కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఉద్యోగులందరం పదిరోజులపాటు పెన్ డౌన్ ప్రకటించాం. జేఏసీ నిర్మాణం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే. రాజకీయ పార్టీలకు అతీతంగా అప్పుడు బీజేపీ, సీపీఐ, టి.ఆర్.ఎస్ పార్టీలు కలసిసొచ్చాయి. రాష్ట్ర సాధనకు వెళ్లేలా చేసింది. తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట గర్జన అనేది. ఒక మలుపు. రెండవది పెన్ డౌన్. ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆ సమయంలో నేను పొందిన అనుభూతి అంతా ఇంతాకాదు..తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన ఉద్యమంలో ఉద్యోగులను ముందుండి నడిపే అదృష్టం నాకు లభించడం ఒక తెలంగాణ బిడ్డగా సంతోషంగా ఫీలవుతున్నాను.
తెలంగాణ ఉద్యమ, ఉద్యోగుల నాయకుడుగా అందరి అభిమానాన్ని పొందిన గుండవరం దేవీప్రసాద్ తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా రెండేళ్ల పాటు కొనసాగారు. 5 ఏప్రిల్ 1958లో జన్మించిన ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కర్తవ్యాన్ని సమర్ధవంతంగా పోషించి..తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగానూ పేరు తెచ్చుకున్నారు. తన యూనియన్ తో పాటు తెలంగాణా ఉద్యమంలోనూ అగ్రగామిగానే అడుగులు వేశారు. మెదక్ జిల్లా అల్లీపూర్ గ్రామానికి చెందిన దేవిప్రసాద్ నీటిపారుదల శాఖ ఉద్యోగస్తులు.. పాఠశాల విద్య, గ్రాడ్యుయేషన్ మెదక్ లో పూర్తి చేశారు. ఈయన తండ్రి గుండవరం రాధాకిషన్ రావు గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. తల్లి విజయలక్ష్మి. అక్క పేరు భారతి. సోదరుడు రంగారావు. 1979లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో చేరిన ఆయన టీఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఎన్జీవో చేపట్టిన సకల జనుల సమ్మెలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆయనను ఎమ్మెల్సీకి పోటీ చేయవలసిందిగా ఆహ్వానించారు. ఆయన హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయనకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది. 25 ఫిబ్రవరి 2015న ఎమ్మెల్సీకి ఎన్నికలలో పోటీ చేసినందుకు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలో పరాజయాన్ని పొందారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా దేవీ ప్రసాద్ ను నియమించారు. ఆయనకు ఇద్దరు పిల్లలు.. కుమార్తె సహజ, కొడుకు చైతన్య కుమార్… గుండవరం దేవీ ప్రసాద్ తో ‘ప్రజాతంత్ర’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ … ..
మీ బాల్యం, విద్య, తెలంగాణ ఉద్యమంలో.. పాల్గొనడానికి ప్రేరణ, సందర్భాలు..వివరిస్తారా..?
-ముందుగా ‘ప్రజాతంత్ర’కు శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్లుగా ప్రజల పక్షంగా ఉంటూ మంచీ-చెడులను బెరీజు వేసుకుంటూ తన కలం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ.. సమస్యలకు పరిష్కారాలను చూపుతూ ముందుకు పయనిస్తున్న తెలంగాణ దినపత్రిక ‘ప్రజాతంత్ర’ తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమాల్లోనూ తనవంతు క్రియాశీల పాత్రను పోషించింది. ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలను ఇటు ప్రజల దృష్టికి, అటు ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తూ తనవంతు కృషిని నిర్విరామంగా కొనసాగిస్తూ తన కర్తవ్యాన్ని మరువకుండా విజయవంతంగా పయనించడం అనేది ‘ప్రజాతంత్ర’కే చెల్లింది. అందుకు యాజమాన్యానికి.. పత్రికలో పని చేస్తోన్న సిబ్బందికి, కలం వీరులకు అభినందనలు తెలుపుకుంటున్నాను.
