భూమి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

(ప్రజాతంత్ర, ప్రత్యేకప్రతినిధి )  భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు. కాని, తెలంగాణ రాజకీయాలు మాత్రం ప్రధానంగా భూమిచుట్టూరా తిరుగుతున్నాయి.  వాస్తవంగా ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య నాలుగు అంశాలు నలుగుతున్నాయి. అందులో అందరి నోళ్ళలో ఎక్కువగా నానుతున్నది మాత్రం  ధరణి పోర్టల్‌ వ్యవహారం. ఆ తర్వాత క్రమంలో విద్యుత్‌, బిసీ, ఎస్సీ వర్గాలకు సంబంధించిన హామీలు. ఎన్నికల రంగంలో ప్రధాన పార్టీలకు ఇవే ప్రధాన ఆయుధాలుగా మారాయి.  తెలంగాణ ప్రభుత్వం ఎంతో శ్రమించి,  మేధోమథనం చేసి మూడేళ్ళ కింద ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు చెప్పుతున్నది. రైతులకు ఇది ఎంత ఉపయోగకారన్న విషయాన్ని చెప్పి వోట్లను రాబట్టుకోవాలనుకుంటున్నది బిఆర్‌ఎస్‌. అయితే ధరణితో విసిగిపోయిన వారిని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్‌, బిజెపిలు ప్రయత్నిస్తున్నాయి. అందుకు ప్రత్యమ్నాయ పోర్టల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎన్నికల హామీల్లో భాగంగా  ఆ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ధరణి ప్రత్యమ్నాయంగా కాంగ్రెస్‌ ‘భూ మాత’ను, బిజెపి ‘మీ భూమి’పేర మరో కొత్త పోర్టర్‌లను తీసుకురానున్నట్లు తెలిపాయి. ఈ రెండు పార్టీలు కూడా తాము రూపొందించే పోర్టర్లు  ఇప్పుడు ధరణిలో ఎదురవుతున్న సమస్యలన్నిటినీ తీర్చేదిగా ఉంటాయంటున్నాయి. ధరణి రాకముందు తమ భూ రికార్డుల విషయంలో రైతులు లేదా భూస్వాములు అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్న మాట వాస్తవమే.

తన రికార్డులో ఏదైనా చిన్న ఇబ్బంది ఎదురవుతే గతంలో పట్వారీ నేడు విఆర్‌ఓ స్థాయినుండి ఆఖరికి  మంత్రిస్థాయి వరకు అంచలంచలుగా పైరవీ చేసుకోవాల్సిన పరిస్తితి ఉండిరది.  రైతు తన అవసరం నిమిత్తం పని జరిగేందుకు వివిధ స్థాయిల్లో  డబ్బు సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఈ సమస్యను అధిగమించి రైతును రక్షించేందుకే  ధరణి పోర్టల్‌ను సృష్టించినట్లు బిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. అయితే ఇందులో కొన్ని లోపాలు ఉన్న విషయాన్ని వారు కాదనలేక పోతున్నారు. వాటిని సవరించేందుకు తీవ్ర జాప్యం జరుగుతున్నది. ధరణి వెబ్‌సైట్‌లో చూసుకుంటే తమ భూమి కనిపించడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములు కూడా రికార్డులోకి ఎక్కలేదని, ఇది కావాలని బిఆర్‌ఎస్‌ సర్కార్‌ చేస్తున్న మోసమని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కొన్ని పట్టా భూములుకూడా నిషేధిత జాబితాలో చేరాయని, భూ యజమానుల పేర్లలో మార్పు జరిగిందని, కొన్ని సర్వే నంబర్లు  కనిపించకపోగా, సర్వే నంబర్ల  వారీగా ఉండాల్సిన ఎకరాల్లో తప్పులున్నాయని ఇలా పలురకాల ఆరోపణలున్నాయి. అయితే ఈ వాస్తవాన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. దాని సవరణపై సూచనలు చేసేందికు మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. అనుభవంలో వొస్తున్న ఒక్కో అంశాన్ని దిద్దుబాటు చేస్తున్నది.

కాని, ధరణి వందకు వందశాతం తప్పులు లేకుండా ఉందని నేటికీ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పలేక పోతున్నది. అయితే ధరణిలో తప్పులు లేకుండా రికార్డు అయిన వారి భూమికి మాత్రం ధోకాలేదని చెబుతున్నది. గతంలో విఆర్‌ఓలు, తహసిల్‌దారులు, సంబంధిత రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. లంచాలు మరిగిన అధికారులు రికార్డులను ఏమాత్రం టాంపర్‌ చేసే అవకాశంలేదు.  రైతు తన భూమి విషయంలో గుండెమీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చని ప్రతీ ఎన్నికల సభలో  ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెబుతున్నాడు. భూ యజమాని బొటన వేలుముద్ర లేనిదే ఎవరూ రికార్డులను తాకలేరని చెప్పడం ఒక విధంగా రైతాంగానికి పెద్ద భరోసాలాంటిదే.   అంతేకాదు, ధరణితో భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ గతంలో లాగా నెలల తరబడి కాకుండా నిమిషాల్లో పూర్తి అవుతున్న మాట వాస్తవం. కాని,  విపక్షాలు మాత్రం అందులోని లోటుపాట్లను తమ  ఎన్నికల అస్త్రాలుగా  వాడుకుంటు న్నాయి. తాము అధికారంలోకి  రాగానే ధరణిని బంగాళఖాతంలో వేస్తామంటున్నాయి.

రైతులందరికీ న్యాయం జరిగేలా తాము అధికారంలోకి వొస్తే ధరణి స్థానంలో భూ మాతను తీసుకొసా ్తమంటోంది. అంతేగాక భూములపై సర్వే చేయించి రైతులకు భూ ధార్‌ కార్డును అందజేస్తామని హామీ ఇస్తున్నది. ముఖ్యంగా కోనేరు రంగారావు ల్యాండ్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని చెబుతోంది.  ప్రభుత్వ భూములకు రక్షణగా ల్యాండ్‌ కమిషన్‌  ఏర్పాటు చేస్తామని, ప్రజల భూ హక్కులను కాపాడేందుకు సమగ్ర రెవెన్యూ ట్రిబునల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ  ప్రకటించింది. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పేదలకు పంచిన 25 లక్షల ఎకరాల భూములపై ఆ పేదలకే పూర్తి స్థాయి భూ హక్కులను కల్పిస్తామంటోంది.  బిజెపి కూడా ధరణి స్థానంలో పారదర్శకంగా ఉండే విధంగా ‘మీ భూమి’ పోర్టల్‌ను ప్రవేశపెడతా మంటున్నది. అయితే ధరణికన్నా ఆ పార్టీ  బిసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న విషయంలోనే ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నది. కాగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఎస్సీ వర్గీకరణ సభకు ముఖ్యఅతిధిగా ప్రధాని మోదీ రావడంతో ఆ సామాజికి వోట్లు  తమకే పడుతాయన్న గట్టి నమ్మకంలో  బిజెపి ఉంది. బిఎస్పీ కూడా ధరణిని ఎత్తివేస్తామంటున్నది. మొత్తంమీద భూమి చుట్టూనే  తెలంగాణలో ప్రస్తుత ఎన్నికల రాజకీయాలు నడుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page