ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తెలంగాణ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావును నేతలు ప్రజాప్రతినిధులు కలుసుకున్నారు. ఇటీవల కల్వకుర్తి నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు ఠాగూర్ బాలాజీ సింగ్ హరీష్ రావు ను కలుసుకోవడంతో ఈ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.. ఇటీవల కాలంలో జైపాల్ యాదవ్ కు మరోసారి బి ఆర్ ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో బాలాజీ సింగ్ అసమ్మతి వర్గాన్ని చేరదీస్తూ ఆయా మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఈసారి తాము జైపాల్ యాదవ్ కు సహకరించమని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఈ అసమ్మతినేతలంతా హరీష్ రావు ను కలుసుకోవడంలో మతలబు ఏమటోనని ఇక్కడి ప్రాంత ప్రజలు, పలువురు అసమ్మతి నేతలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కూడా వీరు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రులను కలిసిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ వస్పుల జంగయ్య, మాజీ ఎంపిటిసి గుర్రం కేశవులు, కడ్తాల్ ఎంపీపీ భర్త కమ్లి మోత్య నాయక్, కళాకారుడు బోదాసు వెంకటరమణ తదితరులు ఉన్నారు.