ఇక నా బాల్యం, విద్య, తెలంగాణ ఉద్యమంలో …పాల్గొనడానికి ప్రేరణ, సందర్భాల విషయాలకొస్తే… ఆ సమయం అంతా మరపురాని, మరచిపోలేని మజిలీలే అని చెప్పొచ్చు. ఎందుకంటే.. కష్టాలు..కన్నీళ్లు.. ఉరుకులు.. పరుగులు ఇవన్నీ నాకు చక్కటి అనుభవాలనే నేర్పాయి. నా బాల్యం అంతా అల్లీపూర్ గ్రామం.. చిన్న కొండూరు మండలంలోనే గడిచింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు సిద్ధిపేట జిల్లా అయింది. మా గ్రామం కరీంనగర్ జిల్లా బార్డర్. గుట్టలతో కలిగిన కమ్యూనిస్టు ఉద్యమం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ అప్పుడు రజాకార్, భూస్వామ్య పోరాటాలు విస్తృతంగా జరుగుతుండేవి. స్వాతంత్య్ర పోరాటంలో మా గ్రామం అగ్రభాగాన నిలబడింది. ఆ రోజుల్లో బ్రిటీష్ సైన్యం, రజాకార్ జరిపినటువంటి కాల్పుల్లో దాదాపుగా మా గ్రామానికి చెందిన 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు చనిపోయారు. ఆ సమయంలోనే నాన్నగారు పేరొందిన కమ్యూనిస్టు నాయకుడు కావడం వల్ల కొద్ధి రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత అరెస్టు కూడా అయ్యారు. నాన్నను గుల్బర్గా జైల్లో నిర్బంధంలో పెట్టారు. ఎన్నో చిత్ర హింసలకు గురిచేశారు. 1947-1948లో విడుదలయ్యారు. ఆ సమయంలో సిద్ధిపేటలో తెలంగాణ జెండా ఎగుర వేయడానికి వీలులేకుండా ఉండేది. అప్పుడు నాన్నగారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నా బాల్యం 5,6 తరగతి వరకు మెదక్ పట్టణంలో జరిగింది. ఆ తర్వాత ఇంటర్ సిద్దిపేటలో కొనసాగింది. మాది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం చేయాలనిపించేది. ఈ నేపథ్యంలో కరీంనగ జిల్లా పెద్దపల్లిలో రెండేళ్లు ఐ.టి.ఐ లో చేరాను. 1977 చివరలో చేరితే అలా చేరిన కొద్ది నాళ్ళకే అంటే 80 నాటికి ఉద్యోగంలో చేరడం అయింది. మెదక్ లో నీటిపారుదల శాఖలో పనిచేశాను. ఇక తెలంగాణ ఉద్యమంలో …పాల్గొనడానికి ప్రేరణగా నిలిచిన సందర్భం పెద్దపల్లిలో ఉండడం వల్లే జరిగింది. సమాజం పట్ల సాగినటువంటి అధ్యయనం .. సమాజం పట్ల ఒక దృక్పథం ఏర్పడడానికి కారణమయింది. వామపక్ష ఉద్యమాలు.. ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి రాడికల్ విద్యార్ధి సంఘంలో మేం సభ్యులుగా చేరడం.. గ్రామాలకు తరలండి అనే క్యాంపైన్ లో పాల్గొనడం.. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్ధి సమస్యలపై అనేక పోరాటాలు చేయడం ఇవన్నీ మాకు ప్రేరణలుగానే నిలిచాయి.
తెలంగాణా రాష్ట్ర ఆకాంక్ష మీకు ఎపుడు…అంటే ఏ వయస్సులో కలిగింది..?
-చదువుకుంటున్న సమయంలోనే.. అప్పుడున్న పరిస్థితులను చూసి మనసు కలత చెందేది. గ్రామాల్లో అసమానతలు ఎందుకున్నాయో అనిపించేవి. కొందరి చేతుల్లోనే భూములు ఎందుకుంటున్నాయ్? కూలీలు.. కూలీలుగానే ఎందుకు మిగిలిపోతున్నారు? పేదలు.. ఇంకా పేదలుగానే ఎందుకుండాల్సి వస్తోంది? స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏళ్లయినా ఈ పరిస్థితిలో ఎందుకు మార్పు రాలేదు? గ్రామాల్లో పరిస్థితులు మారనేలేదు అనేటటువంటి ఆవేదన తీవ్రంగా కలిచివేసేది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయనే ఆశ కలిగేది. ఆ దిశగా జరిగిన పోరాటాలు.. జరుగుతున్న ఉద్యమాలు చూసి గుండెలోతుల్లో అలజడులు విస్ఫోటనంలా తట్టిలేపేవి.
క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో ఎప్పటినుంచి పని చేసారు..?
