుకున్నా సరే అన్నాడు. చిత్రాంగదుడు గాంధర్వుడిని యుద్ధానికి పిలిచాడు. ఆ యుద్ధంలో చిత్రాంగదుడు మరణించాడు. భీష్ముడు విచిత్ర వీర్యుని సింహాసం మీద కూర్చుండబెట్టాడు. విచిత్రవీర్యుడు పెద్దవాడయ్యాడు. భీష్ముడు అతనికి వివాహం చేయాలని అనుకున్నాడు. అదే సమయంలో కాశీరాజు తన పుత్రికలకు వివాహం చేయాలని సంకల్పించి స్వయంవరాన్ని ప్రకటించాడు.
భీష్ముడు తల్లి సత్యవతీదేవితో సంప్రదించి కాశీనగరానికి వెళ్ళి స్వయంవరంలో అందరనీ జయించి, కాశీరాజు ముగ్గురు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను తన రధంమీద ఎక్కించుకుని, తన తమ్ముడైన విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చేయబోతున్నట్లుగా చెప్పాడు. భీష్ముని సాల్వుడనే రాజు ఎదిరించిఓడిపోయాడు. హస్తినాపురము చేరి ముగ్గురు రాజపుత్రికలనూ విచిత్రవీర్యునిచ్చి వివాహం చేయబోగా ఆ ముగ్గురు లో పెద్దదైన అంబ తాను సాల్వరాజును వరించానంది. భీష్ముడు ధర్మవేత్తలను సంప్రదించి, వారి సలహా మేరకు అంబను సాల్వరాజు వద్దకు సగౌరవంగా పంపాడు. అంబిక, అంబాలికలను విచిత్ర వీర్యునకిచ్చి వివాహం గావించాడు. విచిత్ర వీర్యుడు మితిమీరిన కామంతో ఏడు సంవత్సరాల పాటు అంతఃపురం వీడకుండా భార్యలతో గడిపాడు. అతనికి క్షయవ్యాధి వచ్చింది. తుదకు మరణించగా భీష్ముడే సోదరునికి దహన సంస్కారాలు జరిపి, తల్లినీ, అంబ, అంబాలికలను ఊరడించాడు. రాజ్యభారాన్ని తనే వహిస్తూవచ్చాడు. సత్యవతి హృదయం పుత్రశోకంతో నిండిపోయింది.
కొన్నాళ్లకు సత్యవతి తేరుకుంది. ఒకనాడు భీష్మునితో ‘గాంగేయా! మన వంశ ప్రతిష్టలు మీచేతుల్లో ఉన్నాయి. అందువలన నీవు రాజువై, నిండు యవ్వనంలో ఉన్న విచిత్ర వీర్యుని భార్యలను దేవరన్యాయం ప్రకారం స్వీకరించి సంతానం పొంది వంశాన్ని ఉద్దరించు అని.. గాంగేయుడు తన ప్రతిజ్ఞకు భంగం కలిగించనన్నాడు. ఏ ప్రలోభంతోనూ తాను రాజ్యాన్నిగానీ, స్త్రీని గానీ వాంచించనన్నాడు. సత్యవతి ఇలా అంది ‘నాయనా నేను పరాశరుని అనుగ్రహంతో కన్యాత్వం చెడకుండా వ్యాసుని కన్నాను. ఇప్పుడు వ్యాసుని రప్పించి ఈ ధర్మకార్యం జరిపిద్దాం’ అంది. భీష్ముడు తన అంగీకారాన్ని తెలిపాడు. సత్యవతి వ్యాసుని స్మరించగానే అతడు వచ్చి నిలిచాడు.