ఈరోజు పొద్దున్నే వెలుతురొచ్చింది
వెండిలా పరుచుకుంది వాకిట్లో
చెట్లు నిశ్చలంగా పాటలు పాడుతున్నాయి
కండ్లు ప్రకృతిని మొరపెట్టుకున్నాయి
నీ అప్పు తిరిగి ఇచ్చేస్తాం
ఆలస్యమైనా కడతాం మాటిస్తున్నాం
మమ్ములను నీ వాసన
దారుల్లో తచ్చాడనీయ్‌
అలగకు ఒరగకు క్షమించు
గాయాలకు నూనె రాస్తే తగ్గవని తెలుసు
మరచి మాయామోహంతో ఉన్నాం
వైరుధ్యాల తలంపై తిరుగాడుతున్నాం
వైషమ్యాలను మోస్తూ పోతున్నాం
కాళ్ళకు నిప్పంటించుకొని
పరిగెడుతున్నాం
ఒక కాలువలో రాగాన్ని దగా చేశాం
మార్చుకుంటాం మెల్లగా మా పద్ధతిని
ఆక్రమణను విరమించుకుంటాం
మా గాలులను శుభ్రపరుచుకుంటాం
మా స్వభావాలను సేద్యపరుచుకుంటాం
మేము మీతో పచ్చగా నిలబడతాం
ఎండిన పుల్లలైనా ఏరుకుంటాం
మా దుస్తుల్లోంచి పిచ్చుకలను వదిలేస్తాం
అరచేతితో జీవజంతువును దువ్వుతాం
చెట్టు తొర్రలో ఒక పాటను ఆలపిస్తాం
చరిత్ర గీతను వక్రీకరించకుండా
యుద్ధమేఘాలను పాలనురగతో కడుగుతాం
కాఠిన్యాలను నీ వస్త్రంతో దులుపుతాం
మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం పాటిస్తామని
మేం పరిణతి చెందిన మనుషులమని
మరొక్కమారు గుర్తుచేసుకుంటున్నాం..!
-వగ్గు రఘువీర్‌
9603245215

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page