-కరీంనగర్ జిల్లా రాడికల్ విద్యార్ధి సంఘం ఎమర్జెన్సీ సడలించిన తర్వాత అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలతోపాటు.. జగిత్యాల జైత్రయాత్ర లో కూడా పాల్గొంటూ రాడికల్ విద్యార్ధి సంఘంలో చురుకైన పాత్రనే పోషించడం జరిగింది. ఆనాడు రాడికల్ సంఘం ఇచ్చినటువంటి ఆలోచన, దృక్పథం, రాడికల్ సంఘం నిర్వహించిన అనేక కార్యక్రమాలు, అధ్యయనాలు… ఇవన్నీ కూడా అప్పట్లో మాకు తెలంగాణా రాష్ట్ర సాధన వైపునకే మార్గాన్ని చూపాయి. క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేశాయి. ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి.. ఈ సమాజాన్నిసరైన రీతిలో నిలపడానికి.. సక్రమమైన మార్గంలో పయనించేలా ఆవిష్కరించడానికి నాకు వామపక్ష ఉద్యమం గొప్ప విజ్ఞానాన్ని అందించిందని చెప్పొచ్చు.
మీరు ప్రత్యక్షంగా పాల్గొన్న తెలంగాణ వేదికలు, సదస్సులు, …జేఏసిలో అనుభవాలు..?
-తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రధానమైనటువంటి వేదికలు ఏం లేవు. ఏ రాజకీయ పార్టీ జై తెలంగాణ అనలేదు. అప్పటికి జేఏసీ నిర్మాణం జరగలేదు. జై తెలంగాణ అనడానికి రాజకీయ పార్టీలు నామోషీగా ఫీలయ్యాయి. తెలంగాణ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో మేమే వేదికలు సృష్టించుకొని 610 జీ ఓ అమలుకోసం.. మా ఉద్యోగాలు మాకు కావాలనే విషయంలో ముందడుగు వేయడం జరిగింది. మా వేదికలన్నీకూడా తెలంగాణ ఎన్జీవో సంఘం పేరు మీదనే పనిచేశాయి. ఈ సాధనలో ఆ తరువాత కాలంలో వివిధ ప్రజాసంఘాలు పెట్టినటువంటి అనేక వేదికలపై మేము పాలుపంచుకున్నాం. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెట్టాం. తెలంగాణ జనసభ పెట్టిన. తెలంగాణ చైతన్య వేదికకానీ, మంజీర రచయితల సంఘం కానీ , తెలంగాణ రచయితల వేదికలు కానీ, తెలంగాణ జర్నలిస్టు సంఘం కానీ ఇలా..ఏ సంఘం పెట్టినా ఆయా వేదికలపై మేం పాల్గొన్నాం. వీటన్నింటిలో ఎన్జీవో సంఘం భాగమైంది. జేఏసిలో అనుభవాలు..కంటే కూడా జేఏసి ప్రారంభమైన విషయాన్ని మనం ఈ సందర్బంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణా జేఏసీ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వరకు లేదు. హైదరాబాద్ ఫ్రీజోన్ అని ప్రకటించారు. దానికి వ్యతిరేకంగా మేం పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్దగల అమరవీరుల స్థూపం వరకు వెళ్ళాం. ఆందోళన చేశాం. ప్రస్తుత పరిస్థితులపై ‘రాజకీయ నాయకులారా ఏకం కండి’ అంటూ రాజకీయ నాయకులను ప్రశ్నించాం. అయినా ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదు. ఆ సమయంలో కేసీఆర్ ఒక్కరే ఎన్జీవో సంఘానికి అండగా నిలబడ్డారు. ఫ్రీజోన్ ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని చెప్పారు. ఫలితంగా సిద్ధిపేటలో పెద్ద ఎత్తున ఉద్యోగుల సభ పెట్టాం. అక్టోబర్ లో ఫ్రీ జోన్ వస్తే మేము అన్ని జిల్లాలు తిరిగి అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. కేసీఆర్ అండతో సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన పేరు మీద సభ నిర్వహించాం. 1969 తెలంగాణ ఉద్యమం తరువాత.. