ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : భౌగోళిక వైవిధ్యాన్ని సంరక్షించి భూమిని కాపాడాలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్, జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ సహకారంతో సికింద్రాబాద్ మౌలా అలీ పహాడ్లో అంతర్జాతీయ జియో డైవర్సిటీ డే 2023 సందర్భంగా ‘జియో డైవర్సిటీ ప్రతి ఒక్కరి కోసం’ అనే థీమ్ పై ‘జియో హెరిటేజ్ వాక్’ను, ‘జియొ హెరిటేజ్ పై టాక్’ను వేదకుమార్ అధ్యక్షత నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిఎస్ఐ డైరెక్టర్(రిటైర్డ్) కమతం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో విలక్షణమైన శిలలు, భౌగోళిక ప్రదేశాలు మొదలైన అనేక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు ఉన్నాయన్నారు. వీటిని పరిరక్షించడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు ముందుకు రావాలని కోరారు. ప్రొఫెసర్ వేదకుమార్ మాట్లాడుతూ డెక్కన్ హెరిటేజ్ అకాడమీతో పాటు ఇతర ఎన్జీవోలు కూడా ఈ స్థలాలను డాక్యుమెంట్ చేయడం, జాబితా చేయడం ద్వారా ఈ స్థలాలను సంరక్షించడానికి ప్రభుత్వానికి సమర్పించాలని యోచిస్తోందని తెలిపారు. వాటిని పరిరక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా భౌగోళిక వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతపై జిఎస్ఐ డైరెక్టర్ జనరల్ చక్కిలం వేణుగోపాల్ రావు రూపొందించిన ఆడియో సందేశాన్ని సభికులకు అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురావస్తు, మ్యూజియంల శాఖ మాజీ సంచాలకులు ప్రొఫెసర్ కెపి.రావు మాట్లాడుతూ మౌలాలి పహాడ్ లాంటి చారిత్రాత్మక ప్రదేశం గురించి మరింత తెలుసుకోవడానికి మిగిలిన ప్రాంతాన్ని తవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మౌలాలి పహాడ్, కుతుబ్షాహీ కాలానికి చెందినదని కొత్త తెలంగాణ చరిత్ర కన్వీనర్, చరిత్రకారుడు రామోజు హరగోపాల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి, సేవ్ రెయిన్ వాటర్, ఎఫ్.బిహెచ్ సభ్యులు నరహరి, సత్యప్రసన, రామ్ రాజ్, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్, డెక్కన్ హెరిటేజ్ ట్రస్ట్ డైరెక్టర్ కట్టా ప్రభాకర్, ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.