దశాబ్దాల పోరాట క్రమంలో, తెలంగాణ వాసుల చిరకాల వాంఛ నేపథ్యంలో, పలువురి త్యాగాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసన సభ రద్దు జరిగి ఐదేళ్ళు గడిచాయి. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసిఆర్ నేతృత్వంలో ఆవిర్భవించిన తెరాస, కోరి తెచ్చుకున్న నూతన రాష్ట్రంలో జరిగిన తొట్టతొలి శాసస సభ సాధారణ ఎన్నికల్లో అత్యధిక సీట్లు పొంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014, జూన్ 2న ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మొదటి ప్రభుత్వం ఏర్పాటయింది. అలా నూతన రాష్ట్ర తొలి శాసనసభ 2014 జూన్ 2న ఏర్పడి, 2018 సెప్టెంబరు 6 వరకు 4 సంవత్సరాల 3 నెలల 5 రోజుల పాటు కొనసాగి, గడువు తీరక ముందే సెప్టెంబరు 6న శాసన సభను అర్థాంతరంగా రద్దు పరిచారు. నిర్ణీత ఐదు సంవత్సరాల కాలపరిమితికి తొమ్మిది మాసాల ముందే 2018 సెప్టెంబరు 6వ తేదీన అనూహ్య రీతిలో శాసన సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ప్రతి పక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా, మహాకూటమి ఏర్పడినా సమయాభావం, సమన్వయ లోపం, విపక్షాల బలహీనతల వల్ల ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి అధికార పీఠాన్ని హస్తంకు గతం చేసి, తాము హస్తగతం చేసుకున్నారు.
2018 సెప్టెంబరు 6వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు తొలి శాసనసభ రద్దు చేయబడింది. ప్రగతి భవన్‌లో ఆరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్య మంత్రి కేసిఆర్ శాసనసభ రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన తక్షణం మంత్రివర్గం మద్దతు పలకడంతో, శాసనసభను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మధ్యాహ్నం 1.15 గంటలకు కేసీఆర్… రాజ్ భవన్ వెళ్ళి, రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మానం ప్రతిని నాటి గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ కు అందజేశారు. తద్వారా రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయించారు. అయితే కేసిఆర్ మంత్రివర్గాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగాలని గవర్నర్ కోరగా, రెండవసారి ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రి, మంత్రులు ఆపద్ధర్మ పదవులు, బాధ్యత లతో కొనసాగారు. సిరికొండ మధుసూదనా చారి శాసన సభాపతిగా, పద్మా దేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ గా, కుందూరు జానారెడ్డి ప్రతిపక్ష నాయకునిగా తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించిన కేసిఆర్ నేతృత్వంలోని తొలి ప్రభుత్వ సంబంధిత శాసనసభ మొదటి రోజు 2014 జూన్ 9న తొలి సమావేశమై, 2018 సెప్టెంబరు 6న ఆయువు తీరక ముందే అస్తమించింది.
2018 డిసెంబర్ 7న జరిగిన శాసనసభ సాధారణ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ (టిడిపి), కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం), బిజెపి – తెలంగాణాలోని 119 స్థానాలకు పోటీ చేసిన ప్రధాన రాజకీయ పార్టీలు. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి ‘ప్రజాకూటమి’గా మహాకూటమిగా ఏర్పడ్డాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో చంద్రశేఖర్ రావు 119 మంది సభ్యుల అసెంబ్లీలో 88 స్థానాలను గెలుచుకుని తన పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించారు. 21 సీట్లతో ప్రజాకూటమి ప్రతిపక్షానికి పరిమితమైంది. జాతీయ కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు రాగా, బీజేపీ కేవలం 1 స్థానంతో సరిపెట్టుకోగా, తెలుగు దేశం 2 స్థానాల్లో, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి 1స్థానంలో, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించింది. తెరాసకు 2014లో 34.15 శాతం ఓట్లు రాగా, 2018లో 12.75 శాతం పెరిగి 46.9 శాతానికి చేరింది. కారు జోరుకు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి వంటి హేమాహేమీలంతా ఓడిపోయారు.
2014 -2018 మధ్య తెలంగాణ రాష్ట్ర సమితి అనుసరించిన ఫిరాయింపు వ్యూహం వల్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ వంటి పార్టీలు పూర్తిగా అసెంబ్లీ నుంచి మాయమయ్యాయి. గెలిచిన 88కి తోడుగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్, వైరా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్‌లు చేరగా, అధికార పార్టీ సభ్యుల సంఖ్య 90కి చేరింది. కాంగ్రెస్ తరపున ఎనిమిది మంది, టీడీపీ ఇద్దరిని కలుపుకోగా, అలా వివిధ పార్టీల నుంచి 16మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లోకి వచ్చి చేరారు. రాష్ట్ర అసెంబ్లీలో 105మంది (ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని కలుపుకొని) ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో టీఆర్‌ఎస్ కొనసాగగా, ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్‌కు ఐదుగురు, బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.
ప్రస్తుతం 2023 డిసెంబర్ వరకు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉండి, సాధారణ ఎన్నికలకు సాధారణ గడువుండగా… 2018 తరహాలోనే 115 మంది పార్టీ అభ్యర్థులను ఏక కాలంలో ప్రకటించి భారతీయ రాష్ట్ర సమితి గా రూపాంతరం చెంది ఎన్నికలకు సంసిద్దమైన కేసిఆర్ నేతృత్వంలోని భా. రా.స పార్టీ 2018లో తమకు కలిసి వచ్చిన రీతిలోనే ఈసారి కూడా కేసీఆర్ తమదైన వ్యూహంతో ముందుకు సాగి, అన్ని వనరుల ద్వారా సర్వేలు నిర్వహింప చేస్తూ, కేసిఆర్ ఎన్నికల బరిలో దిగేందుకు సకల అస్త్ర శస్త్ర సమేతంగా సిద్దం కాగా, ప్రసార, ప్రచార, సామాజిక మాధ్యమాలు, వివిధ సర్వేలు, విశ్లేషణలూ అనునిత్యం సర్వత్రా ఆసక్తిని రేపుతునే ఉన్నాయి.
– ప్రజాతంత్ర డెస్క్