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అంత పెద్ద ఎత్తున జరిగిన సభ లేదు. దాదాపు 2 లక్షల మంది పాల్గొన్న ఈ సభలో లక్షకు పైగా తెలంగాణ ఉద్యోగులు, మరో లక్షకు పైగా ప్రజలు పాల్గొన్న సభ ఇది. ఈ వేదిక మీద స్వామిగౌడ్, నేను, కేసీఆర్ ప్రసంగించాం. అప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలన్న డిమాండ్ కాస్త రాష్ట్ర సాధన ఉద్యమంగా మలచాలని తీర్మానించడం జరిగింది. ఆ సమయంలోనే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటాని ముందుకు వచ్చారు. ఆ దీక్షకు మేము సైతం అంటూ తెలంగాణ ఎన్జీవో సంఘం ఆయన వెంటే నడిచింది. అరెస్టులకు భయపడం.. సమ్మెలకు భయపడం.. భర్తరఫ్ లకైనా వెనకడుగు వేసేది లేదు అంటూ చెప్పడంతో కేసీఆర్ దీక్షకు పూనుకున్నారు. అక్కడ ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం తరలించి నిర్బంధించారు. కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఉద్యోగులందరం పదిరోజులపాటు పెన్ డౌన్ ప్రకటించాం. జేఏసీ నిర్మాణం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే. రాజకీయ పార్టీలకు అతీతంగా అప్పుడు బీజేపీ, సీపీఐ, టి.ఆర్.ఎస్ పార్టీలు కలసిసొచ్చాయి. రాష్ట్ర సాధనకు వెళ్లేలా చేసింది. తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట గర్జన అనేది. ఒక మలుపు. రెండవది పెన్ డౌన్. ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆ సమయంలో నేను పొందిన అనుభూతి అంతా ఇంతాకాదు..తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన ఉద్యమంలో ఉద్యోగులను ముందుండి నడిపే అదృష్టం నాకు లభించడం ఒక తెలంగాణ బిడ్డగా సంతోషంగా ఫీలవుతున్నాను.
తెలంగాణా కల సాకారమవుతుంది అని మీరు ఆశించారా…?
– మాకు మొదట్లో తెలంగాణా కల సాకారమవుతుందనేటువంటి ఆశ లేకుండేది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగే ఉద్యమం సఫలీకృతం కావాలంటే ముందుగా ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ లో ఈ బిల్లుని ప్రవేశ పెట్టాలి. బిల్లు పెట్టాలంటే అన్ని రాజకీయ పార్టీలు దీనిని ఆమోదించాలి. కాకినాడలో బీజీపీ తీర్మానం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ మొండి చేయి చూపించింది. తెలంగాణ రాష్ట్ర సాధన జరగలేదు. అప్పుడు అనివార్యంగా ఏమైందంటే.. 2009 ఫ్రీ జోన్ ఉద్యమం తరువాత పెన్ డౌన్ చేశాం. టి.ఆర్.ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమాలు, అలాగే అనేక విద్యార్థి ఉద్యమాలు, జేఏసీ ఉద్యమాలు ఇలా తెలంగాణ సమాజం చేస్తున్నటువంటి ఉద్యమాలన్నీ కూడా వివిధ రాజకీయ పార్టీలపై అనివార్యమైన వొత్తిడి పెంచాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సాధన జరగాలి అని మొదటిసారి చిదంబరం ప్రకటన మాలో ఎంతో విశ్వాసాన్ని పెంచింది. అంతవరకు మాకు విశ్వాసం లేకుండేది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనమెన్ని ఉద్యమాలు, త్యాగాలు చేసినా కేంద్రం దిగిరావాలి. మన ఉద్యమాలకు స్పందించాలి. 1969లో కూడా చాలా త్యాగాలు చేశారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది విజయ తీరాలకు చేరలేదు. అయితే.. మన పది రోజుల పెన్ డౌన్, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఇదంతా కూడా పెను ప్రభావాన్ని చూపించింది. కేసీఆర్ నిరాహార దీక్షతో ప్రారంభమైనటువంటి సంఘటన అంతా ప్రజల్లో తీవ్ర అలజడిని సృష్టించి ఆయన వెంటే నడవడానికి సిద్ధమైంది. హమ్ సాథ్ సాథ్ హై.. అంటూ కేసీఆర్ ని ధైర్యంగా అడుగులు ముందుకు వేసేలా చేసింది. అప్పుడు అనివార్యంగా చిదంబరం ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ ప్రకటతో తెలంగాణా కల సాకారమవుతుందనేటువంటి ఆశ రెట్టింపు అయి విశ్వాసాన్ని పెంచింది. ఎప్పుడైతే..కేంద్రం మేం ప్రాసెస్ ప్రారంభిస్తామని చెప్పిందో అప్పుడే మాలో ఆనందం కలిగింది. అప్పటివరకూ ఎవ్వరూ తెలంగాణ వస్తదని.. ఇస్తామని చెప్పలేదు. గతంలో ఎన్ని కమిటీలు వేసినా కాలయాపన చేశాయే తప్ప.. విశ్వాసాన్ని కలిగించలేక పోయాయన్నదే నిజం.
