మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదికను అమలు చేయడంలో ‘ ములాయం’ కీలక పాత్ర..!

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ ‌కొంతకాలంగా అనారోగ్యంతో హర్యానా, గురు గావ్‌ ‌లోని మేదాంతా హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో ప్రతి మలుపును నిశితంగా పరిశీలించిన కురువృద్దుడి మరణంతో ఉత్తరప్రదేశ్‌ ‌సహా దేశంలో ఉన్న బహుజనులంతా శోకసంద్రంలో మునిగి పోయారు.. ఆయన మరణం పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేసారు.

సోషలిస్టు నాయకుడు డాక్టర్‌ ‌రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా సిద్ధాంతాలకు ఆకర్షితుడైన ములాయం చిన్న వయసులోనే రాజకీయాల వైపు ఆసక్తి కనబరిచారు. మూలాయం ఆరు దశాబ్దాల క్రితం సాధారణ కార్యకర్తగా రాజకీయ అరంగ్రేటం చేసారు. 1967 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా యుపి అసెంబ్లీలో అడుగు పెట్టారు.1975లో ఇందిరాగాంధీ ఏమర్జెన్సీ విధించినప్పుడు 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి, తన పోరాట పటిమతో తిరుగులేని నాయకుడుగా ఎదిగినారు. ఆయన జీవిత కాలంలో పది సార్లు శాసనసభ్యుడుగా, ఏడు సార్లు ఎం.పీ గా గెలుపొందారు. అంచెలంచెలుగా ఎదిగిన ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ‌మొదటిసారిగా 1989లో ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి అయ్యారు.1990 నవంబరులో విపి సింగ్‌ ‌జాతీయ ప్రభుత్వం కూలిపోయిన తరువాత.. ములాయం, చంద్రశేఖర్‌ ‌నాయకత్వంలోని జనతా దళ్‌ ‌పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ ‌మద్దతుతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.

జాతీయ స్థాయిలో చంద్ర శేఖర్‌ ‌ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న కాంగ్రెస్‌.. 1991 ఏ‌ప్రిల్‌లో మలాయంసింగ్‌ ‌ప్రభుత్వానికి కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంది. దాంతో యాదవ్‌ ‌ప్రభుత్వం పడిపోయింది. 2002లో, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల అనంతర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో,భారతీయ జనతా పార్టీ మరియు బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీలు దళిత నాయకురాలు మాయావతి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేతులు కల్పింది, ఆ రాష్ట్రంలో యాదవ్‌కు గొప్ప రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించబడ్డారు. అనతికాలంలోనే 25 ఆగస్ట్ 2003‌న బీజేపీ ప్రభుత్వం నుండి వైదొలిగింది. ములాయం సింగ్‌ ‌మూడవసారి సెప్టెంబరు 2003లో ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మెయిన్‌ ‌పురి ఎం.పి గా పదవిలో కొనసాగుతున్నారు.

ములాయం సింగ్‌ ‌యాదవ్‌ 1939 ‌నవంబర్‌ 22‌వతేదీన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫాయ్‌ ‌గ్రామంలో మూర్తి దేవి, సుగర్‌ ‌సింగ్‌ ‌యాదవ్‌ ‌దంపతులకు జన్మించారు.ములాయం మొదట రెజ్లర్‌ ‌గా తన ప్రతిభ కనబర్చారు. కేంద్ర రక్షణ మంత్రిగా కూడా సేవలందించారు.అపారమైన రాజకీయ అనుభవం ఉంది.

దేశంలో మతతత్వ శక్తులు బలపడితే లౌకికవాదం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి పెను ప్రమాదమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు.కుల, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ సమానత్వమే ఎజెండాగా సోషలిస్టు భావజాలాన్ని కింది స్థాయికి తీసుకువెళ్లిన నేత ములాయం సింగ్‌ ‌యాదవ్‌. ‌మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదికను అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజకీయ రణరంగంలో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు.మాజీ ప్రధానులు చరణ్‌ ‌సింగ్‌, ‌వీపీ సింగ్‌, ‌చంద్రశేఖర్‌ ‌పనితీరుతో ప్రేరణ పొందారు. దళితులు, ఓబీసీలు, మైనారిటీలను ఏకతాటిపైకి తెచ్చే కూటమిని ఏర్పాటు చేసి, కార్మికులు, రైతులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, విద్యార్థుల సంక్షేమం హక్కుల రక్షణ కోరుతూ అనేక పోరాటాలు చేసినారు. దేశంలో ప్రభుత్వాల నయా ఉదారవాద విధానాలు, నిరంకుశ పాలన పేదలు, ధనికులు మధ్య తీవ్ర అగాధాన్ని పెంచుతున్నది.

పేదలు, మైనార్టీలు, వెనుకబడిన తరగతుల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో సోషలిస్టు ఉద్యమమే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం. కుల, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమాజ్‌ ‌వాదీ ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. ములాయం సింగ్‌ ‌యాదవ్‌ ‌స్థాపించిన సమాజ్‌ ‌వాదీ పార్టీ(ఎస్పీ), మతతత్వ, కులతత్వ శక్తులతో పోరాడుతూ సైద్ధాంతికంగా గట్టి పునాదులను నిర్మించుకోగలిగింది.

మతం పేరుతో రాజకీయాలు చేయకూడదని బీజేపీ దూకుడును తట్టుకుని యూపీలో తన ఉనికి కాపాడుకోవడానికి ఎస్పీ.. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేతతో కేసీఆర్‌ ‌తో చేతులు కలిపింది.ఆయన స్థాపించిన సమాజ్‌ ‌వాదీ పార్టీ ఇప్పటికీ దేశానికి కొత్త ఆశలు కల్పిస్తూ రాజకీయాలను పునర్నిర్వచిస్తూ కొత్త బలాలను సమీకరిస్తున్నది. ఉత్తర ప్రదేశ్‌ ‌రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకుని, ‘నేతాజీ’గా పేరు సంపాదించుకున్న సమాజ్‌ ‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,మార్గనిర్దేశకులు తండ్రి మరణం అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌కు, ఎస్పీకి తీరని లోటు. అయినప్పటికి, ములాయం ప్రత్యక్ష రాజకీయాలకు గత కొన్నేళ్లుగా దూరంగానే ఉన్నారు. కాబట్టి సమాజ్‌ ‌వాదీ పార్టీపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

డా. సంగని మల్లేశ్వర్‌,‌ జర్నలిజం విభాగాధిపతి,

కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్‌,

‌సెల్‌ -9866255355.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page