నిరాశకు గురి చేసిన ఉద్యమ లేదా రాజకీయ పరిణామాలు..మలి దశ ఉద్యమంలో మీ రోల్..?
-చాలా మంచి ప్రశ్న.. ఎందుకంటే రాష్ట్ర సాధనకోసం జరుగుతున్న ఉద్యమం ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుందోనని అప్పుడప్పుడు నిరాశకు గురయ్యేవాళ్ళం. మన తెలంగాణ మనకు వస్తుందన్న నమ్మకమైతే సడలలేదు.. చిదంబరం ప్రకటన చేసిన తర్వాత సైతం తెలుగుదేశం పార్టీ మొత్తం ఆంధ్రనాయకత్వం ఎన్నో అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేసింది. టీడీపీ రెండుకళ్ల సింద్ధాంతం అని చెప్పడం కానీ.. వై.ఎస్.ఆర్ నాయకత్వం గానీ.. సీపీఎం గానీ ఇవేవీ తెలంగాణకు మద్దతు ప్రకటించలేదు. కేవలం పైపై ప్రకటన చేస్తే.. ఎందుకంటే మాకు లాబీ ఎక్కువ.. సీట్లు ఎక్కువ అని.. దిల్లీలో మళ్లీ ఈ ప్రకటనను వెనక్కుతీసుకునే ప్రక్రియ ఒకటి జరుగుతుందన్న నిరాశ కలిగిన మాట వాస్తవం. తెలంగాణ మంత్రుల మీద చావు డప్పు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీకాంతాచారి లాంటి ఎందరో మనబిడ్డలు ఆత్మ త్యాగాలు చేస్తుంటే ఈ రాజకీయ నాయకులకు ఏ మాత్రం పట్టడడం లేదని ఆవేదన చెందాం. అప్పడు ఆత్మహత్యలు వద్దు.. పోరాటాలే ముద్దు అంటూ చెబుతూ రాలిపోయిన కుటుంబాలకు ఆసరాగా నిలిచి ఉద్యోగులందరం ఒక రోజు వేతనాన్నిఒక్కొక్కరికి 25 వేలు ఇచ్చి మేమున్నామంటూ అండగా నిలిచాం. అయితే.. ఈ నిరాశను పారదోలాలంటే.. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సిన విషయాన్ని జయశంకర్, కేసీఆర్ లు చెబితే ఆ దిశగా అడుగులు వేసాం.
మలిదశ ఉద్యమంలో నా రోల్ ఏందంటే.. తెలంగాణ ఎన్జీవో సంఘం ప్రధానకార్యదర్శిగా 2008 మార్చిలో బాధ్యతలు తీసుకున్నా. అంతవరకు మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాబట్టి 2008లో హైదరాబాద్ కు వచ్చాక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాతావరణ మైతే.. వేడెక్కుతావున్నది. 610 జీఓ మీద ర్యాలీ తీయడం జరిగింది. మొట్ట మొదట నా రోల్ తెలంగాణ ఉద్యోగులందరినీ పల్లెలకు తరలించడం.. అప్పుడు రాడికల్ సంఘం పిలుపునిచ్చిన విషయం మా మదిలో ఉండడంతో అప్పుడు మేము గ్రామాలకు వెళ్లి పరిశీలన చేసి ఈ భూస్వామ్య విధానం ఎందుకుంది? అసమానతలు ఎందుకున్నాయి? ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అని అధ్యయనం చేశాం. రాష్ట్ర కార్యవర్గాన్ని అంతా పల్లెల్లోకి తీసుకెళ్లి తెలంగాణ విధ్వంసం ఎలా జరుగుతుందో వివరించాం. తెలంగాణ ఎందుకు రావాలన్నది పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తే తప్ప అర్ధంకాదు. తెలంగాణా వస్తే ఏం జరుగుతుందన్నది ప్రస్తుతమున్న తెలంగాణ ప్రాంత పరిస్థితే చక్కటి నిదర్శనం. తెలంగాణ ఉద్యమం మొదలవుతున్న ప్రాథమిక దశలోనే నేను తెలంగాణా ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శిగా రావడం.. రావడంతోనే తెలంగాణ ఎన్జీవోను సృజనాత్మక మార్గంలో నడిపేలా చర్యలు తీసుకోవడం.. 610 ర్యాలీ, పెన్ డౌన్, సకల జనుల సమ్మె, జేఏసీ నిర్మాణం.. కన్వీనర్ గా బాధ్యతలు… ఇవన్నీ నాకు గొప్ప అవకాశాన్ని కలిగించాయి. ఇలాంటి అవకాశం అందరికీ రాదు.. ఆ సమయంలో నేను తిరగని పల్లె లేదు.. ఉండని గుడిసె లేదు. తెలంగాణా రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుకొని 2014 పార్లమెంట్ లో బిల్లు పాసయ్యే వరకు దాదాపు ఎనమిదేళ్లపాటు.. 24 గంటలూ తెలంగాణ ఉద్యమంలో గడపడం నాకూ మాత్రమే లభించిన అదృష్ఠంగా భావిస్తున్నా. రాజీలేని పోరాటాన్ని ఉద్యోగులతో నడిపిన గొప్ప అనుభవాన్ని చూశాను. తెలంగాణ ఉద్యమం కోసం.. రాష్ట్ర సాధన కోసం జెండా పట్టుకున్నప్పటినుండి జెండా ఎగురవేసి తెలంగాణ ప్రజలు పండుగ చేసుకునే వరకు జరిగిన పోరాటాల్లో ప్రతీ అడుగులు నేనుండడం నా అదృష్ఠంగా భావిస్తున్నా.
రాష్ట్ర విభజన లాబీయింగ్ వల్లనా.. ఉద్యమం ద్వారా సాధ్యమయిందా..?
– తెలంగాణ ఆకాంక్ష ఇప్పుడొచ్చిందేం కాదు..ఓ సుదీర్ఘమైన కాలంనుంచీ ఉన్నదే. రాష్ట్రాల పునర్విభజన జరగాలని 52లో ఫజల్ అలీ కమిషన్ వేస్తే దానికి మొట్టమొదటి సారి హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ను కలపొద్దని చెప్పి మా రాష్ట్రం మాకు సపరేటుగా ఉండాలని కొట్లాడింది తెలంగాణ ఎన్జీవో సంఘం. అప్పుడు ఏ రాజకీయపార్టీ అంత చైతన్యవంతంగా లేదు. ఫజల్ అలీ కమిషన్ ను మేము తీవ్రంగా వ్యతిరేకించాం. ముల్కీ రూల్స్ పై ఉద్యమం చేశాం. ఆర్.ఎస్.ఎస్. -ఆర్.ఎస్.యూలవి భిన్న ధృవాలు అయినప్పటికీ తెలంగాణా కోసం కలిసికట్టుగానే పోరాడేలా చేశాం. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అవేవీ నిలబడలేదు. రాష్ట్ర సాధన జరగలేదు. కేసీఆర్ వచ్చాక జరిగిన ఉద్యమాలే ఫలితాన్నిచ్చి రాష్ట్రాన్ని తెచ్చిపెట్టింది. తెలంగాణాలో జరిగిన ప్రతీ పరిణామాన్ని, ప్రతి ఉద్యమాన్ని, ప్రతి త్యాగాన్ని.. ప్రతీ సందర్భాన్ని కేంద్ర నాయకులకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీల ద్వారా జరిగింది. 2001లో కేసీఆర్ తో ప్రారంభమైన ఉద్యమం రాజకీయ ఉద్యమంగా మలువు తీసుకొని అనేక త్యాగాలతో , ఉద్యమాలతో.. పోరాటాలతో.. బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమయింది. అందుకే.. రాష్ట్ర విభజన అనేది లాబీయింగ్ వల్ల రాలేదు.. ఉద్యమం ద్వారానే సాధ్యమయిందన్నది నిజం.
రాష్ట్రంలో కొందరు నిరుద్యోగ యువత నియామకాల పట్ల ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు…..వారికి మీ సూచన…సలహా..|
-నిరుద్యోగ యువత నియామకాల పట్ల ఆందోళన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నమాట నిజమే. వారి ఆందోళనకు అర్ధం ఉంది. ఐతే.. ఇవ్వాళ మనం సాధించిన ప్రగతివల్ల ఎన్నో ఉద్యోగాలు సృష్టించుకున్నాం. మన రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వెలిశాయి. వేలల్లో.. లక్షల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో యువత ఆందోళన, అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూడా నిరుద్యోగ యువత విషయంలో మరింత లోతుగా అధ్యయనం చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నా. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తుందన్న నమ్మకం నాకుంది.
ఆంధ్ర పారిశ్రామికవేత్తలకు, సినిమా పరిశ్రమ పైన తెలంగాణా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలంగాణవాదుల అభిప్రాయం…?
రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పాల్గొన్న జర్నలిస్టులకు … వారికి అండగా నిలిచిన పత్రికలకు.. స్వరాష్ట్రంలో సముచిత స్థానం దక్కింది అని మీరు భావిస్తున్నారా..?
ధనం,ఇతర ప్రలోభాలతో కూరుకు పోయిన ఇప్పటి ఎన్నికలపై.. రాజకీయ వ్యవస్థ లో చోటు చేసుకుంటున్న ప్రతికూల వాతావరణం పై మీ అభిప్రాయం… మార్పున కు సూచనలు?
– ఎన్నికలంటేనే మొదట్లో నాకు ఓ ఒక విధమైన అభిప్రాయం ఉండేది. వీటికి దూరంగా ఉంటూ.. ఇవి మనకు సంబంధించినవి కావులే.. అనుకునేవాడిని. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. ఉద్యమాలు చూసి ఎన్నికలు మనకు ఎంత ప్రాముఖ్యమైనవో తెలుసుకున్న. అయితే.. ఇప్పుడున్న ఎన్నికలు కాస్ట్లీ గా మారాయి. విలువలు లేకుండా పోయాయి. సామాన్యుడు ఎన్నికల్లో పాల్గొనడం అనేదే మృగ్యమైపోయింది. మహానుభావుడు డా.బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగం రచించి… బడుగు, బలహీన వర్గాలు, దళితులకు సముచితమైన రిజర్వేషన్లు కల్పించడంవల్ల అటువంటి వాళ్ళు చట్టసభల్లో అడుగుపెట్టడానికి మార్గం ఏర్పడింది . రిజర్వేషన్ లేనటువంటి ప్రాంతంలో సామాన్యుడు అనేవాడు ఎంటర్ అవడం అనేది దాదాపుగా మూసుకుపోయిందనేది వాస్తవం. రాజకీయాల్లో రాణించాలంటే కొంత రాజకీయ వారసత్వం.. ఆర్థికస్థోమత ఉన్నవాళ్లకే సాధ్యమయింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సంస్కరణలు వేగవంతం చేయాలి. నిబంధనలకు విరుద్దంగా డబ్బులు, ఖర్చు చేసేవాళ్లను ఎన్నికలనుంచి డిస్ క్వాలీఫై చేయాలి. ఏ రాజకీయ పార్టీకూడా ఎన్నికల సంస్కరణలు చేయదు. ఎందుకంటే.. ఆయా పార్టీలు చేసే పని అదే కాబట్టి. ఇప్పటికైనా సామాన్యులకు వెసులుబాటు కలిగే విధంగా ఎన్నికలు ఉండాలి. ఇప్పుడు మహిళకు 33 శాతం రిజర్వేషన్ కలిపించడం మంచి పరిణామం. ఇలాంటి రిజర్వేషన్ ద్వారా సామాన్యులు రాజకీయాల్లోకి అడుగుపెట్టే పరిస్థితి వస్తుందనిది నా అభిప్రాయం.
కేసీఆర్ కాకుండా… రాజకీయాల్లో మీ రోల్ మాడల్ ఎవరు..?
-అసలు కేసీఆర్ కంటే ముందు మేము రాజకీయాల గురించి ఆలోచించలేదు. ఎన్నికలు బహిష్కరించాలని మేము గోడలమీద నినాదాలు రాసినం. పార్లమెంటులు.. అసెంబ్లీలు పనికిరావు. అలాంటి రాజకీయ నేపథ్యం నుండి వచ్చినటువంటివ వాళ్లం. అసలు మాకు రాజకీయాలంటేనే అసహ్యం. అలాంటి ధోరణీ నుండి తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ఉద్యమాల వల్ల రాజకీయాలకు కొంత దగ్గరయ్యాం. జేఏసీలో పాలు పంచుకోవడం గానీ.. అన్ని రాజకీయ పార్టీలతో అనుబంధం ఉండడం వల్ల ఆ వైపుగా ఆలోచనను కొనసాగించాం. అంతకు ముందు మా రాజకీయాలు వేరు.. మా జీవితం వేరు. . మా లక్ష్యాలు వేరు. తెలంగాణకు సంబంధించి అనేక మందిని ఒక్కతాటిపై తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దే. కష్టాల్లో ఉన్న ప్రజల పక్షాన నిలబడాలి. .. వారికోసం అహర్నిశలు పాటుపడాలి… వారి గురించే ఆలోచించాలి. వారి కన్నీళ్లు తుడవాలి. పేదప్రజల పట్ల ప్రేమను పంచాలి. ఆ విధంగా చూస్తే.. పార్లమెంటరీ రాజకీయాలకి .. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా రోల్ మాడల్ కచ్చితంగా కేసీఆరే ఆయన తప్ప ప్రత్యామ్నాయం మరొకరు లేరు. అయితే.. ఆ తర్వాత మా జీవితాలకు సంబంధించి దాదాపు అలాంటి లక్షణాలు పుణికిపుచ్చుకున్న మా అమ్మ-నాన్నలు కూడా మా రోల్ మాడల్ లు. 2001కి ముందు నాకు కేసీఆర్ తెలియదు. 2001 తర్వాత టీఆర్ ఎస్ ఏర్పడ్డాక వారితో మాకు పరిచయం కలిగింది. ఇవ్వాళ కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ.. హరీష్ రావు గానీ.. వాళ్ళ ప్రస్తుత పనితీరు.. చూస్తావుంటే.. ప్రజాప్రతినిధులంటే ఇలా ఉండాలే అనిపిస్తుంది. టీఆర్ ఎస్ లో మంచి నాయకత్వం ఎదుగుతున్నది. ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమవుతున్నారు. ఇలాంటి వాళ్ళే ప్రతీ ఒక్కరికీ రోల్ మాడల్ గా నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆఖరిగా.. రాష్ట్ర బ్రేవరీస్ కార్పొరేషన్ కు గతంలో మీరు చైర్మన్ గా ఉన్నారు.. రాష్ట్రంలో మద్యం సరఫరా పై పలు విమర్శలున్నాయి.. మద్యం పాలసీ పై మీ అభిప్రాయం..?
-మద్యపానం నిషేధించాలని ఈ రాష్ట్రంలో జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నవాడిని నేను. జర్నలిసుల సంఘం, ఎన్జీవో సంఘం, మంజీరా రచయితల సంఘం.. వివిధ సంఘాలు మెదక్ జిల్లాలో మద్యపాన నిషేధం ఉండాలని పెద్ద ఎత్తున జరిపిన ఉద్యమాల్లో పాలుపంచుకున్నవాడిని నేను ఆఖరికి అదే సంస్థకి అనివార్యంగా చైర్మన్ గా ఉండాల్సి వచ్చింది. ఇదొక విచిత్రం. బ్రేవరీస్ కార్పొరేషన్ కు చైర్మన్ కావడం అనివార్యమే. రెండేళ్లు పనిచేశా. ఏదేమైనప్పటికీ మద్యపాన నిషేదంపై ప్రజల్లో చైతన్యం రావాలి. గతంలో గ్రామాల్లో మహిళలు విజృభించినట్టుగా ఉండాలి. కానీ ఇప్పడు ఇది సాధ్యమా..? కేసీఆర్ ఒక సందర్భంలో చెప్పారు.. మంచి రాబడి వచ్చాక ప్రజల మీద పెట్టుబడులు పెట్టేటటువంటి సందర్భాలు పోయినాక.. మద్యపానం మీద నిషేధం పెట్టొచ్చు అన్నారు. చివరగా ఈ దేశంలో.. ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉండాలని కోరుకునే వాడిలో నేనూ ఒకడిని.-ఎం.డి. అబ్దుల్, ప్రజాతంత్ర
ఉద్యోగుల మనోభావాలని ఆవిష్కరించిన పీఆర్సీ